పనీర్ రుచిగా ఉండటమే కాదు.. మంచి పోషకాహారం కూడా. దీంతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. సాధారణంగా దమ్ పనీర్, చిల్లీ పనీర్ వంటి కూరలు, టిక్కా, పకోడీ, సమోసా లాంటి చిరుతిళ్లు, ఖీర్, సందేశ్ లాంటి స్వీట్లు చేసుకుంటూ ఉంటారు. అలాగే మరెన్నో రుచులను కూడా పనీర్‌తో ఆస్వాదించవచ్చు. అలాంటి వెరైటీలు మీ కోసం కొన్ని…
కుర్మా
కావల్సిన పదార్థాలు: పనీర్ – పావు కిలో, ఉల్లి తరుగు, కొబ్బరి తురుము – అర కప్పు చొప్పున, పుదీనా, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, టొమాటో ప్యూరీ – కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు స్పూన్, బిర్యానీ ఆకు – ఒకటి, యాలకులు, నల్ల యాలకులు – రెండు చొప్పున, జీలకర్ర, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద – స్పూన్ చొప్పున, ధనియాలు, జీలకర్ర పొడులు, గరంమసాలా – అర స్పూన్ చొప్పున, బాదం, జీడిపప్పులు – గుప్పెడు, పెరుగు – అర కప్పు, నూనె – నాలుగు స్పూన్లు
తయారు చేసే విధానం: సగం నూనె వేడిచేసి.. పనీర్ ముక్కలను వేయించాలి. బాదంపప్పులను వేడినీళ్లలో నానబెట్టి పొట్టు తీయాలి. అందులో కొద్దిగా నీళ్లు, జీడిపప్పులు, కొబ్బరి తురుము జోడించి గ్రైండ్ చేయాలి. పాన్‌లో మిగిలిన నూనె వేసి.. బిర్యానీ ఆకు, జీలకర్ర, రెండు రకాల యాలకులను వేయించాలి. అవి వేగాక.. ఉల్లి తరుగును దోరగా వేయించి.. అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, పసుపు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, టొమాటో ప్యూరీ జోడించి కలియతిప్పుతుండాలి. నాలుగు నిమిషాలయ్యాక కొబ్బరి మిశ్రమం జతచేయాలి. మరో ఏడెనిమిది నిమిషాల తర్వాత వేయించిన పనీర్, గరంమసాలా, ధనియాల పొడి, పెరుగు చేర్చాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేస్తే.. వహ్వా అనిపించే‘పనీర్ కుర్మా’ రెడీ.
మసాలా కర్రీ
కావల్సిన పదార్థాలు: పనీర్ – పావు కిలో, నూనె – మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లి తరుగు – కప్పు, టొమాటో ముక్కలు – ముప్పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర స్పూన్లు, జీడిపప్పుల పేస్ట్ – రెండున్నర టేబుల్ స్పూన్లు, వెన్న, జీలకర్ర, కసూరీ మేథీ, కారం, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముద్ద – స్పూన్ చొప్పున, గరం మసాలా, పసుపు – అర స్పూన్ చొప్పున, ధనియాల పొడి – రెండు స్పూన్లు, కొత్తిమీర తరుగు – గుప్పెడు
తయారు చేసే విధానం: పనీర్‌ను అంగుళమంత ముక్కలుగా కోసి పక్కనుంచాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి జీలకర్ర వేయాలి. అది వేగాక ఉల్లితరుగును లేత గోధుమ రంగులోకి మారే వరకూ వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి జోడించాలి. ఒక నిమిషం వేయించి.. టొమాటో ముక్కలు, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడులు, కారం, ఉప్పు వేసి కలియబెడుతూనే ఉండాలి. ముక్కలు బాగా వేగి.. నూనె తేలుతున్నప్పుడు జీడిపప్పుల పేస్ట్, కొద్దిగా నీళ్లు జోడించాలి. నాలుగు నిమిషాల తర్వాత పనీర్, గరం మసాలా, కసూరీ మేథీ, వెన్న, క్రీమ్ జతచేయాలి. సన్న సెగ మీద ఇంకో రెండు నిమిషాలుంచి.. కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే.. పసందైన ‘పనీర్ మసాలా’ తయారైపోతుంది. ఇది అన్నం, చపాతీలు ఎందులోకైనా బాగుంటుంది.
పనీర్ చీజ్ బాల్స్
కావల్సిన పదార్థాలు: పనీర్ – 200 గ్రా, చీజ్ – 100 గ్రా, ఉప్పు – తగినంత, ఆలూ – రెండు, మొక్కజొన్న పిండి – మూడు టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ – అర కప్పు, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – గుప్పెడు, అల్లం తురుము – స్పూన్, చాట్ మసాలా, కారం, మిరియాల పొడి, గరం మసాలా – అర స్పూన్ చొప్పున, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: పనీర్, చీజ్‌లను తురమాలి. ఆలూను ఉడికించి, మెదపాలి. అందులో పనీర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తురుము, చాట్ మసాలా, కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, ఒక స్పూన్ మొక్కజొన్న పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న రొట్టెల్లా చేయాలి. వాటి మధ్యలో తగినంత చీజ్ ఉంచి, అంచులు మూసేసి, బంతిలా చేయాలి. మిగిలిన మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. పనీర్ బాల్స్‌ను మొదట కార్న్‌ఫ్లోర్ పేస్ట్‌లో ముంచి, తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించి, ఫ్రిజ్‌లో ఉంచాలి. పావుగంట తర్వాత కాగుతున్న నూనెలో వేయిస్తే సరిపోతుంది. వీటికి చిల్లీ సాస్ లేదా కొబ్బరి చట్నీ బాగుంటుంది. పనీర్‌లో నీరు ఎక్కువగా ఉండకూడదు. నూనె బాగా వేడెక్కిన తర్వాత మధ్యస్థమైన సెగ మీద వేయిస్తే కరకరలాడతాయి.
బ్రెడ్ రోల్స్
కావల్సిన పదార్థాలు: పనీర్ – 200 గ్రా, బ్రెడ్ స్లైసులు – 12, ఉల్లి తరుగు, కొత్తిమీర – గుప్పెడు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముద్ద, నిమ్మరసం – స్పూన్ చొప్పున, కారం, గరం మసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా – అర స్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, మొక్కజొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: వెడల్పాటి గిన్నెలో తురిమిన పనీర్, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కారం, గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమంతో పొడవుగా రోల్స్ చేసుకోవాలి. మొక్కజొన్న పిండిలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలిపి ఉంచాలి. బ్రెడ్ స్లైసుల అంచులను తొలగించాలి. ఒక్కో స్లైస్‌ను నీళ్లలో ముంచి, వెంటనే తీసేయాలి. దాని మధ్యలో పనీర్ ఫిల్లింగ్ను ఉంచి, చాపలా చుట్టి, అంచులను మూసేయాలి. వీటిని మొక్కజొన్న పిండిలో ముంచి తీసి, కాగుతున్న నూనెలో వేయిస్తే.. పనీర్ బ్రెడ్ రోల్స్ సిద్ధం. ఇవి సాయంత్రం చిరుతిండిగా చాలా బాగుంటాయి.



