Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయంరూ.9 లక్షల కోట్లసంపద ఆవిరి..

రూ.9 లక్షల కోట్లసంపద ఆవిరి..

- Advertisement -

సెన్సెక్స్‌ 778 పాయింట్లు పతనం 23,150 దిగువకు నిఫ్టీ
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం ఆశాజనకంగా ప్రారంభమైన దలాల్‌ ‌స్ర్టీట్‌.. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఊహించని రీతిలో కుప్పకూలింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న బాండ్ల రాబడులు, ముడి చమురు ధరల భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరుల విశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ ఒక శాతానికి పైగా నష్టపోయి భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 1,433 పాయింట్లు కోల్పోయి.. చివరికి 778 పాయింట్లు నష్టపోయి 74,004కు పరిమితమయ్యింది. అదే బాటలో నిఫ్టీ సైతం రోజంతా సాగిన ఒడుదొడుకుల మధ్య ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి 474 పాయింట్లు పడిపోయి.. 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద ముగిసింది. ఈ భారీ పతనం కారణంగా బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయి రూ.472 లక్షల కోట్లకు పడిపోయింది. మార్కెట్ పతనానికి పలు బలమైన కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మొదటిది అమెరికాలో పదేండ్ల ట్రెజరీ బాండ్ రాబడులు 2023 తర్వాత తొలిసారిగా 5 శాతం మైలురాయిని దాటడం. ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే అంచనాలతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కాలం పాటు ఎక్కువగానే ఉంచవచ్చనే ఆందోళనలు దీనికి కారణం. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు. సౌదీ అరేబియాలోని మిలిటరీ ఎయిర్‌బేస్‌పై హౌతి రెబెల్స్ దాడి చేయడం, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కార్గో నౌకపై దాడి జరగడం వంటి పరిణామాలు మార్కెట్లను కలవరపెట్టాయి. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు108 డాలర్లను దాటింది. మరోవైపు ఈ వారం భారీ ఎత్తున ఐపీఓలు వస్తుండటంతో సెకండరీ మార్కెట్ నుంచి భారీగా నిధులు తరలిపోవడం కూడా ఈ పతనానికి ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. రంగాల వారీగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4 శాతానికి పైగా కుప్పకూలింది. ఆటో, మెటల్, పీఎస్‌‌యూ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు 2 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో బీఈఎల్‌ షేరు 6 శాతానికి పైగా పడిపోయి అత్యధిక నష్టాలను చవిచూసింది. దీనితో పాటు ఇండిగో, టైటాన్, అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు 2 నుంచి 4 శాతం వరకు నష్టపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -