సీఎం కుటుంబానికి 308 ఎకరాల భూమి
కాంగ్రెస్ అక్రమాలు బయటపెడతామనే మాపై సస్పెన్షన్
భూభారతి, 22ఏపై సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కుటుంబానికి 308 ఎకరాలు భూమి ఉందన్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామంలోనే 175 ఎకరాలు, వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 79 ఎకరాలు, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఇతర భూమి 54 ఎకరాల చొప్పున ఉందని వివరించారు. రేవంత్‌రెడ్డి కుటుంబ భూముల వివరాలు అన్ని త్వరలో మరిన్ని బయటకి వస్తాయని చెప్పారు. ప్రజల సమస్యలు, ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే, డైవర్షన్ రాజకీయాలకు సీఎం రేవంత్‌రెడ్డి తెరలేపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను బయటపెడతామనే సభలో లేకుండా చేశారని అన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినవన్నీ అర్ధసత్యాలు, అబద్ధాలని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు టీ షర్ట్, స్టిక్కర్లు వేసుకుని వెళ్తే ఒప్పు, తాము టీ షర్టు వేసుకుని అసెంబ్లీకి వస్తే తప్పా? అని ప్రశ్నించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియమాలు వేరా? అని అడిగారు.
పథకం ప్రకారమే గెంటేశారు
వృద్ధులకు రూ.నాలుగు వేల పెన్షన్, మహిళలకు రూ.2500 ఇవ్వలేదనీ, విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు.ఈ వైఫల్యాలను టీ షర్ట్ మీద రాసుకొస్తే తమను సస్పెండ్ చేశారని అన్నారు. తాము కావాలని అసెంబ్లీ నుంచి బయటకు రాలేదనీ, పక్కా పథకం ప్రకారమే గెంటేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగితే.. కనీసం మైక్ ఇవ్వాలని అడిగినందుకు సస్పెండ్ చేశారని అన్నారు. తాము సభలో ఉంటే కాంగ్రెస్ కుంభకోణాలు, రేవంత్‌రెడ్డి కుటుంబ అవినీతి బయటపడుతుందనే భయంతోనే మొత్తం సెషన్‌కి తమను సస్పెండ్ చేశారని వివరించారు. సస్పెన్షన్ ఎత్తేస్తే ఆధారాలతో సభకు వస్తామని తమ ఎమ్మెల్యేలు సవాల్ చేశారని గుర్తు చేశారు. సీపీఐ, బీజేపీలు అడిగినా సస్పెన్షన్ ఎత్తేసే దమ్ము సీఎంకు లేదన్నారు.
సమస్యలపై ప్రశ్నిస్తామనే ఎదురుదాడి
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం తమపై ఎదురుదాడికి దిగుతోందని హరీశ్‌రావు చెప్పారు. 22ఏ నిషేధిత భూముల విషయంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు అక్షర సత్యమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంగీకరించా రని అన్నారు. 3.71 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెడితే, అది 30 లక్షల ఎకరాలకు పెరిగిందని ముఖ్యమంత్రే చెప్పారని గుర్తు చేశారు. దీనివల్ల ఎన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లు తొందరగా సంతకాలు పెట్టి అప్‌లోడ్ చేశారని సీఎం అంటున్నారనీ, తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
సీఎం, మంత్రి మాటల్లో ఎవరిది నిజం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి అన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అధికారులే 30 లక్షల ఎకరాలు అప్‌లోడ్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్నారని వివరించారు. ఆ ఇవ్దరిలో ఎవరి మాటలు నిజమని ప్రశ్నించారు. 1999 నాటి పాత జాబితాను కలెక్టర్లు అప్‌లోడ్ చేశారనీ, ప్రభుత్వం అమ్మిన హెచ్‌ఎండీఏ, యూఎల్‌సీ భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రే స్వయంగా ఒప్పుకున్నారని వివరించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు రాత్రికి రాత్రి నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించారో, అదే విధంగా ప్రజల ఆస్తులను కూడా 22ఏ నుంచి తొలగించాలని కోరారు. సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా చట్టం ఒకటే ఉండాలన్నారు. 22ఏ జాబితాలో సీఎం భూమి పెట్టింది, తీసింది బయటపెట్టాననే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
వసూళ్ల కోసమే ఈ నాటకాలు
నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించడానికి కమిటీలు వేస్తాం, మార్గదర్శకాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు తప్ప, స్పష్టమైన పరిష్కారం చూపలేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. 2023 డిసెంబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారు అనేదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
భూభారతిలో 9,200 అక్రమ రిజిస్ట్రేషన్లు
భూభారతిలో 9,200కు పైగా భూముల రిజిస్ట్రేషన్లు యజమానులకు తెలియకుండానే అక్రమంగా జరిగిపోయాయని హరీశ్‌రావు విమర్శించారు. ఇంత పెద్ద కుంభకోణంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. ధరణి ద్వారా కొన్ని లక్షల లావాదేవీలు నిమిషాల్లో జరిగాయని గుర్తు చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దాల్సింది పోయి, భూభారతి పేరుతో కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 11.19 లక్షల మంది రైతులకు ఉచితంగా సాదా బైనామాలు చేశామని గుర్తు చేశారు. 58, 59 జీవోల ద్వారా లక్షల కుటుంబాలకు పట్టాలు ఇచ్చామన్నారు.
విచారణకు మీరు సిద్ధమా?
ధరణి లేదా భూభారతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో జరిగిన వ్యవహారాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధమనీ, సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా?అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. తనకున్న వ్యవసాయ భూమి వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో, ఆదాయపు పన్నులో స్పష్టంగా ఉన్నాయనీ, ఒక్క గుంట కూడా అదనంగా లేదని స్పష్టం చేశారు. తన భూమిని సర్వే చేసిన అధికారులే రెండు గుంటలు తక్కువ ఉందని తేల్చారని గుర్తు చేశారు. తమ బంధువులు చట్టబద్ధంగా కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే దానిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ, ప్రతి రూపాయి వైట్ మనీయేనని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సంపాదించిన ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.



