Thursday, September 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుశ్రామిక రాజ్యానిదే భవిష్యత్

శ్రామిక రాజ్యానిదే భవిష్యత్

- Advertisement -

నాడు రజాకార్లు నేడు ఆర్ఎస్ఎస్ దోపిడీ దొంగలకు వారసులు
సోషలిజం కోరుకుంటున్నది కమ్యూనిస్టులే..
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి భవిష్యత్ పోరాటాలకు నాంది : సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
పలు జిల్లాల్లో తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల సభలు

నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి/సిటీ బ్యూరో/సంగారెడ్డి
దేశంలో శ్రామిక రాజ్యం వస్తుంది అనడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక స్ఫూర్తిదాయకమని, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రజలను సంఘటితం చేస్తే దేశంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో శ్రామిక రాజ్యం, సోషలిజం రావడం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ నాయకులు చరిత్రను తెలుసుకోలేని బుద్ధిహీనులని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సభలు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా
కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు కేంద్రంలో జిల్లా కార్యదర్శి బోడ సామేల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభలో జాన్ వెస్లీ మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ‘బాంచన్ దొర కాళ్ళు మొక్కుతా’ అన్న చేతులు.. బందూక్‌‌లు పట్టి.. వెట్టికి, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. చిట్యాల ఐలమ్మ నాలుగు ఎకరాల భూ పోరాటం.. విసునూరు రామచంద్రారెడ్డి 40 వేల ఎకరాల భూమిపై కొనసాగిందన్నారు. నిజాం పాలనలో కొనసాగిన బానిసత్వానికి వ్యతిరేకంగా ఈ పోరు నడిచిందని గుర్తు చేశారు. ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారని తెలిపారు.

‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదంతో భూస్వాముల చెరలో ఉన్న పది లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంపిణీ చేసిన చరిత్ర ఎర్రజెండాదేనని అన్నారు. దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి జీవం పోసిందని అన్నారు. ఈ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిందన్నారు. ఇలాంటి పోరాటాన్ని వక్రీకరిస్తూ బీజేపీ కాషాయదళం.. విమోచన దినంగా సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలకు ఎక్కడ విమోచనం కలిగిందో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ శ్రేణులకు చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలని జాన్‌‌వెస్లీ సూచించారు. సాయుధ పోరాటం కుల, మతాల కోసం సాగిన పోరాటం కాదని.. నిరంకుశ, నియంత నిజాం సర్కారుపై చేసిన మహోత్తరమైన పోరాటమని స్పష్టంచేశారు. కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగానే నిజాం సర్కార్.. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం నిజాం రజాకర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులను జైల్లో పెట్టిందని గుర్తుచేశారు. నాటి నిజాం పాలనలో భూస్వాముల వద్ద వేల ఎకరాల భూమి పోగు పడినట్టు.. నేడు మోడీ పాలనలో వేలకోట్ల ప్రజాధనం మోడీ అనునాయుల వద్ద పోగుపడుతుందన్నారు.

నిజాంల రజాకార్ల సంస్థ నాటి భూస్వాములకు ఎలా రక్షణగా ఉందో.. నేడు మోడీ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న దోపిడీదారులకు ఆర్ఎస్ఎస్ సంస్థ అలాగే అండగా ఉంటుందన్నారు.నిజాం వారసుడిగా మోడీ.. రజాకార్ల వారసులుగా ఆర్ఎస్ఎస్ పని చేస్తోందని తెలిపారు. ఆనాడు సాయుధ పోరాటంలో నిరంకుశ నిజాం సర్కార్ మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వారసులుగా.. ఎర్రజెండా బిడ్డలుగా.. భవిష్యత్‌లో‌నూ దేశంలో ఈ మోడీ లాంటి నియంత పాలకులను తరిమికొట్టేందుకు సీపీఐ(ఎం) ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కడిగళ్ల భాస్కర్, చంద్రమౌళి, ఈ.నరసింహ, కే.జగన్, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ జంగయ్య, కే.శ్రీనివాస్ రెడ్డి, అల్లంపల్లి నరసింహ, గోరింకల నరసింహ, పి.అంజయ్య, రుద్ర కుమార్, డి.కిషన్, శ్యామ్, రావుల జంగయ్య, బుగ్గ రాములు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సాయుధ రైతాంగ పోరాటం నేటికీ స్ఫూర్తి : పాలడుగు భాస్కర్‌
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటికీ స్ఫూర్తి దాయకమని, ఆ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా బుధవారం మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కమలానగర్‌ ‌పార్టీ ఆఫీసు నుంచి ఉప్పల్‌ ఎక్స్‌ ‌రోడ్డు వరకు బైక్‌ ‌ర్యాలీ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‌మాట్లాడుతూ.. నిజాం రాజు హైదరాబాద్‌‌ను భారతదేశంలో కలపకుండా నిరంకుశంగా వ్యవహరించారని, వేల ఎకరాల భూములపై పెత్తనం సాగించాడని తెలిపారు. ఆరాచక పాలనకు వ్యతిరేకంగా నిజాం పాలన అంతానికి ఆనాడు కమ్యూనిస్టులు ప్రజలను చైతన్యం చేసి ప్రజా పోరాటం సాగించారని తెలిపారు. దొడ్డి కొమురయ్యను హతమార్చిన తర్వాత పోరాటం ఉధృత రూపం దాల్చిందని వివరించారు. నిజాంకు తొత్తులుగా ఉన్న భూస్వాములు, జమిందార్లు, జాగీర్‌‌దార్లకు, దేశ్‌ ‌ముఖ్‌‌లకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచింది తెలంగాణ సాయుధ పోరాటమేనని చెప్పారు. ఈ పోరాటం ద్వారా 3వేల గ్రామాలను విముక్తి కలిగిందని, అనేక మంది ఈ పోరాటంలో అమరులయ్యారని గుర్తు చేశారు.

సమానత్వం సాధికారత కోసం మరో పోరాటం చేయాలి : చుక్క రాములు
సమానత్వం సాధికారత కోసం మరో పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని దొడ్డి కొమురయ్య విగ్రహం నుంచి న్యూ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాం రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యునిస్టులదేనన్నారు. తెలంగాణ విమోచనం పేరిట చరిత్రను మతోన్మాద శక్తులు వక్రీకరిస్తున్నాయని తెలిపారు. సాయుధ పోరాటానికి ఆర్‌ఎ‌స్‌ఎస్, బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పోరాటాన్ని హిందూ,ముస్లిం మతాల మధ్య కొట్లాటగా మార్చేస్తూ ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద భావజాలంతో ముందుకు వస్తున్న బీజేపీ తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మాణిక్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -