నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు తమ నెలవారి బిల్లులను డిజిటల్ చెల్లింపులతో చేసినట్లయితే క్యూ లైన్ లో నిలబడే సమయం ఆదా అవుతుందని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడే తెలిపారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ తదితర డిజిటల్ చెల్లింపు యాప్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ యాప్ ల ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ నుంచే రెండు నిమిషాల్లో విద్యుత్ బిల్లును చెల్లించవచ్చన్నారు.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పరిధిలోని వివిధ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. దీంతో వినియోగదారులు తమకు అనుకూలమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుని బిల్లులను సులభంగా చెల్లించవచ్చని వివరించారు. జిల్లాలో కూడా డిజిటల్ చెల్లింపు విధానం ద్వారా చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందని ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గణాంకాల ప్రకారం ఆసిఫాబాద్ సర్కిల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,05,137 మంది వినియోగదారులు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించారనీ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1,28,552 మందికి పెరిగిందన్నారు. డిజిటల్ విధానాన్ని సద్వినియోగం చేసుకొని వినియోగదారులు తమ సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు.



