23 గంటలు ఘెరావ్.. బలవంతపు రాజీనామా
ఆమె కార్యాలయానికి ‘శుద్ధి’ పేరుతో ఏబీవీపీ అవమానకర చర్యలు
కోల్కతాలోని సురేంద్రనాథ్ కాలేజీలో ఘటన
బీజేపీ ఎమ్మెల్యే నేతృత్వంలోని కళాశాల పాలకమండలి తీరుపై ప్రశ్నలు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బీజేపీ పాలనలో విద్యా సంస్థల్లో మతపరమైన వివక్ష, ఏబీవీపీ విద్యార్థి రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతాలోని చారిత్రక సురేంద్రనాథ్ కళాశాలలో ముస్లిం మహిళా వైస్ ప్రిన్సిపాల్ మొహమ్మది తారన్నుమ్పై విద్యార్థుల ఆందోళన తీవ్ర వివాదానికి దారితీసింది. సుమారు 23 గంటలపాటు తన కార్యాలయంలో విద్యార్థులు తనను చుట్టుముట్టి నిర్బంధించారనీ, ఒత్తిడితో రాజీనామా లేఖపై సంతకం చేయించారని ఆమె ఆరోపించారు. పోలీసుల రక్షణలో కళాశాల నుంచి బయటకు వచ్చిన అనంతరం.. ఆరెస్సెస్ అనుబంధ ఏబీవీపీ నేతృత్వంలోని కొంతమంది విద్యార్థులు ఆమె కార్యాలయంలో ధూపం వెలిగించి, గంగాజలం చల్లి ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో మతపరమైన వివక్ష, విద్యార్థి రాజకీయాల ప్రభావం, అధ్యాపకుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. 25 ఏండ్లుగా బోధనా రంగంలో పనిచేస్తున్న తారన్నుమ్ 2007 సెప్టెంబర్ నుంచి సురేంద్రనాథ్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్, టీచర్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 11న విద్యార్థుల ఒత్తిడితో రాజీనామా లేఖపై సంతకం చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. విద్యార్థులే లేఖను సిద్ధం చేసి సంతకం చేయించారని ఆరోపించారు. అయితే నాలుగో సంవత్సరం విద్యార్థి రజత్ అగర్ ఈ ఆరోపణలను ఖండించారు. తారన్నుమ్పై ఒత్తిడి చేయలేదని పేర్కొన్నారు.
కాగా ఈ వివాదానికి ప్రధాన కారణం న్యాయశాస్త్ర విద్యార్థుల హాజరు నిబంధనలు. సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాలంటే 65 శాతం హాజరు తప్పనిసరి. కొంతమంది విద్యార్థులకు అవసరమైన హాజరు శాతం లేకపోవడంతో నిబంధనలను అమలు చేయాలని తారన్నుమ్ నిర్ణయించారు. ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 29న జరగనున్నాయి. “ఒక వర్గం.. విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా అడ్డుకుంటోంది. అదే సమయంలో అనేక డిమాండ్లు చేస్తోంది. నేను ప్రభుత్వ ఉద్యోగిని. నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాను” అని ఆమె తెలిపారు. కళాశాలలో ఏబీవీపీకి అధికారిక యూనిట్ లేదు. అయినప్పటికీ.. దానికి చెందిన జెండా ప్రాంగణంలో కనిపిస్తోంది. ఏబీవీపీ నాయకుడు సంబిత్ దాస్.. తారన్నుమ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తారన్నుమ్ సెప్టెంబర్ 11న ప్రభుత్వానికి ఈమెయిల్ పంపి, ఒత్తిడితో రాజీనామా లేఖపై సంతకం చేయాల్సి వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ 12న రాజీనామాను బహిరంగంగా తిరస్కరించారు. అయితే ఆమె రాజీనామా చెల్లుబాటుపై కళాశాల పాలకమండలి, ఉన్నత విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. కళాశాల పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కౌస్తవ్ బాగ్చీ విద్యార్థుల ఫిర్యాదులను ఉన్నత విద్యాశాఖకు పంపించినట్టు తెలిపారు. అయితే ఈ ఘటన విద్యా సంస్థల్లో నిబంధనల అమలు, బీజేపీ పాలనలో మతపరమైన వివక్ష, రాజకీయ జోక్యం, అధ్యాపకుల భద్రత వంటి అంశాలపై చర్చకు దారితీసింది.
ముస్లిం మహిళా వైస్ ప్రిన్సిపాల్ టార్గెట్
- Advertisement -
- Advertisement -



