Saturday, September 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివినాయకా ‘‘విను’’....

వినాయకా ‘‘విను’’….

- Advertisement -

వినాయకా నిను వినాబ్రోచుటకు అని విఘ్నేశ్వరుడి మండపం నుంచి కీర్తన వినిపిస్తోంది. తరువాత ఇంకో భక్తి పాట. వెంటనే ఢూఢూ, ఢాఢా నాట్య కార్యక్రమాల్లో వేసే సినిమా పాటలు అది డిజే శబ్దాలతో. అప్పుడే వినాయకుడికి కొన్ని భూలోక విషయాలు విన్నవించుకుందామానిపించి చిన్నపాటి నివేదనలు చేద్దామనిపించి ఈ ప్రయత్నం. ఇది నిందాస్తుతిలాగ అనిపించినా అనిపించవచ్చు ఎందరో కవులు చేసిందే అది. నీకేం వినాయకా పార్వతీదేవి నీ తల్లి, అపర పరమేశ్వరుడే తండ్రి. నీకు ఏ తల కావలసితే అది అమరుస్తాడు. ప్రమధగణాలు నీ కిందే ఉంటారు. నీ చెవులు పెద్దవి కాబట్టే ఆ డిజె శబ్దాలు నిన్నేమీ చేయవు. మా చిన్న చెవులు, లోపల ఉన్న కర్ణభేరిలు నీవాటంతటి శక్తివంతమైనవి కాదు. వాటివల్ల పెద్దవాళ్లూ, చిన్నపిల్లలు ఎన్నో సమస్యలెదుర్కొంటున్నారు. వినికిడి సమస్యలు, నరాల సమస్యలు, చివరికి మానసిక సమస్యలకు కూడా ఇవి కారణమవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. పర్యావరణ వినాయకుడని కొన్నిచోట్ల మట్టిబొమ్మలు కనిపిస్తాయి కాని మిగతావన్నీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌వే. ఇక ఎల్నినో ప్రభావంతో ఎక్కడా నీళ్లులేవు. చిన్న విగ్రహాలు పెట్టమంటే నీ భక్తులు వినడంలేదు. ముందే వేడెక్కిపోతున్న ప్రపంచం చూస్తున్నాం. బాణాసంచాల హోరుతో, కాలుష్యాన్ని పెంచే రంగులు, రసాయనాలతో దాన్ని పెంచుతున్నారు.

అడవికి పోయి ఉత్తరం వైపు తలపెట్టుకొని నిద్రిస్తున్న జంతువు తలను మీ నాన్న తెమ్మన్నాడు నీకు అమర్చడానికి. ఇప్పుడు ఏనుగులకోసం, పులులు, సింహాలు ఇతర జంతువులకోసం అడవులకు ఏదిక్కుకూ పోనవసరం లేదు. అడవులను నరికేసి, కొండలను తొలిచేసి వాటి నివాసాలని ఛిద్రం చేస్తుండడంతో అవే నేరుగా మా పొలాల్లోకి, ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి. నీ విగ్రహాలు పెట్టడానికి రోడ్లవెంట ఉన్న చెట్లను ఇష్టమొచ్చినట్టు కొట్టేస్తున్నారు. గో గ్రీన్ పోయి గ్రీన్ గో అని పచ్చదనాన్ని పంపించి వేస్తున్నారు. అక్కడక్కడా పర్యావరణ వినాయకుడంటూ కొందరు పర్యావరణ ప్రియులు పెడుతున్నారు. అంతే తప్ప మిగతా అన్నిచోట్లా యధాప్రకారం అన్నీ మా ప్రకృతికి నష్టం చేసే పనులే చేస్తున్నారు. పండగముందు కూచొని అందరూ మాట్లాడుకున్నా తరువాత ఆ డిజేల హోరులో అన్నీ మరిచిపోతున్నారు. ముందే ఎండాకాలంలా ఉంది ఐనా టపాకాయలు పేల్చడం, రాకెట్లు పొగలు, శబ్దాలు, రంగురంగుల కాంతులు ఇలా చూడానికి బాగానే ఉన్నా ఈ ఎల్‌నినో వాతావరణానికి ఏమాత్రం సరిపోక ప్రజలకు అంటే నీ భక్తులకే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ డీజె శబ్దాలతో ఒక మహిళ గుండె ఆగి చనిపోయిందని తెలిసింది.

నేపాల్ వరదలు చూశాం, దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్ ఇప్పటికే నీటిరహిత నగరంగా మారిందని అక్కడం పెట్రోలు, డీజిలు మాదిరి నీళ్లు కొనుక్కొని పోవాలని సోషల్ మీడియాలో రోజూ అన్ని గ్రూపుల్లో పెడుతున్నారు. తరువాత లిస్టులో బెంగళూరు ఉందనీ ఉందందులో. ఇప్పటికే చాలా నగరాల్లో నిమజ్జనానికి నీళ్లు లేక ప్రతిసారీ భారీగా చేసే విగ్రహాల నీళ్లు లేని కాలువల్లో గోడలు కట్టి ట్యాంకర్లతో నీళ్లు పోసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యుద్ధాలవల్ల పెరుగుతున్న కాలుష్యమూ, గ్రీన్ హౌస్ ప్రభావమూ కూడా కారణాలే ఈ పరిస్థితి దాపురించడానికి. నీవు ప్రమధగణ నాయకుడవు. నీ ప్రమధగణాలతో ఆ రాక్షసులు ట్రంపాసురుడి, నెతన్యాహుడి పై దండెత్తొచ్చుగా. లేదా మీ డాడీకి చెప్పి వారికి మంచి ఆలోచనలు కలిగించే మెదడున్న తలలను అతికించొచ్చుగా! దేశం విషయం తీసుకుంటే చవితి చంద్రుడిని మాదేశ ప్రజలంతా చూసినట్టున్నారు అందుకే నానా బాధలూ పడుతున్నాము. ఇక ఇక్కడేమో, ఉంటే పవరున్న ముఖ్య మంత్రి సీటులోనే కూచుంటాం కాని ప్రతిపక్షనాయకుడిగా కూచోమని తీర్మానించుకుంటున్నారు. అది క్యాబినెట్ హోదా అన్న విషయమే మరిచారు. అసలు నాయకుడన్నవాడు దేనికైనా ముందుండాలి నీలాగ, కాని వీరు అధికారంకోసం ముందుంటున్నారు. రాజుల కాలం నాటి వారసత్వ సామ్రాజ్యాలలా ఏలడానికి ప్రయత్నిస్తున్నారు.

ఖైరతాబాద్ వినాయకా మా మీద ఖైరియత్ చూపవయ్యా. ఎత్తు ముఖ్యమా ఎత్తుకు పై ఎత్తులు ముఖ్యమా అన్న విషయంలో కాస్త తికమకగానే ఉంది మా నాయకులకు. పరిమాణం చూస్తున్నారే కాని పరిణామం చెందడం లేదు. విద్యా ర్థులు నీదగ్గర పుస్తకాలు పెట్టి పరీక్షల్లో మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. నీకు ప్రదక్షిణలు చేస్తారు, గుంజిళ్లు తీస్తారు. ఐతే కొందరికి ‘‘దక్షిణలు’’ ఇచ్చుకుంటే పేపర్లు ముందే లీక్ అవుతాయి అ‘‘ధర్మంగా’’. ఇక నాయకుల సర్టిఫికేట్లకే దిక్కులేని పరిస్థితి. జాతిరత్నాలు సినిమాలో పదో తరగతి దొంగ సర్టిఫికేట్ ఇప్పించలేని మీ స్టేటస్ దేనికి సార్ అన్నట్లు దేశంలో స్టేటస్ బాగా పెరిగిపోయింది మాదగ్గర. పైసామే హై పరమాత్మా అన్నట్లు పైసామే మా చదువులన్నీ ఉన్నాయి. విఘ్న వినాయకా మా బాధలు అర్థమై మా కష్టాలు తీరుస్తావనే ఈ విన్నపాలు. నిమజ్జనం ఎలాంటి నీళ్లలో చేస్తారోనని నువ్వు పడుతున్న టెన్షన్‌కు తోడు మా కష్టాలు చెప్పి నిన్ను బాధపెట్టడం ఎందుకు. అవేవో మేమే పడతాంలే… అవి ఆర్చేవి కావు తీర్చేవి కాదు. బై బై వినాయకా.

జంధ్యాల రఘుబాబు 9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -