Saturday, September 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగురజాడ బాటలో భాషా సాంస్కృతిక సమరం

గురజాడ బాటలో భాషా సాంస్కృతిక సమరం

- Advertisement -

గురజాడ అప్పారావు జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ప్రగతిశీల భావుకులకు ఒక విజయం. అనేకమంది తిరోగాములను ఆ జాబితాలో చేర్చిన కూటమి సర్కారు తెలుగు జాతి వైతాళికుడైన గురజాడ, జాషువా వంటివారిని విస్మరించడం ఒక భావజాలాన్ని ప్రతిబింబించింది. ‘వెనకచూసిన కార్యమేమోయ్‌, మంచిగతమున కొంచెమేనోయ్‌” అన్న గొప్ప చారిత్రిక సత్యం చాలామందిని భయపెడుతుంటుంది. రాజభక్తిని, దైవభక్తిని దాటి దేశభక్తి చెప్పిన గురజాడ తెలుగుజాతి పునర్వికాసానికీ, ప్రజాస్వామిక సాం‌స్కృతిక చైతన్యానికి ప్రతీక. ఆయన భావాలను అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు ప్రత్యేకంగా ఎలుగెత్తి చాటాడానికి కారణమదే. తిండికలిగితె కండగలదోయ్ అనీ, సొంతలాభం కొంతమానుకు పొరుగువాడకి తోడుపడమనీ, దేశీయ సంపదను పెంచాలనీ, మనుషులందరూ సమాను లేనని, జాతులు మతములన్నీ అన్నదమ్ముల్లా మెలగాలని, రాయిరప్పను దేవుణ్ని చేసి మొక్కుతూ సాటిమనిషిని హీనంగా చూడటం తప్పని, శాంతి విలసిల్లాలని, మగడు భార్యకు ప్రాణమిత్రుడే కాని వేల్పుకాదని, ఎల్లలెరుగని ప్రేమభావన మగువకూ మగవాడికీ ఒక్కటేననీ.. కవితా పలుకులు వింటే దేశమందభిమానం ‌మొలకెత్తాలనీ..ఇలా గురజాడ రాసిన ప్రతిమాటా కొత్తబాటలు పరిచింది. ఈ సందర్భంలో ప్రత్యేకించి భాషా విషయంలో ఆయన ఔన్నత్యం చెప్పుకుందాం.

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న నినాదమిచ్చిన గురజాడకు భాష అంటే పండితులు కాదోయ్-భాష అంటే సామాన్యులోయ్ అన్న భావన మొదటి నుంచి వుంది. సామాజిక సాహిత్య జీవనంలో ముఖ్యంగా విద్యాభ్యాసంలో కూడా ఈ విధమైన మార్పు రావాలన్నది ఆయన చిరకాల వాంఛ. తెలుగునాట పండిత విద్యాదిక వర్గంలో వాడుక భాష-వేడుక భాషల మధ్య వేడిగావాడిగా పోరాటం నడిచింది. ఈ పోరాట ఫలితమే 1914లో వెలువడిన ‘అసమ్మతి పత్రం’ (డిసెంట్ నోట్). ఇందులో భాషా సమస్యను వివిధ కోణాల నుంచి పరామర్శించారు గురజాడ. అప్పటికే కన్యాశుల్కం పీఠికల్లో వ్యవహార భాష ఆవశ్యకతను నొక్కిచెప్పిన గురజాడ తన అసమ్మతి పత్రంలో ప్రజలకు భాష నేర్పడానికి వ్యవహారిక భాష కన్నా ఉత్తమ మార్గం లేదని ఘంటాపథంగా నిరూపించారు.“తెలుగు సాహిత్యానికి సంకెళ్లు వేసి కడుపు మాడ్చడమా లేక దానికి జవసత్వాలిచ్చి ఒక గొప్ప నాగరిక శక్తిగా రూపొందించు కోవడమా అనేది మనపైనే ఆధారపడి వుంది” అని ఆయన హెచ్చరించారు… రాజకీయ రంగాల్లోలాగే భాషారంగాల్లో కూడా ప్రభు వర్గతత్వమూ, వేర్పాటుతత్వమూ పతనంగాక తప్పదు. అనేకుల అవసరాలు, ప్రయోజనాలు అల్ప సంఖ్యాకుల ప్రయోజనాల కన్నా ముఖ్యమైనవి. చివరకు వాటిదే పైచేయి అవుతుంది.”అన్నారు.

తెలుగు నగరాలు, భాషా సమస్యలు
తెలుగులో సాహిత్య యుద్ధం మొదట భాషా విషయమై జరగడం చారిత్రిక ప్రాధాన్యత గల అంశం. తెలుగులో రాస్తే తమ వాళ్లు అవమానంగా భావిస్తారని వారికి తెలుగు ఒక భాష కాదని సాక్షాత్తూ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన ఆత్మకథలో రాసుకున్నారు. చాలామంది పండితులకు సంస్కృతం తప్ప తెలుగు నుడికారం తెలియదు. వారిలో అనేకులు వేదం వల్లె వేయడం తప్ప చదువుకున్న వారు కూడా కాదు. తెలుగు, ఇంగ్లీష్‌ రెండూ రాని అ‌వస్త వారిది. మొదట్లో సంస్కృతం వల్ల తర్వాత ఇంగ్లీష్‌ వల్ల ఆ పని జరగలేదు. తెలంగాణలో లేదా నాటి నిజాం రాజ్యంలో ఈ రెంటికీ తోడు ఉర్దూ భాషాధి పత్యం మెజార్టీ ప్రజల భాష కాదు. కనుకనే ప్రజల భాషగా తెలుగును పెంపొందించుకోవలసిన అగత్యమేర్పడింది. గురజాడ గిడుగు పోరాడిన వ్యావహారిక భాషోద్యోమం తమకు సంబంధం లేదని కొందరు తెలంగాణా సాహిత్యకారులు చేసే వాదన కూడా శాస్త్రీయమైంది కాదు. ప్రముఖ విమర్శకులు డా.కెకె రంగనాథాచార్యులు ఈ పరిణామక్రమాన్ని ఇలా వివరించారు:
‘ప్రత్యేకంగా ఒక మహానగరానికి చెందిన భాష కాకపోవడం తెలుగుకు వున్న అసౌకర్యం. ప్రత్యేక నగర భాషలు కావడం వల్ల బెంగాలీ, మరాఠీ భాషలు వికాసం చెందాయి. తమకంటూ ఒక మహానగరం వుండటం వల్ల బెంగాలీలు, మహా రాష్ర్టలు లాభపడ్డారు.కొంతవరకూ తమిళులు కూడా….ఇంగ్లీష్‌కు లండన్, ఫ్రెంచికి పారిస్, ఫ్లారెన్స్ ఇటాలియన్‌కు ప్రమాణ‌మయ్యాయి. ఆ విధంగా చూస్తే ఆధునిక కాలం ప్రారంభమయ్యే నాటికి తెలుగువారికి తమదే అంటూ చెప్పుకోదగిన శతాబ్దాల చరిత్ర గల నగరం లేదు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు తెలుగువారిదే అయినా దాని విచ్ఛిన్నం వల్ల ఆ ప్రభావం కొనసాగలేదు.

విజయనగర సామ్రాజ్యంలో తెలుగేతర ప్రాంతాలే ఎక్కువ. హంపి తెలుగు కూడా తెలుగు నగరం కాదు. ఆ తర్వాత పాలించిన నాయకరాజులు తమిళనాడులోని మదురై తంజావూరు నుంచి పాలించారు. 16,17 శతాబ్దాల కాలంలో కుతుబ్‌షాహిల కాలంలో గాని తెలుగువారు మళ్లీ ఒకే పాలనలోకి రాలేదు. ఆ కాలంలో తెలుగు సాహిత్య సంచలనం బాగున్నా అసఫ్ జాహి నిజాంల కాలం వచ్చేసరికి అనేక కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటీష్‌ వారి పరమైనాయి. అది తమిళనాడులో కలసి మనుగడ సాగించింది. హైదరాబాదు తెలుగు వ్యవహర్తల భౌగోళిక ప్రాంతమైనా మరాఠీ, కన్నడిగులు కూడా గణనీయంగా వున్నారు. తెలుగు, ఉర్దూ కలిసిన దక్కనీ భాషీయులున్నారు. మొదట పర్షియన్ తర్వాత ఉర్దూ అధికార భాషలుగా వున్నాయి అక్కడ పరోక్షంగా బ్రిటిష్ ఆధిపత్యం వుంది. నిజాంతో సైనిక రాజకీయ అవగాహనల ఫలితంగా వారు జోక్యం చేసుకోలేదు. ఇక కాంగ్రెస్ జాతీయోద్యమం కూడా అది దేశీయ సంస్థానం గనక ఉద్యమాలు తలపెట్టలేదు… ఈ పరిస్థితులలోనూ బ్రిటిష్ పాలకులు విరివిగా స్థాపించిన వినూత్న విద్యా సంస్థలు, చైతన్యవంతులైన తెలుగు నేతల సాహిత్యకారుల ఉద్యమాలు అక్కడ తెలుగును నిలబెట్టాయి. ఇలాంటి ప్రత్యేక చారిత్రిక భౌగోళిక కారణాల వల్ల గోదావరి, కృష్ణా ప్రాంతంలో నూతన భాషా, సాహిత్యాలకు అవకాశాలు అధికంగా వచ్చాయి. అందు లోనూ పెద్ద సంస్థానంగా వున్న విజయనగరం లేదా ఉత్తరాంధ్రలో తాత్వికంగా, కళాపరంగా ఆధునిక ధోరణులు ప్రవేశించాయి. వ్యావహారిక భాషా ఉద్యమం దాని ఫలితమైతే అందుకు అగ్రగాములు గురజాడ గిడుగు.”(నూర సంవత్సరాల తెలుగు: దశ దిశ’

హిందీ హిందూత్వ దాడి
తెలుగు భాషా వికాసం గురించిన చర్చ హడావుడి కేవలం సెంటిమెంటుగానో కేవలం సాహిత్య సంబంధమైందిగానో చూపించడం వాస్తవికం కాదు. ఎందుకంటే పాలకుల విధానాలు, ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు అన్నీ దాన్ని ప్రభావితం చేస్తాయి, చేశాయి. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో సర్కార్లు ఎన్ని తెలుగుసూక్తులు చెప్పినా నడక మాత్రం విద్య సాహిత్యాల వ్యాపారీకరణ, ప్రపంచీకరణ వైపే వుంటున్నది. దేశాల భాషలు శరవేగంగా హరించుకుపోతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి తెలుగుభాషలో బోధనావకాశాలు తగ్గించేసి అసలు సర్కారు బడుల్లో తెలుగునే ఎత్తివేస్తున్న పరిస్థితి. పైగా సనాతనం పేరిట మతచాందసాన్ని తవ్వి తలకెత్తే వారే తెలుగు భాషాయోధులుగా ముందుకు రావడం మరో వైపరీత్యం. గురజాడ అవార్డును చాగంటి కోటేశ్వరరావుకూ, గరికపాటి నరసింహారావు వంటివార్లకు బహుకరిం చడం కన్నా ఇందుకు మరో నిదర్శనం అవసరం లేదు గత పన్నెండేండ్ల మోడీ పాలనలో జాతీయ భాషా విద్యా విధానాలు కేంద్రీకరణకూ కాషాయీకరణకు గురవడం చూస్తున్నదే. రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పొందుపర్చిన 22 భాషలకూ సమా‌న ప్రతిపత్తి వుండాలి కానీ ఇంగ్లీషు, హిందీకి పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా తెలుగు భాష వంటివి అన్యాయమై పోతున్నాయి. ఆరవ తరగతిలోనే మూడు భాషలు నేర్చు కోవాలన్న నూతన విద్యావిధానం(ఎన్‌ఈపి) ఆదేశంపై తమిళనాడు, కేరళ, కర్నాటక,(గతంలో పశ్చిమబెంగాల్‌) వంటి రాష్ట్రాలు పోరాడుతున్నాయంటే కారణం అదే.

భాషా సం‌స్కృతులలో ఏకీకరణ రుద్దుతున్న కేంద్రీకృత పోకడలు ఇందుకు కారణమవుతున్నాయి. భాషా సాంస్కృతిక ప్రాంతీయ గుర్తింపులను వైవిధ్యాలను గుర్తించడంపైనే దేశ సమైక్యత కాపాడ బడుతుంది. అందుకు భిన్నంగా ఒకే దేశం ఒకే సంస్కృతి, ఒకే మతం ఒకే కార్డు, ఒకే పన్ను ఒకే ఎన్నిక, ఒకే మతం ఒకే పార్టీ ఒకే నేత, ఇదంతా ఒకే తానులో ముక్కలాటిదని గుర్తించడం అవసరం, హిందీకి కూడా దేవనాగరి లిపిని మాత్రమే రాజ్యాంగం 343వ అధికరణం నిర్దేశిస్తున్నది. నిజానికి హిందీకి అవధ్, భోజ్‌పురి, గర్వాలీ, కుమావోనీ, అంజికా, బుందేలి, ఛత్తీస్‌‌గఢ్‌ వంటి చాలా లిపులను హిందీలోకి మార్చేశారు. పంజాబీ, మైథిలీలను కూడా హిందీలోకి మరల్చేందుకు విఫల యత్నం చేశారు. హిందీ అభివృద్ధి కోసం రూ.2532 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం ఆచరణలో ఘోరంగా విఫలమైందంటే ఆశ్చర్యం లేదు. ఇటీవల అందరూ హిందీ నేర్చుకోవాలని హుకుం జారీచేసి వెనక్కు తగ్గిన హోంమంత్రి అమిత్‌షానే ఇప్పుడు ఉమ్మడి సివిల్ కోడ్ రుద్దాలనుకోవడం తప్పక గమనించాల్సి వుంటుంది. మిగిలిన దేశంతో రాజ్యాంగానికి సంబంధం లేకుండా బీజేపీ ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాలలో యుసిసిని అమలు చేస్తామని ఆయన ప్రకటించడం కన్నా అప్రజాస్వామికం ఏముంటుంది? దీన్ని సూటిగా వ్యతిరేకించలేని చంద్రబాబు నాయుడు, పవన్ వంటివారిని గురించి ఏమి చెప్పాలి? హిందీని హిందూత్వ పేరిట సంస్కృతాన్ని కూడా గొప్పగా చలామణి చేయాలనుకోవడంలో తొంగిచూసేది ఆధిపత్య సనాతన కేంద్రీకృత వ్యూహం మాత్రమే. భాషా సూత్రాన్ని కాంగ్రెస్ గుర్తించి పిసిసిలను ఆ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది వందేండ్ల కిందట 1927లోనే!

పదండి ముందుకు!
ప్రస్తుతం సుప్రీంకోర్టులో విద్యావిధానంపై, భాషా విధానంపై జరుగుతున్న విచారణలో రెండు విపరీత ధోరణులు గోచరించాయి. ఇంగ్లీషును కూడా దేశభాషగా పరిగణనలోకి తీసుకోవచ్ఛు కదా అని న్యాయమూర్తులు సిబిఎస్ఇని ప్రశ్నించారు. రెండవది…దేశంలో రాష్ట్రాలు స్వతంత్ర దేశాలలా వ్యవహరించవద్దనీ హిందీ వ్యతిరేక మనస్తత్వం మార్చుకోవాలని తమిళనాడుకు సూచించారు. ఏ హిందీ రాష్ట్రంలోనూ మరో భారతీయ భాష నేర్పడం సిలబస్ లో వుండదని కోర్టు విస్మరించడం విచిత్రమే…మొదటిదేమో మూడు భాషలు అన్నప్పుడు ఇంగ్లీషును కూడా స్థానిక భాషగా గుర్తించవచ్చునని ప్రశ్నించడం. హిందీని వ్యతిరేకించే ధోరణి (మైండ్‌సెట్) వదులకోవాలని సూచించడం. ఇవిరెండూ అశాస్త్రీయమే గాక చరిత్ర క్రమానికే విరుద్ధమైనవి. వర్తమాన ప్రపంచంలో ఇంగ్లీషు అవసరం గుర్తించడం పొరబాటు కాదు..వలసపాలన నేపథ్యంలో ఇంగ్లీషువారి ఆధిపత్యం అల్లుకుపోయింది తప్ప అదెప్పటికీ స్థానికభాష కాదు. హిందీ దేశంలో చాలా రాష్ట్రాల్లో మాట్లాడతారు గనక నేర్చుకోవడం వేరు.

దాన్ని అనుసంధాన భాషగా బలవంతంగా రుద్ది ప్రాంతీయ భాషలను వెనక్కు నెట్టడం పొరబాటు. గత అరవై ఏండ్లుగా వివిధ రూపాల్లో జరిగిన ఆ ప్రయత్నాలు ఫలించలేదని గుర్తించాలి. దక్షిణాదిన తమిళం, తెలుగు వంటి భాషలతో పోలిస్తే హిందీకి అంత చరిత్రగానీ విస్తృతి గానీ లేవని భాషా శాస్త్రవేత్తలు అంగీకరించిన విషయం. ఈ రాష్ట్రాలలో హిందీ మాట్లాడేవారు కూడా తక్కువే. ఉదాహరణకు తమిళనాడులో 2.1శాతం మంది మాత్రమే హిందీ మాట్లాడతారు. అలాటప్పుడు త్రిభాషా సూత్రంతో వారిపై హిందీ రుద్దడం అర్థరహితం,గురజాడ చెప్పిన దేశభక్తినీ, మత సామరస్యాన్ని, హేతుతత్వాన్ని ఆక్షేపించిన వారే ఇప్పుడు భాషా విషయంలోనూ ఇంగ్లీషుతో పాటు హిందీని సంస్కృతాన్ని రుద్దాలని చూస్తూ తెలుగుభాషా వికాసం గురించి చెప్పడం హాస్యాస్పదం. రాజ్యాంగం 19(1) అధికరణం పౌరులందరూ తమకు నచ్చిన రీతిలో జీవించడానికి వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశమిస్తున్నదంటే భాషతో సహానని గ్రహించాలి. ఉద్యమాల ఒత్తిడితో ఆయన పుట్టిన రోజును అధికారికంగా నిర్వహించడానికి అంగీకరించి నందుకు సంతోషిస్తూనే భాషా సాంస్కృతిక వికాసం చాందసంపై పోరాటంలో ఆయన బాటలో ముందుకు సాగాలి.
“మందగించక ముందుకడుగెయ్..వెనకబడితే వెనకేనోయ్‌”
(సెప్టెంబర్‌ 21, గురజాడ జయంతి)

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -