Sunday, September 20, 2026
E-PAPER

నిధి

- Advertisement -

గుర్రాల గ్యాంగు
ముందు వెళ్తున్న నల్లగుర్రం సడన్‌‌గా ఆగింది. ఆగిన నల్ల గుర్రం పెద్దగా సకిలిస్తూ తోకని గుండ్రంగా తిప్పింది. వెనక వస్తున్న తెల్లగుర్రం దాని పక్కన ఎర్రగుర్రం, ఆ వెనక ఉన్న తెల్లమచ్చల నల్లగుర్రం, దానిపక్కన ఉన్న నల్లమచ్చల తెల్లగుర్రం అన్నీ ఆగిపోయాయి.
నల్ల గుర్రం మీద ఉన్నవాడు జీన్స్ పాంటూ, లెదర్ జాకెట్ వేసుకుని తలమీద కౌబాయ్ క్యాపు పెట్టుకున్నాడు. ముఖం మీద నల్లగాటు, పాంటుకున్న బెత్తెడు వెడల్పు బెల్టుకి రెండు పక్కలా పిస్తోళ్లూ ఉన్నాయి. ఈ నల్లగుర్రం వాడు వెనక గుర్రాల మందలో ఉన్నవాళ్ళకు బాస్‌. బాస్ ముందు చిన్నగా దగ్గి, తర్వాత పెద్దగా నవ్వి, జాగ్రత్త! ఈ అడవిలో డేంజరస్ ఏరియా మొదలవుతున్నది. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఈ మాటలు అన్నాక బొడ్డులో నుంచి ఓ తోలు చుట్ట తీసి విప్పి మనం ఈ రాత్రికి గానీ, రేపు పొద్దుటికి గానీ నిధిని చేరగలం. ఇక్కడ్నించి ‘రైటు తీసుకుందాం’ అంటూ ముందుకి కదిలాడు. నల్లగుర్రం ఓ రెండు సార్లు సకిలించి స్టార్టయింది. గుర్రాలు ముందుకు పరుగెత్తాయి.
జీపు గ్యాంగు
చుట్టూ దట్టంగా చెట్లు. పెద్ద కొండమీది నుంచి జారి పడుతున్న నీళ్ళు. రాళ్ళమీద అక్కడొకడూ, ఇక్కడొకడూ కూచునీ పడుకునీ ఉన్నారు. పొడుగ్గా ఉన్నవాడొకడు నీటి అంచున చెట్టుకింద ముఖం మీద టోపీ పెట్టుకుని పడుకుని ఉన్నాడు. వాడి పక్కన ముఖంమీద రూపాయి కాసంత పులిపిరికాయ ఉన్నోడు సీసా ఎత్తి మందు తాగుతున్నాడు. ఒకడు తనదగ్గర ఉన్న లెదర్‌‌మ్యాప్‌‌ని చూస్తూ ఒక్కసారిగా అరిచాడు. ముఖం మీద టోపీ పెట్టుకు పడుకున్న బాస్‌ టోపీ పక్కకు జరిపి ‘ఏందిబే!?’ అన్నాడు.
‘బాస్‌ ‌మ్యాప్‌‌లో ఇక్కడ్నించి ఎటు వైపు వెళ్ళాలో అర్థమైపోయింది’ అన్నాడు బక్కగా ఉన్నా పెద్దతలకాయ ఉన్నోడు. బాస్ లేచి నిలబడ్డాడు… ‘కమాన్‌ ‌క్విక్‌! అందరూ జీప్ ఎక్కండి. దారి తెలిసింది’ అని అరిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అందరూ జీప్‌ ఎక్కారు. నీళ్ళని పైకి చిమ్ముకుంటూ జీపు పరిగెత్తింది.

​వ్యాన్ గ్యాంగు
చీకట్లు కమ్ముకుంటున్నాయి. దట్టమైన అడవిలో చెట్టు కింద మంట. దాని చుట్టూ ఐదుగురు మనుషులు. మంట వెలుగులో వాళ్ళ ముఖాలు కనిపిస్తున్నాయి. మంట మీద పాతిన కర్రల మధ్య వేలాడుతున్నది మేక మాంసం. మంటకి ఎర్రబడుతున్న మాంసం వాసన ఘుప్పుమంటున్నది. చలికి వణికిపోకుండా కోట్లూ స్వెటర్లూ వేసుకుని మంట పక్కన కూచున్న వాళ్ళల్లో ఒకడు ‘మనం రేపు మధ్యాహ్ననికి ఆ చోటు చేరుకుంటాం కదా!’ అన్నాడు.
ఎదురుగ్గా ఉన్న మరొకడు యస్ బాస్‌. కానీ…’
‘కానీ ఏంటిరా? సరిగ్గా చెప్పు’ అన్నాడు బాస్‌ చిరాగ్గా.
‘మరేం లేదు బాస్‌. మన మ్యాపులో వున్న ఇ‌న్‌‌ఫర్మేషన్‌ అక్కడి వరకే. మన దగ్గర ఉన్న మ్యాప్‌ పూర్తి మ్యాపులో ఓ ముక్కే గదా!’ ​అన్నాడు బోడిగుండోడు.
‘మన శత్రువుల దగ్గర ఉన్న మ్యాపులు కూడా ముక్కలే కదా. అందరం ఒక్కచోట ఆగాల్సిందే. మూడు మ్యాపులు కలిపి చూడాల్సిందే’ అన్నాడు మరొకడు నోటి పళ్ళల్లో ఇరుక్కున్న మాంసాన్ని పుల్లలతో కెలుక్కుంటూ.
‘అవునవును. ఒక్కసారి నిధిని చేరుకున్నాక ఆ నాయాళ్లని వేసేద్దాం. పొద్దున్నే అందరూ రెడీ అయిపోవాలి’ అన్నాడు బాస్‌.
​మూడు గ్యాంగులు
విశాలమైన మైదానం. దానికి ఆనుకుని ఒకపెద్ద కొండ. మధ్యాహ్నం వేళ. ఒక చివరి నించి ఆ కొండకి చేరింది గుర్రాల గ్యాంగు. మరో వైపు నుంచి జీపు, ఇంకోవైపు నుంచి వ్యాను ఒకే టైంకి అక్కడికి చేరుకున్నాయి. అందరూ తుపాకులు ఎత్తి పట్టుకున్నారు. ‘ఆల్రెడీ మన గ్యాంగులో ఒకడ్ని అడవిలో కొండ చిలువ మింగేసింది బాస్’ అన్నాడు గుర్రాల గ్యాంగులో ఒకడు.
‘రాత్రి పండుకున్న మన వాణ్ణి ఏ పులో ఎత్తుకుపోయింది బాస్‌’ అన్నాడు జీపు గ్యాంగులో ఒకడు. మన వాళ్ళిద్దరు లోయలలో పడిపోయేటప్పుడు వేసిన చావుకేకలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి బాస్‌’ అన్నాడు వ్యాన్ గ్యాంగులో ఒకడు.
మూడు గ్యాంగుల బాస్‌‌లూ ముందుకు వచ్చారు. గుర్రాల గ్యాంగ్‌ ‌బాస్‌ అన్నాడు.. ‘ఫ్రెండ్స్! పది రోజుల నుంచీ ఈ అడవుల్లో తిరుగుతున్నాం. మన వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి’.
‘మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు’ అన్నాడు జీప్ గ్యాంగ్ బాస్.
‘నిధి కోసమే కదా!’ అన్నాడు వ్యాన్‌‌గ్యాంగ్‌ బాస్‌.

‘మనం అనవసరంగా ఒకళ్ళనొకళ్లం చంపేసుకోకుండా అందరం కల్సి నిధిని సాధిద్దాం. ఆ అపురూపమైన నిధిని, ఆ అమూల్యమైన నిధిని అందరం సమానంగా పంచుకుందాం’ అన్నాడు గుర్రాల గ్యాంగ్‌ ‌బాస్‌.
‘అవునదే కరెక్ట్‌’ అన్నారు మిగిలిన గ్యాంగు మెంబర్లూ, బాసులూ.
​ముగ్గురు బాస్‌‌లూ మూడు మ్యాపులూ కల్పి స్టడీ చేశారు. ‘మనం గెలుస్తాం. చీకటి పడకముందే మనం కొండమీది గుహను చేరుకుంటాం. నిధి మన సొంతం అవుతుంది’ అని పగలబడి నవ్వారు ముగ్గురు బాస్‌‌లు. కొండ ఎక్కారు అందరు.
గుహలోకి తాడు వదిలారు. ‘జాగ్రత్తగా దిగండి! వినాయకుడి విగ్రహం వుంటుంది. దాని బొడ్డులో ఎవరూ వేలు పెట్టకండి. మన మ్యాపులో రెండు ముక్కల్ని విగ్రహం చెవిలో పెట్టి తిప్పితే నిధి వుండే చోటికి తలుపు తెర్చుకుంటుంది. మూడవ ముక్కని తాకిస్తే నిధి వున్న పెట్టె తెర్చుకుంటుంది’ అన్నాడు గుర్రాల గుంపులో తెలివైన వాడు తాడు పట్టుకుని గుహలోకి దిగుతూ.
అందరూ నిధి ఉన్న పెట్టె ముందు నిలబడ్డారు. పెట్టె తెరిచి చూశారు. అందులో మరో పెట్టె, దాన్లో ఇంకో పెట్టె, దానిలో మరో పెట్టె.. ఇలా తీసుకుంటూ పోతే చివరికి ఓ చిన్న పెట్టెలో కనిపించింది నిధి. నిధిలో వున్న ఆ విలువైనవి ‘సన్‌‌లైట్‌’ పడి ధగధగా మెరుస్తున్నవి. ఎర్రెర్రని మెరుపులకు అందరి కళ్లు కాసేపు మూసుకుపోయినవి.
ఉల్లిగడ్డలు! ఉల్లిగడ్డలు! ఉల్లిగడ్డలు! విలువైన నిధి దొరికేసింది అని పిచ్చిపిచ్చిగా కేకలు వేస్తూ గంతులేస్తూ నవ్వసాగారు అందరూ. హఠాత్తుగా ఓ తుపాకీ పేలింది. ఢాం.. ఢాం… ఢాం… ఈ నిధి మొత్తం నాకే అనరుస్తున్న ఓ బాస్‌, నుదుటికి చిల్లుపడి రక్తం బొటబొటా కారసాగింది. ఎవరిని ఎవరు పేలుస్తున్నారో తెలీదు. పిట్టల్లా రాలిపోయారందరూ. ఉల్లిగడ్డల నిధి దక్కకుండానే ప్రాణాలు వదిలారు.
అందరూ చచ్చారు అంటూ బ్యాగు నిండా ఉల్లిగడ్డలు నింపుకుని ప్రాణాలతో ఉన్న గుర్రాల గ్యాంగు లీడర్‌ ‌గుహ బయటికి వచ్చి ‘అయాం ద కింగ్‌’ అంటూ నవ్వుతుంటే కొన ప్రాణాలతో పాకుతూ బైటికి వచ్చిన జీప్‌ ‌గ్యాంగ్‌ ‌లీడర్‌‌ గన్‌ పేలింది. పేల్చి చచ్చినవాడితో పాటు, గుండెకు పడ్డ రంధ్రంలోంచి నెత్తురు కారుతుంటే గిలగిలా కొట్టుకుంటూ పైలోకానికి వెళ్లిపోయాడు గుర్రాల గ్యాంగు లీడర్‌. అతని బ్యాగులోనుంచి ఎంతో ఖరీదైన ఎర్రెర్రెని ఉల్లిడగ్గలు కిందికి దొర్లి పడ్డాయి.
చింతపట్ల సుదర్శన్‌, 9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -