Sunday, September 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ ఎక్సలెన్స్ ఎనర్జీ నిర్వహణలో దక్షిణ మధ్య రైల్వేకు ఆరు అవార్డులు

జాతీయ ఎక్సలెన్స్ ఎనర్జీ నిర్వహణలో దక్షిణ మధ్య రైల్వేకు ఆరు అవార్డులు

- Advertisement -

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ‘అత్యుత్తమ యూనిట్’ గుర్తింపు
మరో ఐదు యూనిట్లకు కూడా

నవతెలంగాణ -హైదరాబాద్‌
సీఐఐ 27వ నేషనల్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ 2026లో దక్షిణ మధ్య రైల్వే అవార్డులను కైవసం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే తమ సంస్థలన్నింటిలో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి, ఇంధన పరిరక్షణ చర్యలను అవలంబించడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు గాను, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఈ అవార్డులను దక్షిణ మధ్య రైల్వేకు ప్రదానం చేసింది. 2026 సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీలో)లో జరిగిన సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో ఈ అవార్డులు ప్రదానం చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ‘అత్యుత్తమ ఇంధన సామర్థ్య యూనిట్’ అవార్డు లభించగా, లేఖ భవన్, లాలా గూడలోని సెంట్రల్ హాస్పిటల్, మౌలా అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జెడ్‌ఆర్‌టిఐ) ఇంధన సామర్థ్య యూనిట్లుగా గుర్తింపు పొందాయి. ఇంకా, రైల్ బోగీ కర్ఖానా, యాద్గిర్, సిగ్నల్ , టెలికాం వర్క్‌షాప్ మెట్టుగూడ కూడా ఇంధన సామర్థ్య యూనిట్లుగా అవార్డులు సాధించాయి. ఈ అవార్డులను హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ రామారావు, ఇతర సీనియర్ రైల్వే అధికారులు అందుకున్నారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లు, వర్క్‌షాపులు, వివిధ విభాగాలకు చెందిన ఫీల్డ్ యూనిట్లు ఇంధన సామర్థ్యం, పర్యావరణ అనుకూల కార్యక్రమాల రంగంలో చేసిన అవిశ్రాంత కృషి ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఈ అవార్డులను దక్కించు కోగలిగింది. ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన పొదుపును ప్రోత్సహించడం, రైల్వే సంస్థల్లో సుస్థిరమైన పద్ధతులను అమలు చేయడం దిశగా జోన్‌ వ్యాప్తంగా చేపడుతున్న సమిష్టి కృషికి ఈ అవార్డులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమాలు ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి మరియు పర్యావరణ పరిరక్షణ దిశగా రైల్వే కార్యకలాపాలను ప్రోత్సహిం చడానికి ఎంతగానో దోహదపడతాయి. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ జాతీయ గుర్తింపును సాధించడంలో తమవంతు కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, డివిజనల్ రైల్వే మేనేజర్లు , ఇతర సంబంధిత రైల్వే అధికారులను ప్రశంసించారు. ఇంధన పరిరక్షణతోపాటు సమర్థవంతమైన ఇంధన నిర్వహణకు తమ జోన్ కట్టుబడి ఉందని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -