Sunday, September 20, 2026
E-PAPER
Homeకథస్ఫూర్తి

స్ఫూర్తి

- Advertisement -

యాబై, అరవై సంవత్సరాలు, తమ జీవితమంతా శ్రామిక పతాకాన్ని ధరించి, శ్రమ జీవులకోసం ఎన్నో పాటలు రాస్తూ, రెండు తెలుగు రాష్ట్రాలో అన్ని చోట్లకు తిరుగుతూ, ప్రజాఉద్యమాల్లో పాల్గొంటూ తమ పాటల్ని వినిపించి, ప్రజాకళారంగాల్లో పీడిత జనంకోసం పనిచేసిన ఉద్యమాల గాయకులు, కళాకారులు ఇలా అమరులు కావడం మనకే కాదు ప్రజాకళలకూ, ప్రజాపోరాటాలకూ, పార్టీలకూ తీరని లోటు.”
జిందాబాద్ జిందాబాద్ ప్రజాగాయకులు అమర్‌రహే! మీరు మరణించినా మీ పాట మరణించదు. మీ వారసత్వాన్ని కాపాడుకుంటాం! మీగానం వృధాకాదు, మీత్యాగం వృధాకాదు!.. వంటి నినాదాలతో ఆ ప్రాంగణమంతా కాసేపు మారుమోగింది.
అది ‘వామపక్ష భావజాలంతో కొనసాగుతున్న భావసారూప్యత కలిగిన కొన్ని ఉపాధ్యాయసంఘాలు, విద్యార్థి సంఘాలు, కలిసి నిర్వహిస్తున్న సంతాపసభ. కొందరు వక్తలు దాన్ని స్ఫూర్తి సభ అంటూ మాట్లాడారు. మరణించిన ప్రజాపోరాట వాగ్గేయకారుల సంతాప సభ అని అక్కడి డయాస్‌ మీద పెద్దగా కట్టిన బ్యానర్‌లో కనిపిస్తున్నది. వాళ్ళ నిలువెత్తు ఫొటోలు పాటలుపాడుతూ కనిపిస్తున్నాయి. బిగించిన పిడికిళ్ళూ, ఎత్తిపట్టుకున్న అరుణ పతాకాలూ ఉన్నాయి. హాలు చాలావరకు నిండివుంది. హైదరాబాదు నడిబొడ్డున ఓ పెద్ద ఏసీ హాలులో ఆ సభ కొనసాగుతున్నది.
నినాదాలు సద్దుమణిన తరువాత వక్త తన ప్రసంగాన్ని కొనసాగించాడు. “నిజమే మిత్రులారా, వాళ్ళ వారసత్వాన్ని కాపాడుకుంటాం, వాళ్ళ వారసత్వం కొనసాగిస్తాం, వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించాలి. ఐతే ఎలా? ఇలా ప్రజాకళాకారులు ఎందరో కాలగర్భంలో కలిసిపోతున్న కాలంలో మనం ఉన్నాం. ప్రతీసారీ ఇలాంటి సభలు ఎన్నోచోట్ల మనం, మనలాంటివాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ ఆ సభ తరువాత ఎవరి ఎవరి జీవితాల్లో వాళ్ళం మునిగిపోతున్నాం అనేది వాస్తవం కదా!
ఇటీవలి కాలంలో మరణించిన ప్రజాకళాకారులతో సహా వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు? ఎవరికోసం ఎందుకోసం తమ కళను ధారపోసారు? దోపీడి పీడనలకు గురౌతున్న పేద శ్రామిక ప్రజలకోసం కదా! మనం వాళ్ళ స్ఫూర్తిని నిలబెట్టడం అంటే వాళ్ళ ఆశయాలనూ, వాళ్ళ ఆచరణలనూ, వాళ్ళ ఆదర్శాలను వాళ్ళ వ్యక్తిత్వాలనూ మార్గదర్శకంగా తీసుకొని పనిచేయడం కదా! నిజంగా మనం అలా ఉంటున్నామా? ఒకసారి అందరం ఆలోచించుకుందాం. ఈసందర్భంగానైనా. మనం ఇప్పుడు ఎత్తిన పిడికిళ్ళలో మనం హృదయాలున్నాయా? మనం ఆ దారిన నడుస్తామనే నిశ్చయాలూ, నిజాయితీలూ ఉన్నాయా?…

మరణించిన మన కళాకారుల్లో కొందరికి యాబైయ్యేళ్ళు.. జనం కోసం ఉద్యమాలబాటల్లో ప్రయాణించిన ఆ కళాకారుల్లో చాలా మందికి కనీసం చిన్న ఇల్లు కూడా లేదని, వాళ్ళ కుటుంబాలకన్నా ఉద్యమాలనే ఎక్కువగా ప్రేమించారని మనం గుర్తుపెట్టుకుంటామా? తాము చెప్తున్న దానికీ, చేస్తున్న దానికీ, తమ జీవితాచరణకూ బేధం ఉండకూడదని కదా వాళ్ళ ఆచరణ మనకు బోధిస్తున్నది. అలా కొంతైనా మనం ఉండగలమా? సాధ్యం కాదనుకుంటే వాళ్ళ స్ఫూర్తిని మరెలా కొనసాగిద్దామని అనుకుంటాం?
సరే, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, శ్రమజీవులకు విద్యలు నేర్పుతున్న వాళ్ళు. కేవలం విమర్శించడానికీ, వ్యతిరేకించడానికీ, ప్రదర్శనలు చేయడానికీ మాత్రమే మీ ఉద్యమాలు, ఆచరణలు పరిమితం కావొద్దు. అనేక రూపాల్లో విద్యార్థులను, భావితరాలను, సమాజాన్ని చైతన్యవంతం చేసే అవకాశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఆ దిశగా మిమ్మల్ని ఆలోచింపజేయడమే ఈనాటి నా ఈప్రసంగం ప్రధాన ఉద్దేశ్యం….”
కొంతసేపటివరకూ ఆ హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సభాధ్యకులు ఇప్పుడు ప్రజాఉద్యమాల కళావేదిక కళాకారులు ఒక పాట పాడుతారు అని ఆ కళాకారుల్ని వేదక మీదికి ఆహ్వానించారు. ఆ కళాకారులు ఎర్ర రుమాళ్ళు, గొంగళ్ళు, కాళ్ళకు గజ్జలు ధరించి, డప్పు, డోలక్ వంటి వాద్యాలతో వచ్చి, మరణించిన ప్రజాకళాకారులకు అరుణారుణ వందనాలు తెలుపుతూ పాటపాడడం మొదలుపెట్టారు. కొద్ది సేపట్లోనే వేదిక మీద కూర్చున్న ఉపాధ్యాయ ప్రముఖులు, వేదిక ముందున్న చాలా మంది ఉపాధ్యాయులూ సెల్‌పోన్లు చూడ్డం మొదలైంది. మరింకొందరు టీలు తాగడానికి, రిలాక్స్ కావడానికీ లేచి హాలు బయటకు వెళ్ళారు. మరికొందరు పక్కవాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు. కళాకారులు పాడుతున్న పాటను వింటూ కూర్చున్నవాళ్ళు చాలా తక్కువమందే కనిపించారు.
పాట పెద్ద పాట. మరణించిన ప్రజాకళాకారులను, వారి త్యాగాలనూ, పోరాటాలనూ తలచుకుంటూ సాగుతున్న పాట.. ఒక ఉద్వేగాన్నీ, అనేక జ్ఞాపకాలనూ వెదజల్లుతున్న పాట…
వేదిక మీద ఉన్న నిర్వాహకుల్లో ఒకరు మెల్లగా ఆ పాట పాడుతున్న కళాకారుని దగ్గరకు వెళ్ళి “అన్నా స్పీకర్ మాట్లాడి వెళ్ళిపోవాలట. దయచేసి పాటను ముగించండి” అని చెవిలో చెప్పాడు. అక్కడితో ఆకళాకారులు పాటను మధ్యాంతరంగా ఆపేసారు.
ఇప్పుడు ఫలానా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ప్రసంగిస్తారు అని అధ్యక్షులు ప్రకటించారు. ఆ ప్రొఫెసర్ లేచి ప్రసంగించడం ప్రారంభించింది.
“ఎంత అద్భుతమైన పాట విన్నాం. ఒక గొప్ప స్వప్నాన్ని దర్శించి ఆ దారిని సుగమం చేయడానికి, ఆదారిలోకి శ్రమజీవులను, మనలాంటి సానుభూతిపరులను, మేధావులనూ రమ్మని, నడవమని, నడిపించమని ఉత్తేజపరిచిన పాట ఇది. తమ సర్వస్వాన్ని అందుకోసం ధారపోసి పోరాటంలో అమరులైన ఎందరెందరో వీరులనూ, కళాకారులనూ గొప్పగా తలుచుకుంటున్న పాట ఇది. పూర్తిగా వింటే బాగుండుననిపించింది.

సరే మిత్రులారా! ఒక ఉపన్యాసంకంటే పాట ఉద్యమాలకు బలమైన సాధనం అనేది చరిత్ర చెప్తున్న పాఠం. కనుకనే గిరిజనులూ, శ్రమజీవులూ పాటను ఆలంబనగా, ప్రాణంగా చూసుకున్నారు. ప్రజలకోసం జరిగిన ఏ ఉద్యమమైనా పాటలను పదునుగా వాడుకున్నాయి. స్వాతంత్ర పోరాటాలైనా, హక్కుల ఉద్యమాలైనా, విద్యా విప్లవాలైనా పాటలేని చోటు లేదు. పాటకు ఆకర్షింపబడని మనిషిలేడు. ఎందుకో ఈనాడు చదువుకున్న వాళ్ళు సినిమా పాటలు వినడానికి ఇష్టపడుతున్నటు, మనవాళ్ళ పాటలు వినడానికి ఇష్టపడుతున్నట్టు లేదు. కనీసం మనలాంటి ఉపాధ్యాయులైనా, ఉపాధ్యాయ సంఘాలైనా పాటల్ని పట్టించుకోవలసిన విధంగా, ఉపయోగించుకోవలసిన విధంగా ప్రయత్నిస్తున్నామా అని ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాలని నేను కోరుతున్నాను.
ఇది ప్రజా ఉద్యమవాగ్గేయకారుల స్ఫూర్తిసభ. కనుక మనం ఇప్పుడు ఉద్యమగీతాల గురించి, అవి సాధించిన ప్రయోజనాల గురించి, వాటి రచయితల జీవితాల నుంచి తీసుకోవలసిన స్ఫూర్తి గురించి సమీక్షించుకోవడం సరైనది. ఆనాటి ఉద్యమ అవసరాలకు పరిస్థితులకూ తగినట్టుగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ముందుకునడిపించే విధంగా రాసిన పాటలు అవి. ప్రజలు వాటితో అవగాహన పెంచుకున్నారు. చైతన్యం పొందారు, ఉద్యమించారు, త్యాగాలు చేశారు, అనేక ఒత్తిడులూ, దాడులూ, ఎదుర్కున్నారు. ప్రతిచోటా పాటలు వాళ్ళకు గొప్ప స్నేహితులై ఓదార్చాయి. తోడునిలిచాయి. అదంతా క్రమంగా వేగంగా పాత చరిత్రలామారి అదృశ్యమైపోతున్నది, ఈనాటి సినిమా పాటలే అందరినీ అలరించే కాలం దాపురిస్తున్నది.
సరే, మనం ఇలా సంస్మరణ సభలో, స్ఫూర్తి నభలో జరుపుకొంటూ, కాసేపు ఉత్తేజాలూ, విషాదాలూ పంచుకొని వెళ్ళిపోతున్నాం. రేపటి ప్రపంచాన్ని నిర్మించే పాటల్ని కాపాడుకునే ప్రయత్నం, అలాంటి పాటల్ని సృష్టించి, పెంచి జనానికి అందించే ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం? కనీసం ఇలాంటి సందర్భాలలోనైనా మనం చర్చించుకోకపోతే, ఆలోచించుకోకపోకతే ఎలా?”
హాలంతా నిశ్శబ్ధంగా తనమాటలు వింటుండడాన్ని వక్త గమనించారు.“మిత్రులారా! మనం ఉపాధ్యాయులం. ఒక రకంగా భద్రజీవులం, మన బళ్ళల్లో, మనం పనిచేస్తున్న చోట శ్రమజీవుల పిల్లలే ఉన్నారు. వాళ్ళను మనం తీర్చిదిద్దేపనిలో ఉన్నాం. కానీ మన పని ఆపిల్లవాళ్ళను పాస్ చేయించడానికి మాత్రమే పరిమితమైపోవాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. మనను అలా నియంత్రించాలని చూస్తున్నాయి. చదువునేర్పడం అంటే అదే కాదుకదా! రేపటి తరాలు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటాయని కొఠారి అన్నారు కదా! కానీ తరగతి గదుల్లో రూపుదిద్దేచోట ఉండేది మనం కదా! పిల్లల్ని ఏరకంగా రూపుదిద్దాలనే లక్ష్యం ఒకటి మనకు ఉండాలి కదా! ఉపాధ్యాయ సంఘాలు తమ టీచర్లను నిరంతరం అలా చైతన్య వంతంగా తయారు చేసుకునే కార్యక్రమాలు కూడా నిర్దేశించుకోవాలి కదా! అలా జరుగుతోందా?
ఒకవీరుడు మరణిస్తే కోటి మంది ప్రభవిస్తారు అని మనం నినాదాలు చేశాం. నిజమే కానీ ఆ కోటిమంది కూడా మామూలు పిల్లల్లాగే, మామూలు మనుషుల్లాగే పుడ్తారు. వాళ్ళను వీరులుగా, చైతన్యవంతులుగా, మంచి మనుషులుగా పీడితులవైపు నిలబడేవాళ్ళుగా ఎవరో తీర్చిదిద్దవలసిందే. ఆపని చేయవలసిన చారిత్రక కాల సందర్భంలో మనం ఇప్పుడు ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి ఊరిలోనూ, మన ఉపాధ్యాయులు ఉన్నారు కదా! మరి సాంస్కృతిక కేంద్రాలు, మన సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? టీచర్లలో, విద్యార్థుల్లో పాటలు పాడేవాళ్ళు రాసేవాళ్ళు కచ్చితంగా ఉంటారు. కొందరు అద్భుతంగా మాట్లాడగలరు. వాళ్ళల్లో ఉన్న ఆ శక్తుల్ని వెలికితెచ్చి రేపటి సమ సమాజంకోసం, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకోసం ఉపయోగపడేలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని మనం తప్పకుండా గుర్తించాలి కదా! ఆ దిశగా కార్యాచరణలో మనం ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ ఆచరణలో మనకంటే ప్రజావ్యతిరేకులే, పీడకులే తరాలనుంచి ముందున్నారు. వాటి ఫలితాలే ఇప్పుడు అనుభవిస్తున్నవి.

“కానీ మేడమ్!” మూడవ వరుసలోంచి ఓయువకుడు లేచి గట్టిగా అన్నాడు..“ఈనాటి టీచర్లకు విద్యారంగంలో, పాఠశాలల్లో , తరగతి గదుల్లో ఏమాత్రం స్వేచ్ఛలేదు. మీరు చెప్తున్న విషయాలకు అక్కడ ఏమాత్రం ఆస్కారంలేదు.” కొద్దిసేపు సభలో గందరగోళంగా టీచర్లు మాట్లాడుకోవడం మొదలైంది. కొందరు చప్పట్లు కొట్టారు. నిజమే నిజమే అన్నారు మరికొందరు గట్టిగా..
ఔను.. ఈనాటి విద్యారంగం పరిస్థితి, ఉపాధ్యాయుల పరిస్థితీ అలాగే ఉంది. అలాగే ఉండాలనీ, మరింత దారుణంగా తయారుకావాలనీ వ్యవస్థను శాసించేవాళ్ళు కోరుకుంటున్నారు. ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మిత్రులారా! స్వాతంత్రం అనేది ఎవరూ దయతో ఇవ్వరు. ఎవరికి వారు వ్యక్తులుగా, వ్యవస్థలుగా సాధించుకోవలసిందే. మన కార్యక్రమాలకు తరగతి గదులు మాత్రమే పరిమితం కావు. బడిలోనా, బడిబయటా మనకు ఇంకా స్పేస్ ఉంది. ఇప్పుడు మనం ఉత్తేజంతో తలచుకుంటున్న వాళ్ళందరూ ఆ సాధనలో ప్రాణాలొడ్డి కృషి చేసినవాళ్ళే..”
సరే మిత్రులారా! నేను చాలా సమయం తీసుకున్నాను. మిమ్మల్ని ఏమాత్రం ఆలోచించగలిగేలా చేయగలిగినా నేను విజయవంతమైనట్టే. మీ అందరికీ కృతజ్ఞతలు..” ఆమె తను మాట్లాడ్డం ముగించి తన కుర్చీవైపు వెళ్ళింది. కొన్ని క్షణాల గంభీరమైన నిశ్శబం. తరువాత చప్పట్లతో హాలంతా ప్రతిధ్వనించింది.
సుమారు మూడునెలల తరువాత ఆమె ఇంట్లో జరుగుతున్న చిన్న సంభాషణ ఇది..
“మేడమ్! మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మేం థాంక్స్ చెప్పాలి! కానీ తప్పకుండా మిమ్మల్ని కలవాలనీ, మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని, ఈ విషయాల్లో మీ సలహాలూ అడగాలనీ మాకు గట్టిగా అనిపించింది. అందుకే ఇలా మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం కేటాయించమని కోరాం..” చెప్పాడు ఉపాధ్యాయ సంఘ బాధ్యుడు.
ఫరవాలేదు. మీరు కూడా మీ వ్యక్తిగతమైన విషయాలేవో మాట్లాడ్డానికి అడగలేదని నేను ఊహించాను. చెప్పండి.. అంటూ వారి ముందు బిస్కట్‌లతో నిండి ఉన్న ట్రేను ఉంచింది సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్. “ఆరోజు మీరు ఆ స్ఫూర్తి సభలో మాట్లాడిన విషయాల గురించి మేం కూడా కొంతకాలంగా ఆలోచిస్తున్నాం. కానీ మీ మాటలతో మాకు స్పష్టత వచ్చింది. మేం ఆ దిశగా పనిచేయడం ప్రారంభించాం. ఈ మూడు నెలలకాలంలో మూడు జిల్లాల్లో మా టీచర్ల సంఘానికి సంబంధించిన మూడు సాంస్కృతిక కళాకేంద్రాలను సిద్ధం చేసుకున్నాం. మేం ఎక్కువ శ్రమ పడకుండానే ఆ జిల్లాల్లో మాకు మంచిగా పాటలు పాడే టీచర్లు, స్కిట్లు, నాటకాల పట్ల ఆసక్తి, అనుభవం ఉన్న టీచర్లు దొరికారు. కొందరు డక్కీ, తబలా, డోలు వాయించగలిగే వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళతో కొన్ని పాటలూ, చిన్న చిన్న నాటికలూ ప్రాక్టీసుకూడా చేయిస్తున్నాం. ఈ నెలలోనే వాటి ప్రారంభ కార్యక్రమాలు కూడా ఆ జిల్లాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వాటికి మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం”

“నిజంగా చాలా సంతోషం కలిగించే వార్త చెప్తున్నారు. ముందుగా మీకృషికి అభినందనలు. నేను రావడం రాకపోవడం ప్రధానంగా భావించకండి. ఇది మీరు మాత్రమే చేస్తున్న పని కాదని, ఇలాంటి ఎన్నో ప్రయత్నాలూ, ప్రయోగాలూ గతంలోమీలాంటి ఉపాధ్యాయ సంఘాలు కూడా చేశాయని గుర్తుపెట్టుకొండి”.
‘సరే మేడమ్! ఇలా దాదాపు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఇంకా ఏంచేస్తే బాగుంటుందో మీ సలహాలు కావాలి”
“సరే, ఇంకా చాలా చేయొచ్చు. కానీ ఇది ఒక దీర్ఘకాలిక సుదూర ప్రయాణం అని గుర్తుంచుకోండి. పాటలు రాసేవాళ్ళకోసం, పాడేవాళ్ళకోసం, స్కిట్లు వేసేవాళ్ళకోసం, రాసేవాళ్ళకోసం కార్యశాలలు కనీసం నెలకు ఒకటైనా ఏర్పాటుచేయండి. వాటిలో కేవలం టీచర్లనేకాదు, రిటైర్డయిన వాళ్ళని కూడా కలుపుకొండి. దగ్గరలో ఈ రంగాల్లో సహకరించే వాళ్లెవరైనా ఉంటే వాళ్ళ సహకారం కూడా తీసుకొండి. మీవాళ్ళు రాసేవాటిలో, పాడేవాటిలో ప్రదర్శించేవాటిలో ఈనాటి విద్యారంగంలోని అశాస్త్రీయ, అవాంఛనీయ పరిస్థితులనూ, మీ డిమాండ్లనూ వస్తువులుగా ఉండేలా చూడండి. హాస్యం, వ్యంగం జనాన్ని బలంగా చేరతాయి. అన్నీ పేద శ్రామిక వర్గాల విద్యార్థుల చదువుల, హక్కుల సంరక్షణలో భాగంగా ఉండాలనేది మొదటి షరతుగా ఉండేలా చూసుకొండి. ఇంకా క్రమంగా ఈనాటి సినీమాల పాటలగురించీ, సినీమాల గురించీ ప్రజల జీవితమ్మీద ప్రభావం చూపిస్తున్న విషయాలగురించి చర్చలు, ఆలోచనలు పంచుకోవడాలు వంటివి ఎన్నో చేయవచ్చు…”
“బాగుంది మేడం. కానీ మేం ఉద్యమాలు చేయకుండా ఇలాంటి పనులు చేస్తున్నామని, ఇది దిగజారిపోవడం అనీ మా సంఘం దారితప్పుతున్నదనీ అంటారేమో..” వచ్చిన వాళ్ళలో ఒక నాయకురాలు సందేహపడింది.
మేడం చిన్నగా నవ్వి చెప్పింది. “అంటారేమో అనే సందేహం అక్కర్లేదు. తప్పకుండా అంటారు కొందరు. ఉద్యమాలు అంటే ఊరేగింపులూ, ధర్నాలూ, నిరసనలూ, సమ్మెలూ మాత్రమే కాదు. అవి ప్రత్యేక సందర్భాల్లో చేసే కార్యక్రమాలు మాత్రమే. కానీ భావజాల నిర్మాణం అనేది నిరంతరం పలు రూపాల్లో జరుగుతుండాల్సిన ప్రక్రియ. భావజాల నిర్మాణం లేకుండా కేవలం ప్రదర్శనలు ఎంత విజయవంతమైనా వాటి ఫలితాలు మరెవరి చేతుల్లోకో పోతాయి. ఇప్పుడు మీరు చేయాలని అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు గత చరిత్రలో చైతన్యశీలమైన ఉపాధ్యాయ సంఘాలు చేసినవే. వాటిలో నేను కొత్తగా చేర్చినవి, చెప్పినవి ఏవీ లేవు. కానీ ఆనాటి చైతన్యం ఇప్పుడు ఆరిపోతున్న దీపంలా ఐపోయింది. ఏమాత్రమైనా మీలాంటి వాళ్ళు కాపాడుతారేమోననే ఆశతోనే నాలాంటివాళ్ళం మాట్లాడుతున్నాం..” మేడం నిట్టూర్పులో గతకాలపు వెలుగులు.. పసిడిరెక్కలు విసిరి కాలం జారిపోయిన జాడలు..
సరే చివరిగా ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకొండి. మీరు అనుకున్నంత అద్భుతంగా వీటి నిర్మాణాలు, కొనసాగింపులూ ఉండవు. వ్యతిరేకతలూ, అవహేళనలూ, సిద్ధాంతాల రాద్దాంతాలూ, మరోవైపునుంచి అణిచివేసే ప్రయత్నాలూ వంటివి అనేక రూపాల్లో ఎదురుకావచ్చు. మీరు ఎంతవరకు, ఏమేరకు ప్రయత్నాలు చేస్తారనేదాని మీద ఫలితాలు ఆధారపడివుంటాయి. వాటిలో ఏ ఒకటీ రెండో కొన్ని సంవత్సరాల పాటు నిలబడ్డా, కొందరైనా మన సాంస్కృతిక సైనికులు తయారౌతారు. మీరు నాయకులు కనుక ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకొండి. మీరు ఎంతబాగా ఉపన్యాసాలు చెప్తారు, మాట్లాడతారు అనే దానికన్నా మీవ్యక్తిత్వాలూ, మీ జీవితాచరణలే జనంతో మిమ్మల్ని నిలబెట్టేవి. మీ జీవితాచరణకూ, మీరు చెప్పే ఆదర్శాలకూ పెద్ద అంతరం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైంది.

ఏ సంఘంలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారనే దానికన్నా, మీరు ఎంతమందిని సరిగ్గా మార్చి, సరైన అవగాహన అందించి, ఆచరణలోకి తెస్తున్నారనేదే ఆ సంఘాల నిజమైన శక్తి. గొప్ప చైతన్యం గల సంఘాలుగా ముద్రలు వేసుకున్న వాళ్ళ ఉపాధ్యాయ నాయకులు సైతం చట్టసభలకు పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోయేపరిస్థితి ఎందుకు వస్తోంది? మనం వాళ్ళను ఏమేరకు చైతన్య పరుస్తున్నాం. ఏమేరకు కమిటెడ్‌గా మార్చుకుంటున్నాం.. మిత్రులారా! మనలాంటి ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించకపోతే ఈనాటి కార్పోరేటీకరణలో ప్రభుత్వ పాఠశాలలు, అంటే శ్రామిక ప్రజల పాఠశాలలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉనికిలో ఉండడం కూడా సాధ్యం కాని రోజులు ఏమంత దూరంలో లేవు.. సరే, ఇప్పుడు నేను మరోచోటికి వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం” అంటూ ఆ మీటింగ్‌ను ముగించింది ఆ ప్రొఫెసర్. ఆమెకు నమస్కారాలు చేసి అందరూ బయటకు నడిచారు.
బయటకు రాగానే ముఖాన్ని చిటపట లాడిస్తూ “ఇవన్నీ అవసరమా? ఎప్పటికప్పుడు నిరసనలూ, డిమాండ్లూ, ధర్నాలూ, సదస్సులూ, సమావేశాలూ జరుపుతూనే ఉన్నాం కదా? ఈవిడ ఏదో చెప్తోంది” అన్నాడు వాళ్ళలో ఒకరు చిరాకుపడుతూ.
“అసలు మన పాఠశాలలు ఎలా నడుస్తున్నాయో, విద్యార్థులు, తరగతులు, అక్కడి పరిస్థితులు ఏం తెలుసు ఈమెకు? యూనివర్సిటీల గురించే తప్ప” అన్నారు మరొకరు..
“నిజమే, కానీ మనం ఇలాంటి పెద్ద పెద్ద మేధావులను మాత్రమే మనసభలకూ, సదస్సులకూ స్పీకర్లుగా పిలిచి మాట్లాడిస్తున్నాం కదా! వీళ్ళు పై స్థాయిలో విద్యారంగంలో జరుగుతున్న మార్పులనూ, పాలసీలనూ అద్భుతంగా వివరిస్తూ, వివిధ దేశాల్లోని విద్యావ్యవస్థల గురించి పరిచయం చేస్తున్నారు. ఆ విషయం గుర్తించింది కనుకనే మనల్లోంచి, రోజూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్న ఉపాధ్యాయుల్లోంచి స్పీకర్లు రావాలని, అలాంటి వాళ్ళను మనం తయారుచేసుకొని, మన సభల్లో మాట్లాడిస్తే చాలా ప్రయోజనంగా ఉంటుందని, వాళ్ళ సూచనలూ, అనుభవాలూ ఈనాటి పిల్లలకూ, మన రోజువారి బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ స్ఫూర్తినిస్తాయని, ఆదిశగా మనం ప్రయత్నించాలనే కదా తనమాటల్లో వారు చెప్పారు. పదండి. మరింతగా ఏంచేయగలమో చర్చించుకొని, ఆలోచించుకుందాం. మన ప్రయత్నం మనం చేద్దాం. అంటూ వాళ్ళ నాయకుడు తమ కారులో కూర్చున్నాడు. మిగతా వాళ్ళు అతణ్ణి అనుసరించారు.

డా. వి.ఆర్.శర్మ, 9177887749

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -