ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,000 నుండి 6,500 జాతీయ పార్కులు ఉన్నాయి. అయితే వివిధ దేశాలు, సంస్థలు జాతీయ పార్కును ఎలా నిర్వచిస్తాయనే దాన్ని బట్టి ఈ సంఖ్యలలో తేడాలు ఉంటాయి. 2026 నాటికి భారతదేశంలో 107 జాతీయ ఉద్యానవనాలు (నేషనల్ పార్కులు) ఉన్నాయి. 1936లో ఉత్తరాఖండ్‌లో నిర్మించబడిన జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం భారతదేశంలో మొట్ట మొదటి జాతీయ ఉద్యానవనం.
లడఖ్‌లో సుమారు 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హెమిస్ జాతీయ ఉద్యానవనం దేశంలోనే అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. అండమాన్ నికోబార్ దీవులలో సుమారు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సౌత్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం దేశంలోని అతిచిన్న జాతీయ ఉద్యానవనం. అయితే చెరి తొమ్మిది జాతీయ ఉద్యానవనాలతో అత్యధిక ఉద్యానవనాలు కలిగిన రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంగా మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం ‘కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనం’ మాత్రం మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఉంది.
మణిపూర్ రాష్ట్రానికే మకుటాయమానం
కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనం లోక్‌తక్ సరస్సుకు నైరుతి భాగంలో ఉంది. ఇది మణిపూర్ రాష్ట్ర నాట్య జింకగా ప్రసిద్ధి చెందిన బ్రౌ-యాంట్లెర్డ్ డీర్ (సంగై) చివరి సహజ ఆవాసం. ఇక్కడి ప్రత్యేకమైన చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థలో జింకలను చూడటం వన్యప్రాణి ప్రేమికులకు గొప్ప మధురానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ కనిపించే ఇతర వన్యప్రాణులలో హాగ్ డీర్, ఆటర్ సహా అనేక రకాల నీటి, వలస పక్షులు ఉన్నాయి. వలస పక్షులు ఈ ఉద్యానవనంలో సాధారణంగా నవంబర్ నుండి మార్చి వరకు కనిపిస్తాయి. మణిపూర్ అటవీ శాఖ ఈ పార్కులో వాచ్ టవర్లు, రెండు విశ్రాంతి గృహాలను నిర్వహిస్తుంది. అక్కడ జంతువులను వేటాడటం పూర్తిగా నిషేధించబడింది.
వన్యప్రాణుల అభయారణ్యంగా
ఈ జాతీయ ఉద్యానవనం తొలుత 1966లో వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తింపు పొందింది. ప్రధానంగా ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన “బ్రౌ-యాంట్లెర్డ్ డీర్” (సంగై జింక) జాతిని రక్షించడం కోసం దీనిని స్థాపించారు. ఆ తర్వాత 1977లో దీన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనంలో పాబోట్, తోయా, చింగ్జావో అనే మూడు కొండలు ఉన్నాయి. వర్షాకాలంలో నీటిమట్టాలు పెరిగి ఇక్కడి వన్యప్రాణుల సాధారణ ఆవాసాలు మునిగిపోయినప్పుడు, ఈ కొండలు వాటికి ఆశ్రయాలుగా పనిచేస్తాయి. ఈ జాతీయ ఉద్యానవనం కేవలం ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మాత్రమే కాదు. పక్షులు, వన్యప్రాణి ప్రేమికులకు లేదా అరుదైన సహజ దృగ్విషయాలపై ఆసక్తి గల వారికి ఈ ఉద్యానవనం ఎంతో ఉత్కంఠభరితంగా ఉండటంతో పాటు అనిర్వచనీయమైన అలౌకిక ఆనందాన్ని అందిస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైన సంగై జింకలను, నీటిపై తేలియాడే ఫుమ్డిలను సంరక్షించడం, ప్రకృతి పరిరక్షణ సాధించగల అద్భుతాలకు ఒక నిదర్శనంగా అభివర్ణించవచ్చు. ఫుమ్దీ (Phumdi) అనగా లోక్‌తక్ సరస్సులో నీటిపై తేలియాడే వృక్షసంపద, మట్టి, సేంద్రీయ పదార్థాల సముదాయం. వీటిని తేలియాడే ద్వీపాలు అని కూడా పిలుస్తారు.
సహజ ఆకర్షణ
కీబుల్ లాంజావో అందం దాని అసాధారణమైన తేలియాడే భూభాగం, గొప్ప జీవవైవిధ్యంలో ఉంది. చిత్తడి నేలతో కూడిన పర్యావరణ వ్యవస్థ, గడ్డి మైదానాలు, జల ఆవాసాల అద్భుతమైన సమ్మేళనం ఈ ఉద్యానవనాన్ని ఒక పర్యావరణ నిధిగా నిలుపుతుంది. ఇక్కడి తేలియాడే ద్వీపాలపై వృద్ధి చెందుతున్న అరుదైన వృక్ష, జంతుజాలాల దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులను, పర్యావరణవేత్తలను, ఫొటోగ్రాఫర్‌లను అమితంగా ఆకర్షిస్తుంది.
ఒక వింత అనుభవం
కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ఇక్కడ అనేక రకాల కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. నీటిపై తేలియాడే జీవపదార్థంపై నడవడం ఒక వింత అనుభవం. వివిధ కాలాలలో ఇక్కడికి విచ్చేసే అనేక జాతుల వలస పక్షులు సందర్శకులకు వీనుల విందు చేయడంతో పాటు వారి హృదయాలను తేలికపర్చి తన్మయత్వంతో తమను తాము మర్చిపోయేలా చేస్తాయి. ఈ ఉద్యానవనంలో ఉండే గైడెడ్ బోట్ టూర్లు మరో ప్రత్యేక ఆకర్షణ. నీటితో నిండిన ఫుమ్డిల గుండా సందర్శకులు ఈ బోట్లలో ప్రయాణిస్తుంటాడు. దీంతో ఉద్యానవనంలోని వన్యప్రాణులను, ముఖ్యంగా సంగై జింకలను దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ ఉద్యానవనం భౌగోళిక స్వరూపంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్న ఈ ఫుమ్డిలు చాలా దట్టంగా, దృఢంగా ఉండి గణనీయమైన బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీనివల్ల జింకలు, మనుషులు కూడా వాటిపై ఎటువంటి ప్రమాదం లేకుండా హాయిగా నడవగలరు.
పరిసర పర్యాటక ఆకర్షణలు
కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనం చుట్టుపక్కల ప్రాంతం సాంస్కృతిక, సహజ ప్రదేశాలతో సమృద్ధిగా ఉంటుంది. ఈ జాతీయ ఉద్యానవనానికి సమీపంలో ఉండే లోక్‌తక్ సరస్సు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో చేపలను వేటాడే జాలర్లను చూడవచ్చు. ఇది సహజంగానే సుందరమైన ఆ ప్రకృతి దృశ్యానికి మరింత శోభను చేకూరుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత జాతీయ సైన్యం మొదటిసారిగా భారత జెండాను ఎగురవేసిన జ్ఞాపకార్థం నిర్మించిన మోయిరాంగ్‌లోని ఐఎన్ఏ స్మారక చిహ్నం కూడా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. అంతేకాకుండా, పురాతన నగరమైన ఇంఫాల్ సహా సందడిగా ఉండే అక్కడి మార్కెట్లు, యుద్ధ స్మారక చిహ్నాలతో, మణిపూర్ సాంస్కృతిక వైభవాన్ని కూడా సందర్శకులు ఆకళింపు చేసుకునే అవకాశం ఉంటుంది.
రవాణా సౌకర్యాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుండి కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనం రోడ్డు మార్గం ద్వారా సుమారు 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జాతీయ ఉద్యానవనానికి విమాన, రైలు, రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఢిల్లీ, కోల్‌కతా, గౌహతి వంటి ప్రధాన నగరాల నుండి ఇంఫాల్‌కు విమానంలో చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. నాగాలాండ్‌లోని డిమాపూర్ ఇంఫాల్‌కు సుమారు 215 కి.మీ దూరంలో ఉంటుంది. డిమాపూర్ లేదా జిరిబామ్ నుండి ట్యాక్సీలు లేదా బస్సుల ద్వారా రోడ్డు మార్గంలో ఇంఫాల్ మీదుగా కుడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది కాకుండా, ఇంఫాల్ నుండి బిష్ణుపూర్, మొయిరాంగ్ మీదుగా కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనానికి బస్సులు లేదా ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యానవన సందర్శనకు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు అత్యంత అనువైన సమయం. ఈ సమయంలో తేలియాడే ఫుమ్డిలు మరింత స్థిరంగా ఉండడంతో తిరగడం సురక్షితంగా ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పార్క్ తెరిచి ఉంటుంది. అయితే ఉదయం పూట (సూర్యోదయ సమయం) వన్యప్రాణులను చూడటంలో కలిగే ఆనందాన్ని అనుభవించి తీరాల్సిందే!
యేచన్ చంద్ర శేఖర్, 8885050822
తేలియాడే ఉద్యానవనం
- Advertisement -
- Advertisement -



