మన భారతీయ సినిమాల్లో ప్రేమ, పెళ్లి ఈ రెండు తప్ప మరో సమస్య కన్పించదు. మళయాల చిత్రాలు, కొద్ది మేరకు తమిళ చిత్రాలు అందుకు మినహాయింపు. అడపాదడపా తెలుగు చిత్రాలు కూడా భిన్నమైన కథాంశంతో వెలువడుతున్నాయి. బాక్సాఫీస్ కోసం వెంపర్లాడకుండా బలగం, రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, చాంపియన్ వంచి చిత్రాలు వచ్చాయి. చాంపియన్ తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో తీసిన సినిమా. కుటుంబంలోని వ్యక్తులు వారి అహంకారాల ఇతివృత్తంలో నిర్మించిన చిత్రం బలగం. బలగం లాంటిదే పళ్లబురుసు సినిమా.
బలగం బాక్సాఫీస్ హిట్‌గా నిల్చింది. తెలంగాణ యాసలో ఇక్కడి స్థితిగతుల నేపథ్యంలో తీసిన చిత్రం ‘పళ్లబురుసు’ తెలంగాణలో టూత్ బ్రష్‌ను పండ్లబురుసు అని అంటారు. కారణమేదైనా ఆ పదాన్ని పళ్లబురుసుగా మార్చి ఈ సినిమాకు వాడారు. నూటికి నూరు పాళ్లు తెలంగాణ నేపథ్యంతో నిర్మించిన సినిమా అయినా సందేశం విశ్వజనీనం.
బలగంలో కొమరయ్య పాత్ర ధరించిన సుధాకర రెడ్డి ఈ చిత్రంలో శంభో పాత్రలో నటించాడు. శంభో ఒక ఎకరం భూమి గల రైతు. కొడుకు తిరుపతయ్య రైల్వే గేట్ మాన్. సినిమాలో కులం ప్రస్తావన ఉండదు గాని శంభోను డప్పు కొట్టే వ్యక్తిగా చూపెట్టారు. తిరుపతయ్య పాత్రను మురళీధర్ గౌడ్ పోషించాడు. తెలగాణ నేపథ్యంలో నిర్మితమవుతున్న సినిమాలన్నింటిలోనూ మురళీధర్ గౌడ్ కన్పించడం తప్పనిసరి. అలవోకగా నటించే మంచినటుడు.
తండ్రీ కొడుకులు వేర్వేరు ఊళ్లల్లో నివసిస్తుంటారు. భార్య చనిపోయిన శంభో ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు పట్టించుకోడు. పళ్ల డాక్టర్ సిఫారసు చేసిన టూత్ బ్రష్‌ను కూడా తండ్రికి తెచ్చివ్వడు. తండ్రి భూమిపై మాత్రం కన్నేసి ఊరంతా అప్పులు చేస్తాడు. కొడుకు తనను పట్టించుకోవడం లేదని శంభో కోర్టు మెట్లెక్కుతాడు. ఇద్దరూ ఒక రాజీకి రావాలని, అందుకు ఆరు నెలల గడువిస్తూ కోర్టు కేసును వాయిదా వేస్తుంది. చనిపోయిన తర్వాత తనను ఎవరైనా పట్టించుకొంటారో లేదోనన్న సందేహంతో శంభో తన పొలంలోనే తన కోసం బొంద తవ్వుకొంటాడు. తండ్రి పొలాన్ని తన అన్న అమ్ముకొంటున్నట్లు తెలిసి పక్కూరి నుండి కూతురు వచ్చి తనకు వాటా కావాలని కోరుతుంది. ఊరి పెద్దలు ఎకరం భూమిని ఇద్దరికీ సమానంగా పంచుతారు. బొందలో సగం కొడుక్కి, సగం కూతురికి వెళ్తుంది. ఇక లాభం లేదని ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా శంభో బొంద తవ్వుకుంటాడు. బొందలో పడుకొని ముందే తెచ్చిపెట్టుకొన్న పాలరాయి ఫలకాన్ని బొందపైకి లాక్కొంటాడు. టివి తీగను సరిచేయడానికి ఇంటి పెంకుల పైకి ఎక్కిన ఒక యువకుడు ఇది గమనించి కేకలేస్తాడు. శంభో ఈడుగల దోస్తులు పరుగెత్తుకొచ్చి ఫలకాన్ని తొలగించి శంభోను పైకి లాగుతారు.
ఈలోగా తిరుపతయ్యకు పశ్చాత్తాపం కలుగుతుంది. తనకు తెలియకుండా, తన ఇంట్లో కూతురి శ్రీమంతానికి జరుగుతున్న ఏర్పాట్లను చూసి తాను చేసిన తప్పేమిటో తెలిసొస్తుంది. తండ్రికి ఇష్టమని వేట మాంసం తెచ్చి తనే వండి బాక్సులో పెట్టుకొని మోటారు సైకిల్‌పై తండ్రి దగ్గరికి బయల్దేరుతాడు. తిరుపతయ్య తండ్రి ఇంటికి చేరే సరికి శంభోను అతని దోస్తులు బొంద నుండి బయటికి లాగి గట్టుపై కూర్చోబెట్టి ఉంటారు. పరితాప పడిన తిరుపతయ్య తండ్రి శంభోను మోటారు సైకిల్ పై ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు. దాంతో సినిమా ముగుస్తుంది.
సినిమా చిత్రీకరణ, భాష, భావ వక్తీకరణలు చక్కగా ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టని రీతిలో సినిమా సాగుతుంది. హాస్యం జోడించి ప్రస్తుత తరానికి తగిన సందేశం అందించిన ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. స్క్రీన్‌ప్లే తో పాటు సంభాషణలను కూడా ఆయనే రాసుకొన్నారు. బలగం లాంటి హిట్ పాటలు లేకపోవడం ఒక్కటే ఒక లోపంగా కన్పిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ చిత్రం అందరూ చూడదగ్గ పాలవిత్తుల మొక్కజొన్న కండె లాంటి “పళ్ల బురుసు” చిత్రం.
ఎస్. వినయ కుమార్, 9989718311
తండ్రీ కొడుకులకు చక్కటి సందేశం ‘పళ్లబురుసు’
- Advertisement -
- Advertisement -



