Sunday, September 20, 2026
E-PAPER
Homeకవితమనసు తేట పడి ‘తేనే’..!

మనసు తేట పడి ‘తేనే’..!

- Advertisement -


వ్యాకులత పొగమంచు వీడితేనే
మనసు అద్దం తన ప్రతిబింబాన్ని గుర్తిస్తుంది
గాయాల గర్భంలో
నిశ్శబ్దం నెమ్మదిగానే పురివిప్పుతుంది
కాలం కుట్టిన చీలికలపై
క్షమ ఓ మృదులాకుగా పరుచుకుంటుంది
అలజడికి అలసిన అలలు
ఒడ్డునే శాంతిగా చదువుకుంటాయి
ఆవేదన ఆరిన చోటే…
ఆనందం తొలి మొగ్గ తొడుగుతుంది
మనసు తేటపడితేనే…
మాటకు మాధుర్యం మొలుస్తుంది
లేనిపోని అనుమానాల ముళ్లు రాలితేనే..
ఆప్యాయతల పాదాలకు దారి దొరుకుతోంది
కోపం కరిగిన క్షణమే
కరుణకు వసంత ద్వారం తెరుచుకుంటుంది
చెదిరిన కలల బూడిదలోనే…
కొత్త వెలుగుల విత్తనం దాగుంటుంది
జాగ్రత్తగా మనమే వెతుక్కొని నాటుకోవాలి…
అహం కూలిన శిథిలాలపైనే
అనుబంధం గూడు కట్టుకుంటుంది
అందుకే… మనసు తేటపడి”తేనే”…….
పలుకు పరిమళమై హత్తుకుంటుంది
మనసు ఘర్షణ వీడి పదిలమైతేనే…
జీవిత గమనం సులువవుతుంది
భావాల తేనెతుట్టె కావాలంటే..
మనసు ఎలాగోలాగ తేటపడాలి ముందు
అప్పుడు ప్రతి హృదయం
మరో హృదయానికి పుష్పదళమై విచ్చుకుంటుంది
మనసు తేటపడటం అంటే…
తేనె తీయదనం నేర్చుకున్న ఆత్మకు
జీవితం రాసే మధురమైన ప్రత్యుత్తరం…!

డా.కటుకోఝ్వల రమేష్,
9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -