తేదీలు మారుతున్నాయి
అతడి డైరీలో మాత్రం
ఉద్యోగమనే పేజీ ఖాళీనే…
సర్టిఫికెట్లన్నీ ఆశల శవపేటికలో
జ్ఞాపకాలయ్యాయి !
ప్రతి ఉదయం కళ్ళు
ప్రకటనలు వెతుకుతాయి
ప్రతి సాయంత్రం తనకు తానే
ఓదార్చుకునే ప్రకటనగా మిగిలిపోతాడు !
అమ్మ కళ్లలో ఆశలు, నాన్న మౌనంలో
తీరని అప్పుల లెక్కలు అతన్ని
దోషిగా నిలబెడుతున్నాయి
ఇంటి గడియారం
సెకన్లు లెక్క పెడుతోంది
తాను మాత్రం వయసు
మింగుతున్నఅవకాశాలను
దిగమింగుకుంటాడు
పరీక్షలు నిద్రను కాజేశాయి
ఫలితాలు నవ్వును ఎత్తుకెళ్లాయి
ప్రయివేటుకెళ్తే అనుభవం అడుగుతారు
ఆ అవకాశం ఎక్కడో ఎవరూ చెప్పరు !
నిరుద్యోగమంటే కేవలం
ఉద్యోగం లేకపోవడం కాదు
ఇంట్లో మాటలు తగ్గిపోవడం,
బంధువుల ప్రశ్నలు పెరిగిపోవడం,
తగ్గుతున్న స్నేహితులతో
మనసు నిశ్శబ్దంగా మిగిలిపోవడం
అతడి డైరీలో ప్రతి పేజీ
రేపటి కోసం ఎదురుచూస్తూ
నిత్యం చచ్చిపోతున్నాయి
ఇకనైనా స్వయం ఉపాధి వైపు
అడుగులేయమని బోధిస్తూ..!
న్యాలకంటి నారాయణ, 9550833490
నిరుద్యోగి డైరీ
- Advertisement -
- Advertisement -



