అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నవతెలంగాణ-సంగారెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష–2027కు సంబంధించి ఉచిత కోచింగ్, మార్గదర్శకత్వం అందించేందుకు సమగ్ర మార్గదర్శక పథకం కింద అర్హత/స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరీ దేవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మానసాహిల్స్, రాజేంద్రనగర్‌లో ఉన్న ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ నందు ఈ ఉచిత కోచింగ్, మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09-09-2026
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23-09-2026 సాయంత్రం 6.00 గంటల వరకు
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 25-09-2026 మధ్యాహ్నం 2.00 గంటల నుంచి
స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 27-09-2026
పేపర్–I: ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు
పేపర్–II (CSAT): మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ:01-10-2026
తుది ఫలితాలు: 02-10-2026
శిక్షణ తరగతుల ప్రారంభం: 05-10-2026
అభ్యర్థులు సంబంధిత నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, కుటుంబ వార్షిక ఆదాయానికి సంబంధించిన నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలని,అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలకు మించకూడదని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా మొత్తం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారనీ, ఇందులో ఎస్టి –75, ఎస్ –15, బిసి –10 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అదనంగా, నిర్దిష్ట అర్హతలు కలిగిన 20 మంది ఎస్ అభ్యర్థులను డైరెక్ట్ ఎంట్రీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
స్క్రీనింగ్ పరీక్ష యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విధానంలో నిర్వహించబడుతుందని, ఇందులో జనరల్ స్టడీస్ పేపర్ -I, సి ఎస్ ఏ టి పేపర్ –II ఉంటాయనీ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు యూపీఎస్సీ కోచింగ్, మెంటరింగ్ సపోర్ట్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూకు సంబంధించిన మార్గదర్శకత్వం, ఉచిత భోజన, వసతి, లైబ్రరీ సౌకర్యం, ఇతర నిర్దేశిత విద్యా సౌకర్యాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు welfare.sriramsias.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.



