సాగునీటి కోసం రైతుల ఆందోళన
ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం యత్నం, అరెస్ట్
ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్
డ్యాం చుట్టూ పోలీస్ పహారా
గులాబీ నేతలు వర్సెస్ పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట
రైతుల నిరసనకు మద్దతుగా బీఆర్‌ఎస్ ధర్నా, హౌస్ అరెస్టులు
నవతెలంగాణ -ఆత్మకూరు
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జూరాల డ్యాం ముట్టడికి రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావడంతో ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ నెలకొంది. రైతుల ఆందోళనకు మద్దతుగా జూరాల డ్యాంపై ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు చుట్టూ 12 కిలోమీటర్ల పరిధిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బాసు హనుమంతునాయుడు తదితరులను పోలీసులు తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేశారు. పాలమూరు జిల్లాలో సాగునీటి కోసం రెండు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూరాల ఆయకట్టులో పొలాలు ఎండిపోవడంతో శనివారం రైతులే స్వయంగా ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో అధికారులు అర్ధరాత్రి తిరిగి గేట్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం జూరాల ప్రాజెక్టు ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జూరాలకు బయలుదేరారు. నందిమల్ల వద్ద పోలీసులు ఆయనను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని నిరసన తెలిపేందుకు రైతులతో కలిసి వెళ్లడం నేరమా అంటూ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.
జూరాలలో నీళ్లున్నా ఎందుకివ్వరు: చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
ఆందోళన సందర్భంగా చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టులో నీళ్లున్నా ఆయకట్టుకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టులో తొమ్మిది టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, సాగు చేసిన పంటలు ఎండిపోతున్నందున సాగునీటి అవసరాల కోసం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీలు సరిపోతాయని, మిగిలిన ఏడు టీఎంసీలను సాగునీటికి ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. రైతుల పంటల్ని కాపాడేందుకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరారు. జూరాల డ్యామ్ వ్యవసాయం కోసం కట్టిందని, తాగునీటి కోసం కాదని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీరు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తుందని తెలిపారు. జూరాల నుంచి తాగునీరు వాడకూడదనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలని సూచించారు. మంత్రికి శక్తి ఉంటే కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని తీసుకురావాలని హితువు పలికారు. గతంలో నీటి కొరత వచ్చినప్పుడు మక్తల్ పట్టణం పక్కన ఉన్న సంఘం బెండ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ఎల్‌నినో పేరు చెప్పి ప్రభుత్వం ఎన్ని రోజులు తప్పించుకుంటుందని ప్రశ్నించారు. పంట చేతికి వచ్చే సమయంలో నీటిని నిలిపివే యడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళ నలో ఉన్నారన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పే కాంగ్రెస్ రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు.
ప్రాజెక్టు వద్ద పోలీస్ పహారా
రైతుల ఆందోళన నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ, ఎస్సైలు, పోలీసులు ఏఆర్ సిబ్బందితో నిరంతర పహారా కాస్తున్నారు. ప్రాజెక్టు వైపు వెళ్లే అన్ని రహదారుల్లో వాహన తనిఖీలు చేపట్టారు. జూరాల చుట్టూ పోలీసు బలగాలు మోహరించాయి.
ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు.. ముందస్తు అరెస్టులు
జూరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ ఇచ్చిన డ్యాం ముట్టడి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచి బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నాయకు లు రవి కుమార్ యాదవ్, మండ్ల రామకృష్ణ, వీరేష్ లింగం, లక్ష్మీకాంత్ రెడ్డి, కోటేష్ తదితరులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
జూరాల వద్ద హైటెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



