ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమానికి శ్రీకారం
మేం తప్పులు చేస్తే చర్యలు తీసుకోవచ్చు
సిరిసిల్లలో 8 వేల ఎకరాలు
కబ్జా చేసిందెవరు? : బీఆర్‌ఎస్ నేతల అరెస్టుకు కేటీఆర్ ఖండన
జూరాలలో నీళ్లున్నా ఎందుకు విడుదల చేయటం లేదు?
ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమానికి శ్రీకారం : బీఆర్‌ఎస్
నేతల అరెస్టుకు కేటీఆర్ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్‌ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడయాతో మాట్లాడుతూ వరద జలాలపై కట్టిన ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం నీరు తీసుకెళ్తుంటే ఇక్కడ నికర జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల కింద కూడా నీరు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ ఏడాది వచ్చిన 248 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ కేవలం 28 టీఎంసీలు మాత్రమే వాడిందని వివరించారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రైతులకు మొదటి శత్రువులా తయారయ్యారని అన్నారు. ఎల్‌నినో తరహాలో ఎల్ కాంగో వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. రైతుల కోసం వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలను దుర్మార్గంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో భయటపెట్టలేరని అన్నారు. జూరాల కింద ఒక్క ఎకరం పంట ఎండినా కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామనీ, ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాలు కాకుండా రైతుల ప్రయోజనాలు ముఖ్యం కావాలని సూచించారు. రైతుల విషయంలో రాజకీయం చేయొద్దని కోరారు. కన్నేపల్లి, నార్లాపూర్ పంపులను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి పది టీఎంసీల నీరు తీసుకొచ్చి పంటలను కాపాడాలని చెప్పారు. తాము ఏమైనా తప్పులు చేసి ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయినా తీసుకోవచ్చని అన్నారు. డ్రామాలు తగవనీ, భూముల వద్దకు వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని సవాల్ చేస్తే ఇప్పటి వరకు కనీసం స్పందన లేదని అన్నారు. సిరిసిల్ల వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చెప్తారని ప్రశ్నించారు. నేతన్నల ఆత్మహత్యలు, రైతుబంధు ఎగ్గొట్టింది వివరిస్తారా?అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో చేసిన అభివృద్ధిని చూసి కొడంగల్‌లో అమలు చేసేందుకు వస్తున్నారేమోనని అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాల భూమిని ఎవరు కబ్జా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజన్న దర్శనం చేసుకుని పాప ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు.
పలువురి చేరిక
తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గం జాఫర్ ఘడ్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక బీఆర్ఎస్ నేతలు యాస జితేందర్ రెడ్డి, తాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, యాస సందీప్ రెడ్డి, చిడిమిల్ల మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ శ్రేణుల అణచి వేతకు రాష్ట్ర సర్కారు కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



