Wednesday, September 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకోవిడ్‌ కంటే తీవ్ర సంక్షోభం

కోవిడ్‌ కంటే తీవ్ర సంక్షోభం

- Advertisement -

కొంపముంచిన ఇరాన్‌ యుద్ధం..
సరఫరాలలో తీవ్ర జాప్యం…ప్రతీకార సుంకాలు…ద్రవ్యోల్బణం
కుదేలైన అమెరికా వ్యాపారాలు
అగ్నికి ఆజ్యం పోసిన 
సూపర్‌ ఎల్‌నినో

వాషింగ్టన్‌ : ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా ప్రారంభించిన యుద్ధం…వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు…తాజాగా వచ్చిపడిన సూపర్‌ ఎల్‌నినో ముప్పు…ఇవన్నీ కలగలిసి ప్రస్తుతం అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వీటికి తోడు హార్ముజ్‌ జలసంధి మూసివేతతో ఇంధన రవాణాలో ఎదురవుతున్న సమస్యలు, ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు వ్యాపారులను మరింత కుంగదీస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సప్లయి మేనేజ్‌మెంట్‌ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పలువురు వ్యాపారులు ప్రస్తుత వాతావరణాన్ని కోవిడ్‌ మహమ్మారి కంటే తీవ్రమైనదిగా అభివర్ణించారు. సరఫరాలలో ఏర్పడుతున్న అంతరాయాలు, ధరల అస్థిరత మధ్య వ్యాపారులు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో వారికి అర్థం కావడం లేదు. ధరలను పెంచుదామా అంటే ఇప్పటికే ద్రవ్యోల్బణంతో తీవ్ర ఆందోళన చెందుతున్న వినియోగదారులు అందుకు అంగీకరించేందుకు సిద్ధంగా లేరు.

ఎంఓయూ మిగిల్చిన సంతోషం ఆవిరి
ఇది కచ్చితంగా కోవిడ్‌ కంటే పెద్ద సమస్య అని డెన్వర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ జాన్‌ బఫింగ్టన్‌ చెప్పారు. ఇది పూర్తిగా భిన్నమైన ఇంధన సమస్యని అన్నారు. ఇరాన్‌పై మొదలు పెట్టిన పోరును తాత్కాలిక ఆర్థిక అవాంతరంగా చిత్రీకరించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. యుద్ధం ముగిసిన తర్వాత ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని ఊదర కొట్టింది. కానీ జరిగింది వేరు…యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసినప్పటికీ ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోకి రావ డానికి చాలా సమయం పడుతుంది. ఇరాన్‌పై యుద్ధంలో విజయం సాధిస్తే చమురు ధరలు ఒక్కసారిగా పడిపోతాయని, ఆ పని చాలా వేగంగా జరుగుతుందని కార్మిక దినోత్సవం రోజు ట్రంప్‌ చెప్పారు. జూన్‌లో అమెరికా, ఇరాన్‌ మధ్య ఎంఓయూ కుదరడంతో హార్ముజ్‌ కొద్దికాలం తెరుచుకుంది. ఆ సమయంలో గ్యాస్‌ ధరలు తగ్గాయి. చమురు ధరలు యుద్ధానికి ముందున్న స్థాయికి పడిపోయాయి. అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.

చిన్న వ్యాపారులపై పెనుభారం
అమెరికాలో ప్రస్తుతం 3.62 కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఇవి ఆ దేశంలోని మొత్తం వ్యాపారాలలో 99.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జీడీపీలో వీటి వాటా 43.5 శాతం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్‌ ఖర్చులు పెరిగాయి. దీని వల్ల చిన్న వ్యాపారాలపై ఆర్థిక భారం ఎక్కువగా పడుతోంది. ప్రస్తుతం కోర్‌ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.4 శాతం మధ్య కొనసాగుతోంది. వస్తువులు, ఇంధన ధరల పెరుగుదల చిన్న కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపుతోంది. దిగుమతి సుంకాలు, వాణిజ్య విధానాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలు వ్యాపార వర్గాలలో అనిశ్చితి పెంచుతోంది.

ఆర్థిక రంగాన్ని కుదిపేస్తున్న పరిణామాలు
జూన్‌ తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధిక ఇంధన, రవాణా ధరల ప్రభావం ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాలపై పడడం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న పోరు, రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ జరుపుతున్న బాంబు దాడుల కారణంగా డీజిల్‌ ధరలు రెట్టింపయ్యాయి. సరఫరాలలో ఏర్పడుతున్న అంతరాయాల కారణంగా రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పులి మీద పుట్రలా వాతావరణం కూడా వ్యాపారాల పాలిట శాపంగా మారింది. తుపానుల కారణంగా ప్రపంచంలోనే అతి పెద్ద కంటెయినర్‌ పోర్ట్‌ అయిన షాంఘై ఓడరేవును రెండు వారాల పాటు మూసివేయాల్సి వచ్చింది. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు, సోమాలియా సముద్రపు దొంగల విజృంభణ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి షిప్పింగ్‌ కంపెనీలు తమ నౌకల మార్గాన్ని ఆఫ్రికా ఖండం చుట్టూ మళ్లించాల్సి వస్తోంది. దీంతో ఈ ఏడాది షిప్పింగ్‌ సామర్ధ్యం పదిహేను శాతం తగ్గిపోయింది. తాజాగా వచ్చి పడిన సూపర్‌ ఎల్‌నినో వియత్నాం, బ్రెజిల్‌ దేశాలలోని కాఫీ పంటపై తీవ్ర ప్రభావం చూపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -