నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా సమస్యలే ఎజెండాగా.. ప్రజల గొంతుకే తన స్వరంగా పదకొండేళ్లుగా సాగుతున్న నవతెలంగాణ ప్రస్థానాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో పత్రిక క్యాంపెయిన్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య , పొన్నం వెంకటేశ్వరరావు పాల్గొని క్యాంపెయిన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అనేక సవాళ్లను అధిగమిస్తూ నవతెలంగాణ ప్రజల పక్షాన తన పాత్రను కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల జీవనానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ, కార్మిక, ఉద్యోగ, మహిళా తదితర అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తూ సమస్యలకు అద్దం పడుతోందన్నారు.
కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, అణగారిన వర్గాల సమస్యలు, ప్రజల సంవేదనలు, ఆందోళనలకు పత్రికలో ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రజా సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారాల కోసం ప్రజల్లో చైతన్యం కల్పిస్తోందని తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్య సాధనతో పాటు ప్రజా వనరుల పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై నిర్భయంగా వాస్తవాలను వెల్లడిస్తోందన్నారు. అణచివేత, వివక్షకు గురయ్యే వర్గాలకు అండగా నిలుస్తూ, ప్రజలను మభ్యపెట్టే విధానాలను ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు.
భిన్న మతాలు, తెగలు, సంప్రదాయాలు, సంస్కృతులతో కూడిన తెలంగాణ సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే వార్తలు, కథనాలు, వ్యాసాలను ప్రచురించడం నవతెలంగాణ ప్రత్యేకత అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నిజాయితీ, నిర్భీతి, నిబద్ధతతో కూడిన పాత్రికేయ బృందం ప్రతిరోజూ సమగ్ర సమాచారాన్ని పాఠకుల ముందుకు తీసుకువస్తోందన్నారు. క్యాంపెయిన్ లో సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా నాయకులు చిరంజీవి,రాజబాబు,మోరంపూడి పాండురంగ,మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



