– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు, వంట బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను నెలల తరబడి చెల్లించకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సీఆర్పీ నాగేశ్వరరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు వెళ్లే కార్మిక నాయకులను అరెస్టు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూను అమలు చేయడానికి కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, సత్యవతి, శ్రీదేవి, ఈశ్వరమ్మ, జయ, రాములమ్మ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.



