– పీడీఎస్ యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకుల పిలుపు
నవతెలంగాణ-సత్తుపల్లి
భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదం, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలని పీడీఎస్ యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు పిలుపునిచ్చారు. విప్లవ వీరుడు షాహిద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా సత్తుపల్లిలోని నీలం రామచంద్రయ్య భవనంలో మంగళవారం సదస్సు జరిగింది. పీడీఎస్ యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి ఝాన్సీ, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా ప్రసంగించారు.
అమెరికా ఆధిపత్య ధోరణులు, సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ బ్రిటిష్ పాలనపైనే కాకుండా, దోపిడీ లేని సమాజం కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కాపాడబడాలంటే ప్రజల ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. భగత్ సింగ్ చూపిన ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు ఏకమై పోరాడాలని ఉద్ఘాటించారు. మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళా లోకం చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సంస్కృతిపై సమరశీల పోరాటాలు చేయాలన్నారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి, యువజన లోకం నిరంతరం ఉద్యమించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ మండల కార్యదర్శి వెంకటనరసమ్మ, అలివేలు, సుకన్య, పీవైఎల్ నాయకులు నాగరాజు, రమేష్, నగేష్ పాల్గొన్నారు.



