నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల్లో తెగుళ్లు, పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని ఏడీఏ పెంటేల రవికుమార్ సూచించారు. వివిధ పంటల ప్రస్తుత దశకు అనుగుణంగా ఆయన పలు వ్యవసాయ సలహాలను వెల్లడించారు.
వరిలో..
వరి పంట ప్రస్తుతం పిలక దశలో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పొట్ట దశలో ఉందన్నారు. ప్రస్తుత వాతావరణం ఆకుముడత పురుగు ఆశించేందుకు అనుకూలంగా ఉన్నందున లీటరు నీటికి 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.1 మి.లీ. ఫ్లూబెండమైడ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు + కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు + కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కాండంతొలుచు పురుగు నివారణకు 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్, కాండం కుళ్లు తెగులుకు 1 మి.లీ. ప్రొపికోనజోల్ లేదా 2 మి.లీ. హెక్సాకోనజోల్ లేదా 2 మి.లీ. వాలిడామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.
ప్రత్తిలో..
ప్రత్తి పంట పూత నుంచి కాయల అభివృద్ధి దశలో ఉందని తెలిపారు. వర్షాధార ప్రత్తిలో విత్తిన 80 రోజుల సమయంలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని సూచించారు. పచ్చదోమ, తామరపురుగులు గమనించినట్లయితే సంబంధిత పురుగు మందులను 1500 పీపీఎం వేపనూనెతో కలిపి పిచికారీ చేయాలన్నారు.
ప్రస్తుత వాతావరణం గులాబీరంగు పురుగు ఆశించేందుకు అనుకూలంగా ఉన్నందున పొలం గట్లపై ఉన్న వయ్యారి భామ కలుపును తొలగించాలని సూచించారు. ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి, వరుసగా రెండు మూడు రోజుల్లో ఒక్కో బుట్టలో 7–8 రెక్కల పురుగులు కనిపిస్తే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పురుగు నివారణకు 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ + 5 మి.లీ. 1500 పీపీఎం వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. పిచికారీని ఉదయం 10 గంటలలోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత చేయాలని సూచించారు.
మొక్కజొన్నలో..
మొక్కజొన్న పూత దశ నుంచి గింజ గట్టి పడే దశలో ఉందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో మొక్కలు నేల నుంచి పోషకాలను సరిగా గ్రహించలేక వడలిపోయినట్లు కనిపిస్తే 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. ఫ్యూజేరియం ఎండు తెగులు గమనించినట్లయితే 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ను లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ నేల బాగా తడిచేలా పోయాలని తెలిపారు.
కందిలో…
కంది ప్రస్తుతం శాఖీయ దశలో ఉందని తెలిపారు. ఫైటాఫ్తోరా ఎండు తెగులు గమనించినట్లయితే 2 గ్రాముల మెటలాక్సిల్ను లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ నేల బాగా తడిచేలా పోయాలని సూచించారు. కాండం ఈగ ఆశించినట్లయితే 1 గ్రాము ఎసిఫేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.
మినుములో…
మినుము పూత నుంచి కాయ అభివృద్ధి దశలో ఉందని తెలిపారు. కాండపు ఈగ నివారణకు 1 గ్రాము ఎసిఫేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మొవ్వు కుళ్లు తెగులు గమనించినట్లయితే 0.3 మి.లీ. స్పైనోసాడ్ లేదా 1.25 గ్రాముల డైఫెన్థయురాన్ 50% WP లేదా 1 మి.లీ. స్పైనటోరామ్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని ఏడీఏ రవికుమార్ సూచించారు.



