– ఉప్పునుంతలలో చిన్న, సన్నకారు రైతులకు విత్తనాల పంపిణీ
– ఫ్రంట్లైన్ డెమాన్స్ట్రేషన్తో అధిక దిగుబడిపై శాస్త్రవేత్తల అవగాహన
నవతెలంగాణ-ఉప్పునుంతల
వేరుశనగ సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు నూతన రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో గిర్నార్-4 వేరుశనగ విత్తనాలను బుధవారం పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ మడ్డు నరేందర్ రెడ్డి, సీఈవో రవీందర్ రావు ఆధ్వర్యంలో చిన్న, సన్నకారు రైతులు, ఎఫ్పీఓ రైతులకు విత్తనాలను అందజేశారు. భారతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ (ఐఐజీఆర్), రేకులకుంట, అనంతపురం ఆధ్వర్యంలో ఫ్రంట్లైన్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఐఐజీఆర్కు చెందిన టీ-1 దేవ్కాంత్ సింగ్, యంగ్ ప్రొఫెషనల్-1 ఈ. మహేష్ రెడ్డి, పాలెం ప్రిన్సిపల్ సైంటిస్ట్, జనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగానికి చెందిన డా. శశిభూషణ్, అగ్రానమీ శాస్త్రవేత్త డా. శోభా రాథోడ్, టెక్నికల్ స్టాఫ్ మురళి, డొమైన్ ఎక్స్పర్ట్ అసిస్టెంట్ వరుణ్ తేజ్ పాల్గొన్నారు.
రైతులు గిర్నార్-4 రకాన్ని సాగులో ప్రవేశపెట్టి దాని పనితీరు, దిగుబడి తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఫ్రంట్లైన్ డెమాన్స్ట్రేషన్ చేపట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, రైతులు, ఎఫ్పీఓ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



