ఈ నెల 30లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి: ఏఈఓ శివకుమార్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ (రైతు ఐడీ) తప్పనిసరిగా చేసుకోవాలని కొలనుపాక వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు ఈ నెల 30వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. కొలనుపాక రైతువేదిక,గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ శిబిరాల్లో ఆయన మాట్లాడుతూ.. 2026 ఆగస్టు 13వ తేదీ వరకు భూమి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతుల వ్యక్తిగత వివరాలు, ఆధార్ సంఖ్య, భూమి వివరాలను నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు సంఖ్యను (ఫార్మర్ ఐడీ) జారీ చేస్తుందని చెప్పారు.
ఫార్మర్ ఐడీ ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, పంటల నమోదు, పంటల విక్రయం, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి వ్యవసాయ సంబంధిత సేవలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు ఆలస్యం చేయకుండా సమీప వ్యవసాయ కార్యాలయం, మీ సేవ కేంద్రం లేదా సీఎస్‌సీ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌కు ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ అవసరమన్నారు.



