వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సొంతం
బ్యాడ్మింటన్‌లో మెన్స్ జట్టుకు కాంస్యం
2026 ఆసియా క్రీడలు
ఓ ఒలింపిక్ పతకం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మూడు మెడల్స్. కామన్వెల్త్ క్రీడల్లో మరో మూడు పతకాలు. ఆసియా చాంపియన్‌షిప్స్‌లోనూ ఓ మెడల్. ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లలో అన్నింటా పోడియం ఫినిష్ చేసినా, అయినా ఏదో వెలితి. అదే ఆసియా క్రీడల్లో మెడల్. 2026లో ఆ లోటును తీర్చుకుంది దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను. ఆసియా క్రీడల్లో మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించింది.
నగోయా (జపాన్)
ఆసియా క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టింగ్ పతక నిరీక్షణకు తెరపడింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి మహిళల 63 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా.. సరిగ్గా 28 ఏండ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మరో భారత వెయిట్‌లిఫ్టర్ వెండి కాంతులతో వెలుగొందింది. ఇటు భారత్‌తో పాటు మీరాబాయి చానుకు సైతం ఆసియా క్రీడల్లో పతక వెలితి వేధించింది. 2014 ఆసియా క్రీడల్లో తొలిసారి పోటీపడిన మీరాబాయి చాను తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018 జకర్తా ఆసియా క్రీడలకు గాయంతో దూరమైంది. 2023 గాంగ్జౌ ఆసియా క్రీడల్లో నాల్గో స్థానంతో పతకానికి అడుగు దూరంలో ఆగిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌తో శిఖర స్థాయికి చేరుకున్న మీరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. 49కేజీల మహిళల విభాగంలో స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు ఎత్తింది. ఓవరాల్‌గా 198 కేజీలతో మీరాబాయి చాను రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. దక్షిణ కొరియా వెయిట్‌లిఫ్టర్, డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ రి సంగ్ గమ్ 215 కేజీలతో (94+121) బంగారు పతకం నిలుపుకుంది. ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా వెయిట్‌లిఫ్టర్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం. ఇండోనేషియా వెయిట్‌లిఫ్టర్ లులుక్ డయానా 191 కేజీలు (88+103) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. స్నాచ్‌లో మీరాబాయి చాను 83 కేజీలు, 85 కేజీలు, 87కేజీలు ఎటువంటి తడబాటు లేకుండా అలవోకగా ఎత్తిపడేసింది. క్లీన్ అండ్ జెర్క్‌లో తొలుత 107 కేజీలు ఎత్తిన మీరాబాయి చాను ఆ తర్వాత 111 కేజీలతో మెరుగైంది. కానీ ఆ తర్వాత మూడో ప్రయత్నం చేయలేదు. ‘కొంత ఒత్తిడి ఉండేది. కానీ పతకం నెగ్గుతానా లేదా అనేంత ఒత్తిడి కాదు. మెడల్ సాధిస్తాననే నమ్మకం నాకుంది. నన్ను నమ్మేవాళ్లకు నాపై అంచనాలు ఉన్నాయి. నా కోచ్‌లు, సహాయక సిబ్బంది నేను దేశానికి మరో మెడల్ సాధించేందుకు సహకరించారు’అని మీరాబాయి చాను తెలిపింది. మహిళల 53 కేజీల విభాగంలో పోటీపడిన జ్క్షానేశ్వరి యాదవ్ 195 కేజీలు (87+108)తో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
బ్యాడ్మింటన్‌లో కాంస్యం
పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అగ్రజట్టు చైనా చేతిలో భారత్ 1-3తో పరాజయం పాలైంది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 16-21, 18-21తో షి యుకి చేతిలో ఓడాడు. డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-11, 22-2-తో లియాంగ్, చాంగ్‌లపై గెలుపొంది లెక్క సమం చేశారు. రెండో సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 19-21, 13-21తో షి ఫెంగ్ చేతిలో కంగుతిన్నాడు. రెండో డబుల్స్‌లో హరిహరణ్, ఎంఆర్ అర్జున్ జోడీ 16-21, 9-21తో నిరాశపరిచారు. దీంతో చైనా 3-1తో గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఓటమితో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
వుషూలో భారత్ కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేసుకుంది. మహిళల వుషూ 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి పసిడి పోరుకు చేరుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇండోనేషియా అమ్మాయి తానియాపై 2-0తో రోషిబినా దేవి గెలుపొందింది. నేడు ఫైనల్లో పసిడి పతకం కోసం చైనా అమ్మాయి జాంగ్‌తో రోషిబినా దేవి పోటీపడనుంది.
షూటింగ్లో డబుల్ ధమాకా
షూటింగ్లో భారత్ బుధవారం డబుల్ ధమాకా మోగించింది. స్కీట్ టీమ్ విభాగంలో భారత పురుష, మహిళల జట్లు కాంస్య పతకం సాధించాయి. మహేశ్వరి చౌహాన్, పరినాజ్ దాలివాల్, రైజా ధిల్లాన్లతో కూడిన మహిళల జట్టు 331 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. చైనా (357), కజకిస్తాన్ (336) గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాయి. అనంత్‌జిత్ సింగ్, మేరాజ్ అహ్మద్ ఖాన్, భవతేజ్ సింగ్ గిల్‌తో కూడిన మెన్స్ జట్టు 346 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది. స్టార్ షూటర్ మను భాకర్ మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 10మీ ఎయిర్ పిస్టల్ జట్టు విభాగంలో ఇషా సింగ్, సురుచి సింగ్, మను భాకర్ త్రయం వియత్నాంతో కలిసి 1719 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచినా.. మెరుగైన ఇన్నర్ 10 స్కోరింగ్‌తో వియత్నాం కాంస్య పతకం దక్కించుకుంది.
సాఫ్ట్‌టెన్నిస్‌లో మెడల్ ఖాయం
ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారి సాఫ్ట్ టెన్నిస్‌లో పతకం ఖాతాలో వేసుకోనుంది. పురుషుల వ్యక్తిగత సాఫ్ట్‌టెన్నిస్‌లో జే మీనా సెమీఫైనల్‌కు ప్రవేశించాడు. బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో షెర్విన్ నుగియట్పై ఏడు గేముల థ్రిల్లర్‌లో గెలుపొందాడు. 0-4, 4-2, 2-4, 4-2, 5-3, 2-4, 7-5తో జే మీనా విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. జే మీనా సెమీస్‌లో అడుగుపెట్టి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు.
వెండికొండ మీరాబాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



