30 వేల మంది పోలీసులతో భారీ భద్రత : డీజీపీ
డీజేలు, బాణసంచాకు దూరంగా
ఉండాలని ఉత్సవ కమిటీలకు సూచన
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న
సి.వి.ఆనంద్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసిందనీ, ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లోని కమిషనరేట్ల పరిధులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 30వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లను చేసినట్టు రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్ తెలిపారు. బుధవారం ప్రసిద్ధ ఖైరతాబాద్ వినాయకుడిని ఆయన కుటుంబ సమేతంగా వచ్చి దర్శించు కున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ… రాష్ట్ర రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా నగర పోలీసు కమిషనర్లు జిల్లాల ఎస్పీలు వ్యూహాత్మకమైన బందోబస్తును ఏర్పాటు చేసిన ట్టు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
13 ఏండ్లుగా ఖైరతాబాద్‌తో అనుబంధం…
సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలతో తనకు 13 ఏండ్ల అనుబంధం ఉందని డీజీపీ గుర్తుచేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్స వాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యుల తో పాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
30 వేల మంది పోలీసులతో బందోబస్తు
పది రోజుల గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయని డీజీపీ తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయనీ, రేపు, ఎల్లుండి భారీ సంఖ్యలో నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ సీపీలు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సుమారు 30 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం మోహరించినట్టు వెల్లడించారు.
అన్ని శాఖల సమన్వయంతో..
నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ, విద్యుత్, జలవనరులు, ఇతర ప్రభుత్వ శాఖలతో పోలీసుశాఖ సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై అవసరమైన చోట్ల క్రేన్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో చోరీలు, మహిళల పట్ల వేధింపులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు. షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించామనీ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
డీజేలు, బాణసంచా వద్దు
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, బాణసంచా వినియోగంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని డీజీపీ గుర్తుచేశారు. అధిక శబ్దాలతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డీజేలు, బాణసంచాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని డీజీపీ సూచించారు.
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



