ఆ పాట సిరిసిల్లా, జగిత్యాల రైతుల గుండె ఘోషను వినిపిస్తున్నది. ఆ పాట తెలంగాణ ఉద్యమానికి జీవం పోస్తున్నది. ఆ పాట బహుజన బతకమ్మయి వెలివాడలు చుట్టి వస్తున్నది. ఆ పాట ఆదివాసీల జీవన విధ్వంసాన్ని పౌర సమాజానికి వివరిస్తున్నది. ఆ పాటల పెద్దక్కనే అరుణోదయ విమలక్క. యాభై ఏండ్లుగా అలుపెరుగక సాగిస్తున్న ఆమె పాటల ప్రస్తానం గూర్చి నేటి మానవిలో…
తన జీవన ప్రస్థానంలో విమల బాల్యం నుండి పాటని తన తోబుట్టువుగా ముందుకు తీసికెళ్లింది. పాట పాడడాన్ని తన జీవనశైలిగా మార్చుకుంది. ఎక్కడ వున్నా ఏం చేస్తున్నా తన గొంతులో పాట కూనిరాగమై చుట్టుపక్కల ప్రజల నోళ్లలోకి అలవోకగా ప్రవేశిస్తుంది. పాట కేవలం పాడడమే కాకుండా, అందులోని దుఃఖాన్ని, ఆర్తిని విమల తన గొంతులో స్వరపరుచుకుంది. అవసరమైనచోట ధిక్కారాన్ని సగర్వంగా ప్రదర్శిస్తుంది. గొంతులోనే కాకుండా భావోద్వేగాలను తనదైన శైలిలో అణువణువూ ప్రదర్శిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో వరంగల్లులో ‘తెలంగాణ ఐక్యవేదిక’ మూడవ మహాసభ సందర్భంగా 8 సెప్టెంబర్ 2011న విమల తన బృందంతో ‘ఆడుదాం.. డప్పుల్ల దరువెయిరా’ పాటపాడుతూ ఆడిన తీరు మా హృదయాల్లో నిలిచిపోయింది. ఇదే పాట ఉద్యమ కాలంలో జనం పాట అయింది.
సమాజ మార్పుకై…
‘మన కొంపలార్చిన, మన స్త్రీలను చెరచిన…. కాలంబు రాగానే కాటేసి తీరాలి’ అనే కాళోజిపాట విమల పాడుతుంటే అప్పటికప్పుడే ఆ కామాంధులపై, ఆ దుర్మార్గులపై మూకుమ్మడిగా తిరుగబడాలనిపిస్తుంది. ఇంకా ‘చినుకూ చినుకూ కురిసిన నేలన’ అనే పాట వింటుంటే మన కిష్టమైన పల్లెటూరు పొలాల్లోనే వున్నట్లనిపిస్తది. ‘ఎవరో ఒకరు.. అపుడో, ఎపుడో’ అంటూ విమల పాడే ఈ పాటలో ఎంతమంది విప్లవకారులు మరణించినా సమాజాన్ని మార్చడానికి ఎవరో ఒకరు పుడతారులే మళ్లీ మళ్లీ అనడంలో ఒకవైపు విషాదం, మరోవైపు గంభీరత మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. మనం కళ్లుమూసుకొని ఈ పాట వింటుంటే మరో లోకంలో ఉన్నట్లనిపిస్తది.
పీడిత ప్రజల పట్ల తీరని ఆర్తి
ఈ సందర్భంగా మరో మరిచిపోలేని ఓ విషయం. నిజామాబాదు శంకర్భవన్ స్కూలు ఆవరణలో వేలాదిమంది బీడీ కార్మికుల మధ్యలో విమల దాదాపు ఇరవై మంది బృందంతో ‘అసైదులా ఆరతి – కాళ్ల గజ్జెల సమ్మతి’ అంటూ గజ్జెలు, డబ్బులతో చేసిన ప్రదర్శన అద్వితీయమైనది. రాను రాను వేగం అందుకున్న పద విన్యాసాలు, భావ ప్రకటనలు చూసినవాళ్లెవ్వరూ ఈనాటికీ మరిచిపోలేదేమో! ఆ ప్రదర్శన చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మాలి. ఆమె పాడే ప్రతి పాటలో అంతర్గతంగా ఒక భావజాలముంటుంది. ఒక నిర్మాణం వుంటది. ఒక అలజడి ఆందోళన వుంటది. అన్నిటికంటే ముఖ్యంగా పీడిత ప్రజల పట్ల తీరని ఆర్తి కన్పిస్తది. అడవులు, ప్రకృతి, జలవనరులు, రైతుల కష్టాలు, వ్యవసాయ సంక్షోభం, కూలీలు, వలస కూలీలు, మహిళల బాధలు, ఆత్మహత్యలు… ఇలా అనేక అంశాల పట్ల లోతైన అవగాహన, పరిజ్ఞానం వున్నాయి.
ఇద్దరిదీ విప్లవ ప్రస్థానం
‘అమర్పాట.. విమల నోట’ రెండూ కలిసి జుగల్బందీ అయింది. ఒకరు చిత్తయితే ఇంకొకరు బొత్తవుతరు. ఒకరు బొత్తవుతే ఇంకొకరు చిత్తవుతరు. వెరసి ఇద్దరూ రూపాయి బిళ్లవుతరు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. అది విమల జీవన సహచరుడు. విప్లవగడ్డ వేములవాడలో పుట్టి అనేక విప్లవ ఆటుపోట్లను చూసి పెరిగి పెద్దవాడైనవాడు అమర్. ఇతని రచనలు అనేకుల జీవన విధానాలు, ప్రజల ఉత్పత్తి సంబంధాలు, కార్మిక కర్షకబడుగు జీవుల వెతలను దగ్గరితనంతో, వాళ్లలో ఒకడుగా రచిస్తే ఆ పాటలు విమల గళంలో పరుగులెత్తుతాయి. అమర్ రచన తాత్వికమైనది, సమకాలీనమైనది కూడా. విమలది పాటల ప్రస్థానం, అమర్ది రచనల ప్రస్థానం.. వెరసి ఇద్దరిదీ విప్లవ ప్రస్థానం.
చిరునవ్వు ఆమె సొంతం
విమల 50 ఏండ్ల పాటల ప్రస్థానం గూర్చి రాయాలంటే ఆమె జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, సమకాలీన సామాజిక స్థితిగతుల గూర్చి, అరుణోదయ గూర్చీ వల బోసినట్లే. విమల పాట ఎంత ప్రాచుర్యం పొందిందో ఆమె వ్యక్తిత్వం కూడా అంతే ప్రాచుర్యం పొందింది. చిరునవ్వు ఆమె సొంతం. ప్రతి ఒక్కరినీ.. చిన్నా, పెద్దా, ముసలీ పడుచూ అనే తారతమ్యం లేకుండా తన పలకరింపుతో మన దగ్గరి మనిషిగా, మన కుటుంబ సభ్యురాలిగా, మన ఆత్మీయురాలుగా అన్పిస్తుంది. మీటింగులు, సభలూ సమావేశాలకు హాజరయ్యాక ప్రతి కార్యకర్త క్షేమంగా ఇంటికి చేరుకున్న సంగతి అడిగి మరీ తెలుసుకుంటుంది విమల.
అరుదైన వ్యక్తిత్వం
జీవితం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఏటికెదురీదుతూ ముందుకు సాగడం ఆమె కమిట్మెంట్, దృఢదీక్ష, పట్టుదలకు తార్కాణంగా చెప్పవచ్చు. ఓర్పు సహనంతో అసంఖ్యాకులకు ఆప్తురాలవడమేగా 50 ఏండ్లుగా ఒక సంస్థకు నాయకత్వం వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలవడమన్నది మామూలు విషయం కాదు. ఆమె ఒక అరుదైన వ్యక్తి. జైలు జీవితం, ఉపా చట్టం, ప్రభుత్వ నిర్బంధాలు, ఎన్నో సంకెళ్లు ఆమెను బంధించినా దేనికీ భయపడలేదు. మడమ తిప్పలేదు. వెనుకడుగు వేయలేదు. అరుణోదయ సాహితీ సాంస్కృతికోద్యమంలో యాభై ఏండ్లుగా సాగుతున్న విమల ప్రస్థానానికి మనమంతా జేజేలు పలుకుదాం. కానూరి తర్వాత రెండవ తరం నాయకురాలుగా, పాటకు ప్రతినిధిగా సాగిపోతున్న విమలక్క వారసత్వంగా రాకేశ్, అనిత, సౌమ్య, నిర్మలతోబాటు మరెందరో విమలలు తయారై ఈ ఉద్యమ బావుటా చేబూనాలని ఆశిద్దాం! ఆకాంక్షిద్దాం!!
లక్ష్మి శంకర్



