Homeప్రధాన వార్తలు22ఏ సమస్యలకు ఫాస్ట్‌‌ట్రాక్‌ పరిష్కారం

22ఏ సమస్యలకు ఫాస్ట్‌‌ట్రాక్‌ పరిష్కారం

- Advertisement -

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాల్టీల్లోని ప్రజలకు ఉపశమనం
ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం
ఉత్తర్వులు జారీ చేశాం : 
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు సహచర మంత్రులతో చర్చించి 22ఏ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 22ఏలో ఉన్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాల్టీలు, డీటీసీపీ లేదా ఇతర పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవన నిర్మాణం లేదా అపార్ట్‌మెంట్ అనుమతులు పొందిన ఆస్తులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపారు. అనుమతి పొందిన అనంతరం జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ తప్పనిసరిగా దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి కమిటీ
ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, హెచ్‌ఎండీఏ/పురపాలక సంస్థ/గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉంటారని తెలిపారు.22ఏ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే అమల్లోకి వచ్చిన నిర్ణయాలే నిదర్శనమని పేర్కొన్నారు.రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లోని దాదాపు 64 కాలనీల ఇండ్ల క్రమబద్ధీకరణ సమస్యకు జీవో 118కు అనుగుణంగా మెమో జారీ చేశామని తెలిపారు, దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల ఇండ్ల క్రమబద్ధీకరణ సమస్యను కూడా ప్రభుత్వం జీవో 76 ద్వారా పరిష్కరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. భూమి, ఇల్లు వంటి అంశాల్లో ప్రజలు ఏండ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి ముగింపు పలకడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను కేవలం ఫైళ్లకే పరిమితం చేయకుండా, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపశమనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.22ఏలోని అన్ని భూములనూ ఒకే గాటన కట్టకుండా, భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హమైన సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -