Homeజాతీయంసీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన!

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన!

- Advertisement -

రెండు సభల్లో నోటీసులకు ఇతర పార్టీలతో సంప్రదింపులు
సర్‌‌పై ఈసీలో విభేదాల నివేదికల నేపథ్యంలో నిర్ణయం

​సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌తిపక్షాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞా‌నేశ్‌‌కుమార్‌‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్ర‌తిపక్షాలు మరోసారి పార్లమెంట్‌లో అభిశంస‌న‌ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతు న్నాయి. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్‌ ఇతర ప్ర‌తిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో జ్ఞానేష్‌ కుమార్‌ తొలగింపునకు ప్ర‌తిపక్షాలు ప్రయత్నించడం ఇది మూడోసారి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)కు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వచ్చిన తాజా నివేదికలు ఈ తాజా ప్రయత్నానికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో నోటీసులు సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
ఎన్నికల జాబితాల్లో పేర్ల నమోదు, తొలగింపు, పునరుద్ధరణ, ఫారం-6లో మార్పులు, ఓటర్ల జాబితా డేటాబేస్‌ నియంత్రణ తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన‌ట్టు జాతీయ మీడియా పరిశోధనాత్మక కథనం పేర్కొంది. మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం కమిషన్‌లో నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నట్లు భావించడాన్ని ఖండించింది. భిన్నాభిప్రాయాలు, సూచనలు సంస్థాగత చర్చల్లో సహజమేనని పేర్కొంది.

గతేడాది కాలంలో సర్‌‌తో సహా తీసుకున్న నిర్ణయాలన్నీ పూర్తి కమిషన్‌ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని స్పష్టం చేసింది. అధికారిక ఉత్తర్వులు, పరిపాలనా ఆదేశాలు చట్టబద్ధ విధానాలకు అనుగుణం గానే ఉన్నాయని తెలిపింది. జ్ఞానేశ్‌కుమార్‌ తొలగింపునకు ప్ర‌తి పక్షాలు ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నిం చాయి. మార్చి 12న లోక్‌సభలో 130 మంది ఎం‌పీలు, రాజ్యసభలో 63 మంది ఎంపీలు సంతకాలతో తొలగింపు నోటీసులు ఇచ్చారు. అయితే ఏప్రిల్‌ 6న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, అప్పటి రాజ్యసభ చైర్మెన్‌ ‌సీ పీ రాధాకృష్ణన్‌ ఆ నోటీసులను స్వీకరిం చేందుకు నిరాకరించారు. ఆరోపణలు రాజ్యాంగపరంగా నిర్దేశించిన ప్రాథమిక ప్రమాణాలను అందుకోలేదని వారు పేర్కొన్నారు. ఆ తరువాత ఏప్రిల్‌ 24న 73 మంది ప్ర‌తిపక్ష రాజ్యసభ సభ్యుల సంతకాలతో మరో నోటీసు సమర్పించారు. ఇందులో తొమ్మిది ఆరోపణలను ప్రస్తావించినట్టు నివేదికలు తెలిపాయి. ఈ నోటీసు రాజ్యసభ చైర్మెన్‌ వద్ద ఇంకా పెండింగ్‌లో ఉంది.

‘ఓట్ల చోరీ’పై సమగ్ర దర్యాప్తు జరపాలి : రాహుల్‌గాంధీ
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల కమిషన్‌లోనే విభేదాలు తలెత్తినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఆయన గురువారం నాడిక్క‌డ‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో ‘ఓట్ల చోరీ’ జరిగిందని ఆరోపించారు. ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపు, చేర్పులు, ఇతర మార్పుల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతపై ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.​ ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని, ఓటు హక్కు విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేకుండా వ్యవహరించాలని ‌రాహుల్‌‌గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపైనా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు కేంద్రంలోని పెద్దల మద్దతు ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న తీరు, సాధారణంగా కనిపించే ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ ఇన్‌కంబెన్సీ) కొన్ని ఎన్నికల్లో కనిపించక పోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఓట్లే చోరీకి గురైతే, ఆ ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేసే చట్టబద్ధతపైనా ప్రశ్నలు తలెత్తుతాయి’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు.

రాజ్యాంగంలో ప్రత్యేక విధానం
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తొలగింపు నకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(5) ప్రత్యేక విధానాన్ని నిర్దేశిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే ‌సీఈసీని కూడా తొలగించాల్సి ఉంటుంది. తొలగింపు తీర్మానానికి లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. నోటీసును సభాధ్యక్షుడు లేదా చైర్మెన్‌ స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. విచారణ దశకు చేరితే రెండు సభలు అదే సమావేశంలో మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ‘నిరూపిత దుష్ప్రవర్తన లేదా అసమర్థత’ ఆధారంగానే తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -