పెరుగుతున్న వరద ప్రవాహం
దిగువ ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరిక
ఉప్పొంగిన గుండ్ల సింగారం ప్రాజెక్టు
నవతెలంగాణ- నకిరేకల్ /నూతనకల్
ఎగువ పరివాహక ప్రాంతాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ నిండుకుండలా మారుతోంది. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో ఎప్పుడైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మూసీ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 640.58 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల్లో రిజర్వాయర్‌లోకి 1,150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గేట్లు ఎత్తితే దిగువ ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నల్లగొండ జిల్లాలోని కేతెపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మండలాలు, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, పెన్‌పహాడ్, పాలకీడు మండలాల పరిధిలోని మూసీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూసీ పరివాహక, దిగువ ప్రాంతాల ప్రజలు, జాలర్లు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. గేట్లు ఎత్తే సమయంలో అధికారులు చేసే భద్రతా సూచనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఉప్పొంగిన గుండ్ల సింగారం ప్రాజెక్టు
నూతనకల్ మండలంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గుండ్ల సింగారం బ్రిడ్జి పరవళ్ళు తొక్కుతోంది. సందర్శకులు ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో చెరువులు, కుంటలు సగం వరకు నిండాయి . ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పొలాలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో భారీ వర్షం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



