పేటియం తలుపు తట్టిన ఈడీ.!

– మనీలాండరింగ్‌పై విచారణ
– ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి
న్యూఢిల్లీ : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌పై నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలతో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న పేటియం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తాజాగా ఈడీ విచారణ రిపోర్టులతో బెంబేలెత్తుతోంది. మరోవైపు పేటియం షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైతున్నాయి. ఆర్‌బీఐ సమాచారం మేరకు ఈడీ రంగంలోకి దిగిందని తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు తోడు విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. నిధుల దారి మళ్లింపు జరిగినట్టు ఆరోపణలు వస్తే ఈడీ దర్యాప్తు చేస్తుందని ఇటీవల కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజరు మల్హోత్రా పేర్కొన్న విషయం తెలిసిందే.
బుధవారం సెషన్‌లోనూ బీఎస్‌ఈలో వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్‌ 10 శాతం పతనమై రూ.342.15 వద్ద ముగిసింది. ఇది జీవిత కాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2023 అక్టోబర్‌లో ఆల్‌ టైం గరిష్ట స్థాయి రూ.998 వద్ద నమోదయిన విలువతో పోల్చితే బుధవారం నాటికి 65 శాతం పతనమైంది. జనవరి 31 నుంచి ఇప్పటి వరకు 53 శాతం క్షీణించింది. గత నెల 31 నుంచి ఇప్పటి వరకు పది సెషన్లలో పేటియం మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.26 వేల కోట్లు ఆవిరయ్యింది. అంటే ఆ మొత్తం మదుపర్లు నష్టపోయారు. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్న పేటియం షేర్‌ రూ.275కి పడిపోయే అవకాశాలు ఉన్నాయని గ్లోబల్‌ బ్రోకింగ్‌ ఏజెన్సీ మాక్వైర్‌ అంచనా వేయడంతో ఆ సూచీపై మరింత ఒత్తిడి చోటు చేసుకుంది. పేటియం పేమెంట్‌ బ్యాంక్‌పై చర్యలు కొనసాగుతాయని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవల స్పష్టం చేశారు. పేటియంపై ఆర్‌బిఐ నియంత్రణ చర్యల్ని సమీక్షించేది లేదని శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 నుంచి పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పిపిబిఎల్‌) డిపాజిట్లు సేకరించకూడదని, రుణాలు జారీ చేయరాదని ఆర్‌బిఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్టాట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సిఎంసి) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయకూడాదని స్పష్టం చేసింది. ఈ దెబ్బతో పేటియం షేర్లు పాతాలానికి పడిపోతున్నాయి. మరోవైపు పేటియం ఖాతాదారులు సగానికి పైగా జారి పోయారు. ఇతర చెల్లింపు వేదికలను ఆశ్రయిస్తున్నారు.

Spread the love