పాఠశాలలో విద్యార్థిని జన్మదినోత్సవం

– పాఠశాల అవసరాలకు విద్యార్థిని రూ.2 వేలు నగదు అందజేత
– ప్రభుత్వ పాఠశాలకు సహకరించాలని ప్రధానోపాధ్యాయుడు విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని బెజ్జంకి శ్రీవర్షిణీ తన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయులు,సహచర విద్యార్థుల సమక్షంలో శనివారం ఘనంగా జరుపుకుంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శానగొండ శంకరా చారి విద్యార్థిని శ్రీవర్షిణీతో కేక్ కట్ చేయించి స్వీట్స్ పంపిణీ చేయించారు. పాఠశాల అవసరాలకు తన జన్మదినం సందర్భంగా విద్యార్థిని రూ.2 వేల నగదును ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. పాఠశాల అవసరాలకు నగదు అందజేసిన విద్యార్థిని తండ్రి బెజ్జంకి చందుకు బోధన సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యల వలయంలో పాఠశాల: సకల హంగులతో నిర్మించిన మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.గత కొద్దెండ్లుగా పాఠశాలలో బోధన సిబ్బంది,స్కావెంజర్ కొరత సమస్య తీరడం లేదు. విద్యావాలంటరీలను నియమించిన వారికి సరైన సమయంలో వేతనాలందక మానేశారు.ప్రభుత్వం వేతనాలందించడం లేదనే సాకుతో మధ్యాహ్న భోజన కార్మికులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్థానికులు తమవంతుగా దోహదపడాల్సిన అవశ్యకత ఉందని బోధన సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు స్పందించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Spread the love