– ఏఐఆర్ సీనియన్ అనౌన్సర్ ఐనంపూడి శ్రీలక్ష్మి
– ‘సురభి’ వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్ ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రతి గొంతులోని స్వరం ఒక వరంలాంటిదేననీ, దాన్ని సమయానుకూలంగా, స్థాయిని బట్టి ప్రయోగిస్తే అద్భుతమైన మాటల ఆవిష్కరణ జరుగుతుందని ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ఆలిండియా రేడియో సీనియర్ అనౌన్సర్ ఐనంపూడి శ్రీలక్ష్మి అన్నారు. సురభి కళాక్షేత్రం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో సోమవారంనాడిక్కడి సోమాజీగూడ దుర్గా అపార్ట్‌మెంట్స్‌లో ‘వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్’ను ఆమె ప్రారంభించారు. స్వర స్థాయిల్ని సందర్భా నుసారంగా ఉపయోగిస్తే, ఎవరిరగంలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వ్యక్తిత్వానికి అస్థిత్వానికి మధ్య మాటే వారధిగా ఉంటుందనీ, అలాంటి మాటల్ని వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో మదించి, కుదించి, భావవ్యక్తీకరణ చేస్తే విజయాలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. మాటల్లో నటనా వైదుష్యాన్ని చూపించడం గొప్ప విషయమని అన్నారు. వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్ డైరెక్టర్ డాక్టర్ సురభి రమేష్ మాట్లాడుతూ వాయిస్ ఇండిస్టీలో అనేక అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఔత్సాహికులను గుర్తించి, ప్రోత్సహించి, ప్రతిభకు మెరుగులు దిద్ది ధీటైన స్వర కళాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని తాము చేస్తున్నామని చెప్పారు.లైఫ్ మేనేజ్‌మెంట్ కోచ్ డాక్టరÊ సాయి ఆచార్య మాట్లాడుతూ మాటే మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దు తుందని తెలిపారు. కార్యక్రమంలో రేడియో జాకీ (ఆర్‌జే) స్వాతి బొలిశెట్టి, జర్నలిస్ట్ శాంతి ఇషాన్ తదితరులు పాల్గొన్నారు.