– బీజేపీకి క్రిశాంక్ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విభజన చట్టం హామీలను ఎందుకు అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ బీజేపీని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణ అంటే చిన్నచూపు అని, అందుకే హామీలు అమలు చేయలేదని విమర్శించారు. బీజేపీని కాంగ్రెస్ ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీయడం లేదని తెలిపారు. తెలంగాణ కోసం ప్రశ్నించేది బీఆర్‌ఎస్ మాత్రమేనని చెప్పారు. ఎన్నికల కోడ్ ముందు మోడీ రాష్ట్రంలో పర్యటనలు చేసి హడావుడీ చేయడమే తప్ప ప్రజలకు చేసేది ఏమి ఉండదని విమర్శించారు. దేశంలో ఉన్న అన్ని రామాలయాలు తిరిగిన మోడీ భద్రాచలం రాముడి గుడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ మోసాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.