రోడ్డున పడిన నేతన్న

A leader who fell on the road– ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వస్త్ర పరిశ్రమ సంక్షోభం
– 70శాతానికి పైగా మరమగ్గాలు ఆగిపోయాయి
– సీఎంను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరతాం : నేతన్నల మహాధర్నాలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – సిరిసిల్ల
గత ప్రభుత్వ నిర్వాకం.. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యను పరిష్కరించాలని కోరతామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన నేతన్నల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంపీగా పనిచేస్తున్న బండి సంజరు దేవుడి పేరిట రాజకీయాలు తప్ప.. ఏ ఒక్కరోజు నేత కార్మికుల సమస్యలపై మాట్లాడలేదని విమర్శించారు. నేత కార్మికులు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బండికి తగిన బుద్ధి చెబుతారన్నారు. మత రాజకీయాలు చేస్తూ దేవుడి పేరిట మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఈసారి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. గత రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు ప్రచారం చేసుకుందే తప్ప కనీసం బతుకమ్మ చీరల బకాయిలు కూడా చెల్లించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను గెలిపిప్తే.. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో నేత కార్మికుల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నేతన్నల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు ఇవ్వకపోవడమే కాకుండా కార్మికులకు వచ్చే నూలు రాయితీ రూ.18కోట్లు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. 70శాతానికి పైగా మరమగ్గాలు ఆగిపోయాయని, నేత కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు, తెలంగాణ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, నేత కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Spread the love