పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు

– పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం
– రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ఉంది :సింగపూర్‌ కౌన్సిల్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్‌ బృందంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలనీ, రాష్ట్రంలో సింగపూర్‌ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ సింగపూర్‌ ఎడ్గర్‌ పాంగ్‌ బృందంతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఆస్వాదించే భౌగోళిక, స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని చెప్పారు. మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ఆ బృందానికి వివరించారు. పెట్టుబడులకు సలహాలు సూచనలు ఇవ్వండి… ఆహ్వానించే విషయం లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు న్నాయన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) నిర్మాణంతో హైదరాబాద్‌లో పెట్టుబడుల భూమ్‌ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలని కలిపేలా తాజాగా రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్‌ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఫార్మా, టెక్స్‌టైల్‌, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ పట్టణంలోని పురాతన మూసీ నదిని పునర్‌-జీవింప చేసే చర్యలు ప్రారంభించామని చెప్పారు. మూసీ రివర్‌ ఫ్రెంట్‌ బోర్డు ద్వారా మంచినీటితో మూసీిని నింపి.. థేమ్స్‌ నదిలా మారుస్తామన్నారు. ఆ నది పరివాహక ప్రాంతం అంతటిని కమర్షియల్‌, చిల్డ్రన్‌ పార్క్‌, మాళ్ల నిర్మాణం చేసి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఇటీవల జపాన్‌కు చెందిన జైకా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సింగపూర్‌ బృందానికి తెలియజేశారు. వ్యవసాయ ఆధారిత రంగంలో తెలంగాణ బలోపేతంగా ఉందన్న విషయాన్ని వారికి తెలిపారు. మీరు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ బాగా పెరిగిందనే విషయాన్ని వారికి వివరించారు. ఐటి, ఫార్మా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో ఉందన్నారు. సింగపూర్‌కు చెందిన కొన్ని కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఎడ్గర్‌ పాంగ్‌ భట్టి విక్రమార్కకు వివరించారు. అర్బన్‌ ప్లానింగ్‌ విషయంలో తమకు మంచి పట్టుందని తెలిపారు. సింగపూర్‌కు చెందిన అతిపెద్ద డీబీఎస్‌ బ్యాంక్‌ హైదరాబాదులో ఉన్నట్టు తెలిపారు. ఐటీ పార్కులో సింగపూర్‌ ఆఫీసులు ఉన్న విషయాన్ని వివరించారు. హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదనీ, రెండు రోజులకు ఒకసారి సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ ప్రయాణికులతో హైదరాబాద్‌ రాకపోకలు సాగిస్తోందన్నారు. ఎయిర్‌ ఇండియా సైతం పెద్ద సంఖ్యలో సింగపూర్‌కు ఎయిర్‌ లైన్‌ సేవలు అందిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌ బయోటెక్‌ హబ్‌గా స్థిరపడుతుందని పాంగ్‌ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రత్యేకంగా సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love