– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటివని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడాలో ఓ ప్రయివేలు హోటల్లో ‘అవుట్ లుక్ బిజినెస్ స్పాట్ లైట్’ సమర్పించిన ఇండో గ్లోబల్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు 2024 పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2030 నాటికి దేశంలో 600 మిలియన్ ఉద్యోగాలు అవసరమనే అంచనాలు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో ప్రతి ఉద్యోగాల్లో ఏడు ఉద్యోగాలు ఎంఎస్‌ఎంఈల నుంచే లభిస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాపారంలో ఆ పరిశ్రమలు 90శాతం వాటాను కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ పరిశ్రమలు ఉపాధి, జీడీపీ పెరుగుదలకు గణనీయంగా తోడ్పడుతున్నాయన్నారు.
శ్రామిక, పేద మహిళలు, యువత, బలహీన వర్గాలకు ఈ తరహా పరిశ్రమలు చేయూతనందిస్తున్నాయని కితాబునిచ్చారు. అవి రాష్ట్రంలో బయోసైన్స్, సోలార్ పవర్ వంటి వాటిని ఉపయోగించి వినూత్న ఉత్పత్తులు మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయని వివరించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్ నిర్మించడంలో ఆ పరిశ్రమలు ముందంజలో ఉన్నాయని చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 20 మందికి ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.