– 178 మంది వీఆర్వో కుటుంబాలకు కారుణ్య నియామకాలు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అవుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో, అనారోగ్య, ఇతరత్రా కారణాలతో మరణించిన 178 మంది వీఆర్వోలకు సంబంధించి వారి కుటుంబాలకు కారుణ్య నియమాకాలు వర్తింపజేస్తూ జీవో జారీ చేశామని ప్రకటించారు. మూడు నెలల్లోపే 23వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేశామని పేర్కొన్నారు. వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతోనే సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.