
– సాదాసీదగా సర్వసభ్య సమావేశం
– పలు సమస్యల పరిష్కారానికి సమావేశ తీర్మానం అమోదం
నవతెలంగాణ – బెజ్జంకి
వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీపీ నిర్మల సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ కార్యాలయంలో ఎంపీపీ నిర్మల అధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా అయా శాఖల అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ..అంగన్వాడీల కేంద్రాల సందర్శనలో ప్రజాప్రతినిధులకు కనీస సమాచారమివ్వకుండా వ్యవహరించడంపై సమావేశ సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో,విద్యుత్,ఉపాధిహామీ,రేషన్ కార్డుల లబ్ధిదారుల్లో తలెత్తున్న సమస్యలు అధికారుల దృష్టికి సభ్యులు తీసుకువెళ్లారు.గుగ్గీల్ల,పోతారం శివారుల్లో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని ఎంపీటీసీ కొమిరే మల్లేశం,రూ.5.32 కోట్ల అభివృద్ది పనులను ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రద్దు చేసిన అభివృద్ది పనులను యథావిథిగా కొనసాగించాలని ఎంపీటీసీ మహేందర్ తీర్మాణాలు ప్రవేశపెట్టగా సర్వసభ్య సమావేశం సభ్యులు తీర్మాణాలను అమోదిస్తున్నట్టు ఎంపీపీ ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా స్వీకరిస్తామని ఎంపీడీఓ లక్ష్మప్ప అన్నారు.జెడ్పీటీసీ కనగండ్ల కవిత,తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,అయా శాఖల అధికారులు, అయా గ్రామాల ఎంపీటీసీలు హజరయ్యారు.
ప్రజాస్వామ్య విలువలను బ్రష్టుపట్టిస్తున్నారు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలో స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వకుండా ఏకపక్షంగా అధికారులు వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ కడగండ్ల కవిత అసహనం వ్యక్తం చేశారు.నూతన ప్రభుత్వ పరిపాలనలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అగౌరవపరచడం ప్రజాస్వామ్య విలువలను అధికారులు బ్రష్టుపట్టించడమేనన్నారు.ఇప్పటికైనా మండల కాంగ్రెస్ నాయకత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడేల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఎమ్మెల్యే గైర్హాజర్ పై నిరాశ: సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హజరవుతున్న దృష్ట్యా మండలంలో నెలకొన్న సమస్యలను విన్నవించుకోవాలని సమావేశ సభ్యులు ఆశగా ఎదురుచూశారు.సమావేశం ముగిసే చివరి వరకు ఎదురుచూసిన ఎమ్మెల్యే గైర్హాజర్ అవ్వడంతో సర్వసభ్య సమావేశ సభ్యులు నిరాశ చెందారు.