– టీపీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీపై దాడి చేస్తున్నాయంటూ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అర్ధ రహితంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్ విమర్శించారు. కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం సృష్టించిందని విమర్శించారు. 100 రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. బీజేపీ గెలిపేస్తే… మనుధర్మం మళ్లీ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కవిత అరెస్టుకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు భవానిరెడ్డి, లింగం యాదవ్, రియాజ్, గజ్జిభాస్కర్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. భవాని రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల రాగానే రాష్ట్రాలకు మోడీలు, ఈడీలు వస్తాయన్న కేటీఆర్…మహిళా అధికారిపై దూరుసుగా ప్రవర్తించారని చెప్పారు. లిక్కర్ దందాలో కవిత అరెస్టు అవుతుందని కల్వకుంట్ల కుటుంబానికి ముందే తెలుసన్నారు. లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న వారందర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లింగం యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఆర్ధిక విధ్వంసం జరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే కవిత అరెస్టు అయ్యారని చెప్పారు.