గ్యారెంటీ..

‘అమ్మా! నాన్న ఏడుస్తున్నాడే!’ అంటూ వంట చేస్తున్న తల్లి! దగ్గరకు వచ్చి చెప్పాడు నానిగాడు.
లక్ష్మి కంగారు పడి హాల్లోకి వచ్చి చూసింది. భర్త టీ.వీ చూస్తూ నవ్వుతున్నాడు.
‘అబద్ధం ఎందుకు చెప్పావురా!’ అంటూ నానిగాడి పాంపాం ల (అదే పిర్రల) మీద ఒక్కటిచ్చింది తల్లి.
‘నేను చూసినపుడు ఏడ్చినాడమ్మా!’ అన్నాడు నానిగాడు రుద్దుకుంటూనే చెప్పాడు.
లక్ష్మి వంటింట్లోకి వెళ్లి తన పనిలో మునిగిపోయింది. కాసేపటికి నానిగాడు మళ్లీ వచ్చాడు. ఈసారి తల్లి చేయి పట్టుకుని హాల్లోకి లాక్కుని వచ్చాడు. తండ్రిని చూపించి, ఎందు కైనా మంచిదని తల్లి చేతికి అందకుండా దూరం జరిగాడు.
భర్త యాదగిరిని తేరిపార చూసింది. ఆయన కండ్లలో నీళ్లు. ఆ వెంటనే సంతోషంగా కండ్లు తుడుచుకున్నాడు. భార్యను, కొడుకునూ గమనించే పరిస్థితిలో లేడు. మధ్యమధ్యలో ఏదో గొణుగుతున్నాడు కూడా.
భర్త గొణుగుడును జాగ్రత్తగా విన్నది లక్ష్మి ‘ఆయన ఉన్నాడు.ఆయన గ్యారెంటీ ఉంది!’ అంటున్నాడు యాదగిరి.
భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడే లక్ష్మికి అర్థం కాలేదు. ఆటూ ఇటూ చూసింది. టీవీలో యాడ్స్‌కు భర్త అలా స్పందిస్తున్నాడు!
‘సీరియల్స్‌ చూసి ఆడవాళ్లు ఏడుస్తారు గాని, ఆడ్స్‌ చూసి మగవాళ్లు ఏడుస్తారని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది’ అన్నది లక్ష్మి.
దాంతో ఈ లోకంలోకి వచ్చాడు యాదగిరి.
‘చూడు లక్ష్మి! టీ.వీలో వచ్చే ఆ ప్రకటన నా మోడీ ఎంత గొప్పవాడో తెలుపుతుంది! ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం జరుగుతుంటే మన భారతీయులను ఇండియాకి రప్పించటానికి ఇక్కడి నుంచి విమానం పంపడటమే కాదు! అక్కడ యుద్ధాన్ని కాసేపు ఆపి మన దేశ పిల్లల్ని విమానం ఎక్కించి క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఇంత గొప్ప నాయకుడి చేతిలో నేను నువ్వూ, నానిగాడు ఇంకా మన దేశం ఎంత భద్రంగా ఉంది తలుచుకుంటేనే గర్వంగా ఉంది!’ అన్నాడు. కండ్లలోని ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ!!
‘తన ప్రజల ప్రాణాలకు గ్యారెంటీగా ఉన్నవాడు, పుల్వా మాలో మన సైనికులను తరలించటానికి హెలికాప్టర్లు కావాలని గవర్నర్‌ ఆడిగితే ఎందుకు సమకూర్చలేదు!’ అడిగింది లక్ష్మి.
”ఇంతకూ నీవు భారతీయురాలివేనా! లేక పాకిస్తాన్‌ నుండి వచ్చావా? నీకు పౌరసత్వం ఉందా?’ అంటూ అనుమానంగా చూశాడు యాదగిరి.
‘ఆు. మీ అమ్మా, నాన్న మా వైపు ఏడు తరాలు చూసి, కులం,మతం, గోత్రం అన్ని చెక్‌ చేసి మరీ నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నారు! వారికి లేని అనుమానం మీకెందుకు వచ్చింది?’ అడిగింది లక్ష్మి
‘అనుమానం రాదా మరి మా మోడీని విమర్శించేంత దానివా నీవు ! చూడు! ఆ ప్రకటన చూడు! రైతులు పండించిన పంటకు కనీసమద్దతు ధరలు ఏర్పాటు చేసి, రైతులకు గ్యారెంటీగా నిల్చాడు.గతంలో ఎవ్వరైనా ఇట్లా చేశారా!’ అన్నాడు యాదగిరి.
‘అబ్బే! రైతులను మోడీ చూసుకున్నట్లు ఎవ్వరూ చూసుకోలేదు. మాకు నష్టం తెచ్చే నూతన వ్యవసాయ చట్టాలు మాకొద్దు’ అని ఏడాది పాటు రైతులు అనేక రకాల పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు ఆణిచివేయటానికి, రైతులను దిగ్బంధనం చేసి, రోడ్లమీద మేకులు కొట్టి, బారికేడ్లు ఏర్పాటు చేసి శత్రు సైనికుల వలే చూశారు. ఇప్పుడు కనీస మద్దతు ఇవ్వమని రైతులు ఢిల్లీకి ప్రదర్శన చేస్తే, అదే సీన్‌ రిపీట్‌ చేశారు.రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర ఇప్పిస్తామని ఎన్నికల ముందు గ్యారెంటీ ఇచ్చారు. దాన్ని ఇంత గొప్పగా అమలు చేస్తున్నారు!’ అన్నది లక్ష్మి.
‘మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు ఇస్తున్న తెరవెనకి దేశద్రోహులల్ల్లా నీవు కూడా ఉన్నావన్న మాట!’అన్నాడు. యాదగిరి
‘అమ్మ తెరవెనక లేదు! నాన్నా. రైతులకు మద్దతుగా ఫేస్బుక్‌ పోస్టు పెట్టింది! రీల్స్‌ కూడా చేసింది! బోలెడన్ని లైకులు, కామెంట్లు కూడా వచ్చాయి. నీవు చూడలేదా నాన్నా!’ అన్నాడు నానిగాడు తల్లి పక్కన ఛాతీ విరుచుకుని నిలబడి.
‘ఎంతకు తెగించిచార్రా! మోడీ గొప్పతనం మీకు అర్థం కావటం లేదు! ఆయుష్మాన్‌ భారత్‌ అనే స్కీము పెట్టి, కోట్లాది నిరుపేదల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చాడు నా మోడీ. మీకు తెలియకపోతే టీ.వీలో వచ్చే ప్రకటన చూసైనా తెలుసుకోండి!’ అన్నాడు యాదగిరి.
చిన్నగా నవ్వింది లక్ష్మి.
‘మోడీ గ్యారెంటీ ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ ఎంత గొప్పగా అమలు జరిగిందీ, కాగ్‌ రిపోర్టు చూస్తే తెలుస్తుంది!’ అన్నది లక్ష్మి.
‘కాగ్‌ రిపోర్టు ఏ పత్రికలో రాలేదు కదా!’ అమాయకంగా అన్నాడు యాదగిరి. మీ గోడీ మీడియాలో రాదు లెండి! 8888888888 నంబరు నుండి లక్షా ముప్పై వేల మంది, 9000000000 నుండి ఇరవై వేల మంది ఆయుష్మాన్‌ భారత్‌ కింద రిజిస్టర్‌ చేయించుకున్నారు. అందులో కొన్ని వేల మందికి ఐదు లక్షల చొప్పున డబ్బులు కూడా వేశారు. ట్విస్ట్‌ ఏమిటంటే కొన్నివేల మంది ఎప్పుడో చనిపోయారు! ఇదంతా నేను చెబుతుంది కాదు! కాగ్‌ చెప్పిందే! ఒకే నంబరు నుండి అన్ని నంబర్లు ఎట్లా రిజిస్టర్‌ చేశారో! అసలా ఫోన్‌ నంబర్లు ఉన్నాయో, లేదో, ఉంటే ఆ ఫోను నంబర్లు ఎవరివో! ఇట్లా ఉంటాయన్న మాట గ్యారంటీలు!’ అన్నది లక్ష్మి.
‘నో డౌట్‌, ఆ కాగ్‌ మన భారతీయుడు కాదు! కచ్చితంగా మన పౌరసత్వం కూడా లేదు! అందుకే మోడీకి వ్యతిరేకంగా రిపోర్టు రాశాడు!’ అన్నాడు యాదగిరి.
నానిగాడు కిసుక్కున నవ్వాడు ‘మన పౌరుడు కాకపోతే అంత పెద్దజాబ్‌ ఎలా ఇస్తారు నాన్నా !’ అన్నాడు.
‘వేలెడంత కూడా లేవు! నీవు కూడా పౌరసత్వం గురించి మాట్లాడతావా? మోడీ గ్యారెంటీ ఇచ్చాడంటే చేసి తీరుతాడు. అయోధ్యలో రామ మందిరం కట్టిస్తానని గ్యారెంటీ ఇచ్చాడు. ప్రపంచమే అబ్బుర పడేలా రామమందిరం నిర్మించాడు! అదీ మోదీ అంటే!’ అని యాదగిరి, మాజీ మంత్రి మల్లారెడ్డిలా తొడగొట్టాడు.
‘మోడీ ఎవరండీ, భారతదేశ ప్రధానమంత్రి! అంతేకాని ఆలయ ధర్మకర్త కాదు! రాజ్యాంగం ప్రకారం ప్రధాని అయ్యాడు. కాని మంత్రాలు, వేదాలు చదువుకుని ప్రధాని కాలేదు. ప్రజలందరినీ సమానంగా చూస్తానని, దేవుడిపై ప్రమాణం చేసి ప్రధాన మంత్రి అయ్యారు! మణిపూర్‌ మహిళల మాన ప్రాణాలకు దిక్కు లేకుండా పోయింది. ప్రమాణం చేయటమంటే గ్యారెంటీ ఇవ్వటమే కదా! మరి మణిపూర్‌ ప్రజలను రక్షించ టానికీ ఏ ప్రయత్నం చేయలేదు! కనీసం అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించలేదు. మరి తను ఇచ్చిన గ్యారెంటీ అమలు చేసి నట్లా? చేయనట్లా? దేవుడికి గుడి కట్టించిన వాడు, దేవుడి పేరు మీద ఇచ్చిన గ్యారెంటీని ఉల్లంఘించవచ్చునా?’ అడిగింది లక్ష్మి.
‘మన దేవుడైన రాముడికి అయోధ్యలో గుడి కట్టించొద్దా!’ కోపంగా అడిగాడు యాదగిరి.
‘రాముడికి గుడి కట్టించొద్దని అనటం లేదు! గుడి కట్టుకోమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది! కాని అదొక్క గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారు! మిగిలినవి ఎందుకు అమలు చేయటం లేదని అడుగుతున్నాము!’అన్నది లక్ష్మి.
‘చాలా గ్యారెంటీలు అమలు చేశాడు మా మోడీ !’ అన్నాడు యాదగిరి బింకంగా.
”మీరు టీవిలో చూపించని గ్యారెంటీలు ఇంకా చాలా ఉన్నాయి. పెట్రోలు ధర రూ.35 కి తగ్గిస్తామని, నల్లధనం తీసుకొచ్చి మనందరి బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలు, డీజిల్‌ తీసుకొస్తామని, చైనా నుండి దిగుమతులు ఆపేస్తామని, రూపాయిని, డాలర్‌తో సమానంగా పెంచుతామని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని గ్యారెంటీ ఇచ్చారు. కదా! ఇందులో ఒక్క గ్యారెంటీయైనా అమలు చేశారా ధర్మప్రభువులైన మన మోదీ గారు.’ అడిగింది లక్ష్మి.
యదగిరి అటూ ఇటూ చూస్తున్నాడు.
‘ఏమిటీ అటూ ఇటూ చూస్తున్నారు! ధర్మ ప్రభువులు అమలు చేసిన గ్యారేంటీల ఆనవాళ్లు ఇక్కడేమీ లేవు!’ అన్నది లక్ష్మి.
‘ఫోన్‌ కోసం చూస్తున్నాను. నీ మీద ఈడీకి ఫోన్‌ చేయాలి!’ అన్నాడు.
‘చాల్లెండి సంబడం! నేను, మీరూ ఐదేండ్లు కష్టపడి సంపాదించిందాంతా కలిపినా ఈడీ ఆఫీసర్ల ఫ్లైటు ఛార్జీలకు కూడా సరిపోవు! పైగా వారంతా కల్వకుంట్లు కవిత గడబడ్‌లో ఉన్నారు! ఐనా మీకు కావల్సింది ఫోన్‌ కాదు! వెన్న! ఆవేశంలో మీరు గట్టిగా తొడకొట్టుకున్నారు. పాపం తొడ బాగా వాచిపో యింది!’ అంటూండగానే నానిగాడు చిన్నగిన్నెలో వెన్న తెచ్చిచ్చాడు.
– ఉషా కిరణ్‌

Spread the love