జైలులో స్వతంత్ర మీడియా బందీ

జైలులో స్వతంత్ర మీడియా బందీ– దేశంలో ఎండమావిగా మారిన న్యాయం
ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌
దేశంలో న్యాయం ఎండమావిగా మారింది. స్వతంత్ర మీడియా తీవ్రమైన ఒత్తిళ్లను, వేధింపులను ఎదుర్కొంటోంది. ఆర్థిక బంధనాలు, దొడ్డిదారిలో కొనుగోళ్లు వీటికి తోడు ఏకంగా పత్రికాధిపతులను జైళ్లలో బంధీస్తున్నారు. స్వతంత్ర మీడియా గొంతు నొక్కుతున్నారు. ప్రఖ్యాత స్వతంత్ర న్యూస్‌ పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌’ సంపాదకులు ప్రబీర్‌ పుర్కాయస్థను జైలుకు పంపారంటేనే భారతదేశంలో న్యాయానికి స్థానం లేదని స్పష్టమవుతోంది. గతేడాది అక్టోబరు నుండి తీవ్రవాద అభియోగాలపై ఆయన జైల్లో వున్నారంటే పెరుగుతున్న న్యాయ వ్యవస్థ క్రూరత్వం ప్రతిఫలిస్తోంది. న్యాయ వ్యవస్థ సమగ్రత దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ దాదాపు 600 మంది సీనియర్‌ న్యాయవాదులు మార్చి 26న భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగంగా లేఖ రాశారు. ఫిబ్రవరిలో కేంపైన్‌ ఫర్‌ జ్యుడీషియల్‌ అకౌంటబిలిటీ అండ్‌ రిఫార్మ్స్‌ సంస్థ నిర్వహించిన మూడు రోజుల సెమినార్‌కు స్పందనగానే ఈ లేఖ రాసినట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయపాలన, నిర్వహణ, పౌర స్వేచ్ఛ, రాజకీయ హక్కులతో కూడిన కేసుల్లో సుప్రీం ధోరణి’ అనే అంశంపై ఈ సెమినార్‌ జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల నుండి సీనియర్‌, యువ న్యాయవాదులు పలువురు ఈ సెమినార్‌లో ప్రసంగించారు. ఇటీవల కాలంలో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడం, నిర్బంధించడం దేశవ్యాప్తంగా ఎక్కువైందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పైగా బెయిల్‌ ఇచ్చేందుకు దీర్ఘకాలంగా అమల్లో వున్న నియమ, నిబంధనలన కూడా ఉల్లంఘిస్తున్నారన్నారు. దానికి ఉదాహరణగా న్యూస్‌క్లిక్‌పై దాఖలైన కేసును ఉదహరించారు.
పేదలకు, అణచివేతకు గురైన లేదా దోపిడీకి గురయ్యే వర్గాలకు న్యాయానికి స్వర్ణ యుగం అనదగ్గ పరిస్థితులు లేవు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను న్యాయమూర్తులు ప్రోత్సహించిన రోజుల్లో వారి గొంతులు వినిపించినప్పటికీ ఒక కట్టుబానిసకు గరిష్టంగా లభించేది స్వేచ్ఛ మాత్రమే, అంతేకానీ ప్రత్యామ్నాయ ఉపాధి కాదు, వేతనాలు కాదు, అటువంటప్పుడు అది కచ్ఛితంగా న్యాయం జరిగినట్లు కాదు. మహిళా పోలీసులు నిర్వహించే పోలీసు స్టేషన్లు కూడా వున్నాయి. కానీ అక్కడా న్యాయం దొరకదు. మతపరమైన, భాషాపరమైన లేదా జాతి పరమైన మైనారిటీలు భారతదేశంలో రాన్రానూ ఏకాకులుగా మిగిలిపోతున్నారు.
ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థ తీరుతెన్నులు ఇలా వున్నాయి. న్యాయవాదులు దీన్ని అంగీకరించకపోయినప్పటికీ రచయితలు మాత్రం న్యాయ వ్యవస్థలో గల అసంబద్ధాలను ఎప్పటినుండో ఎండగడుతున్నారు. న్యూస్‌క్లిక్‌, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ ఎదుర్కొన్న పరిస్థితులు ఇవే. ఎవరో వేసిన నిందలకు ఒకరోజు ఉదయమే ఆయన్ను అరెస్టు చేశారు. 2021 ఫిబ్రవరిలో ఒకరోజు 8 మంది వ్యక్తులు పుర్కాయస్థ ఇంటికి వచ్చి 113 గంటలపాటు ఇంట్లోనే వుండి ప్రతి మూలా వెతికారు, వారేమనుకున్నారో అవైతే కనబడలేదు. కానీ చిట్టచివరకు ల్యాప్‌టాప్‌, ఏవో కొన్ని ఫైల్స్‌ తీసుకెళ్లారు. వారికేమీ దొరక్కపోయేసరికి ఆ ఫ్లాట్‌ను జప్తు చేశారు. అయితే పుర్కాయస్థను ఆ ఇంట్లో వుండేందుకు అనుమతించారు. న్యూస్‌క్లిక్‌పై దర్యాప్తులో ఐదు సంస్థలు పాల్గొంటున్నాయి. 2020 ఆగస్టులో న్యూస్‌ పోర్టల్‌పై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆర్‌బిఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవహారంలో న్యూస్‌క్లిక్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అయినా ఇడి మళ్ళీ న్యూస్‌క్లిక్‌పై దాడి జరిపింది. మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 2021 సెప్టెంబరులో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. తిరిగి 2023 అక్టోబరు 3న స్పెషల్‌ సెల్‌కు చెందిన 500 మంది సిబ్బంది న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్న దాదాపు 90 మంది జర్నలిస్టులపై దాడి చేశారు. వారి నుండి 250కు పైగా ఎలక్ట్రానిక్‌ పరికరాలను, ఫోన్లను, హార్డ్‌ డిస్క్‌లను, ల్యాప్‌టాప్‌లను, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఆ నెల్లోనే చివరిలో సిబిఐ మరోసారి న్యూస్‌క్లిక్‌ కార్యాలయంపై మరోసారి దాడి జరిపింది.
తొలి రోజు నుండి న్యూస్‌క్లిక్‌ ఈ దాడులు, కేసులు వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూనే వుంది. న్యూస్‌క్లిక్‌ కార్యాలయాలు, అందులో పనిచేసే వారి నివాసాలు, ఆఫీసులపై దాడి చేసినా, అన్ని ఫైళ్ళు, ఖాతాలు అందుబాటులోకి తెచ్చుకున్నా గత రెండేళ్ల నుండి న్యూస్‌క్లిక్‌పై ఒక్క ఫిర్యాదును ఇడి ఇవ్వలేకపోవడాన్ని న్యూస్‌క్లిక్‌ ప్రశ్నిస్తోంది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం చార్జిషీట్‌ను దాఖలు చేయలేకపోయింది. ఆదాయపన్ను శాఖ తన చర్యలను కోర్టులో సమర్ధించుకోలేకపోయింది. నిజానికి ప్రభుత్వం వద్దనే ఎలాంటి స్పష్టమైన ఆరోపణలు, అభియోగాలు లేవు. అయినా సిబిఐ మరోసారి ఎఫ్‌ఆఐర్‌ నమోదు చేయడం చూస్తుంటే స్వతంత్ర మీడియా సంస్థగా న్యూస్‌క్లిక్‌ను పనిచేయనివ్వకుండా వేధించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.
ఏదేమైనా భారత ప్రజాస్వామ్యాన్ని, అందులో అంతర్భాగంగా వున్న క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థను కూడా పరిరక్షించాలనుకునే మనలాంటి వారందరికీ న్యూస్‌క్లిక్‌ కేసు చాలా ముఖ్యమైన కేసు. ఈ కేసులో ప్రబీర్‌ పుర్కాయస్థ, న్యూస్‌క్లిక్‌లు న్యాయం పొందగలవని ఆశిద్దాం.

Spread the love