ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో రూ.26కోట్లు స్వాహా

– దుబాయ్ లో క్రిప్టోకరెన్సీగా మార్పు
– ఇద్దరు నిందితుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, 15 చెక్‌బుక్స్‌, నకిలీ రబ్బర్‌ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సైబర్‌క్రైమ్‌ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన నౌషద్‌, హమీద్‌ కబీర్‌ సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని.. ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో దేశవ్యాప్తంగా కొంతమంది నుంచి దాదాపు రూ.26కోట్లకుపైగా కొల్లగొట్టారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని టార్గెట్‌ చేసుకుని టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా పరిచయం చేసుకున్నారు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఇప్పిస్తామని నమ్మించారు. ఆ తర్వాత ఓ లింక్‌ను పంపించి దాన్ని క్లిక్‌ చేయమని చెప్పారు. వారు చెప్పిన విధంగా బాధితుడు లింక్‌ను క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేశాడు. అందులో ఇచ్చిన టాస్క్‌లను కంప్లీట్‌ చేశాడు. మీరు సక్సెస్‌గా టాస్క్‌ను కంప్లీట్‌ చేశారని, దానికి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ వచ్చిందని, బాధితున్ని నమ్మించేందుకు కొంత డబ్బులను అతని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే ఆ డబ్బులను తీసుకునేందుకు బాధితుడు ప్రయత్నించి విఫలమయ్యాడు. నగదు రిలీజ్‌ అవ్వాలంటే పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. వారిని పూర్తిగా నమ్మిన బాధితుడు దాదాపు రూ.9,44,492లను వారు చెప్పిన విధంగా వేర్వేరు బ్యాంక్‌ అకౌంట్స్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయితే అనుమానం వచ్చిన బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులు కేరళలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో 18 బ్యాంక్‌ ఖాతాలను పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా దాదాపు రూ.26కోట్లు స్వాహా చేసిన నిందితులు ఆ డబ్బులను వివిధ అకౌంట్స్‌కు మళ్లించారు. ఆ తర్వాత దుబారులో క్రిప్టోరెన్సీగా మార్చినట్టు డీసీపీ తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యే గుర్తు తెలియని వ్యక్తులను నమ్మొద్దని నగర వాసులకు డీసీపీ సూచించారు. ముఖ్యంగా టెలీగ్రామ్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో వచ్చే ప్రొఫైల్స్‌లకు స్పందించవద్దన్నారు. ముఖ్యంగా లింక్‌లను క్లిక్‌ చేయవద్దన్నారు.

Spread the love