– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక రిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీ ప్రభుత్వమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సామాజిక వివక్ష, అసమానతలను రూపుమాపటానికి భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తే, వాటిని బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఆర్థిక వెనుకబాటు ప్రతిపదికగా ఆ పార్టీ అగ్రకుల రిజర్వేషన్లు తీసుకొచ్చిందనీ, వాటి మూల సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఎక్కడా ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొనలేదని గుర్తు చేశారు. సాంఘిక అసమానతలను రూపుమాపి సామాజిక సమానత్వం సాధించడానికే రిజర్వేషన్లు కల్పించిందన్నారు. వాటిని నిర్వీర్యం చేసిన మోడీ సర్కార్.. బీసీ ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టి కొట్టిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గత పదేండ్లనుంచి మోడీకి విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని తెలిపారు. ఏ కమిషన్ సిఫార్సు, కులాల లెక్కలు లేకుండానే రాత్రికి రాత్రి 48 గంటల్లోగా ఆర్థిక వెనక బాటు అనే అసంబద్ధమైన కారణం చూపుతూ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లను ఎలా కల్పించారని ఆయన ప్రశ్నించారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పించాలనుకుంటే మొదట కులగనణ చేపట్టాని డిమాండ్ చేశారు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వ కుండా, మహిళా బిల్లు సబ్ కోట బీసీలకు పెట్టకుండా, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కల్పించకుండా అన్యాయం చేశారని విమర్శించారు.