– చిన్నారుల పౌష్టికాహారం ధ్వంసం
– చిరునోముల ఉన్నత పాఠశాలలో
– మందుబాబుల అసాంఘిక కార్యక్రమాలు
నవతెలంగాణ-బోనకల్
కొన్ని వేల మందిని విద్యావంతులను చేసిన పాఠశాల. ఒకప్పుడు జిల్లాకే ఆదర్శవంత పాఠశాలగా ప్రసిద్ధిగాంచింది. ఎంతోమంది విద్యావంతులను మేధావులను తయారుచేసిన పాఠశాల. అటువంటి పాఠశాలలో నేడు కొంతమంది మందుబాబులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పాఠశాలకు గేటు ఉన్న మందుబాబులు గోడదూకి తమ అసాంఘిక కార్యక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రం -3 లో మంగళవారం రాత్రి చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని దొంగలించే ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో పౌష్టికాహారాన్ని మొత్తాన్ని కిటికీల నుంచి పెద్దపెద్ద కర్రలతో ధ్వంసం చేశారు. పాఠశాలలోనే ఓ గదిలో అంగన్వాడీ -3 కేంద్రాన్ని అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రానికి గల కిటికీలకు గల జాలిని తొలగించారు. ఓ పెద్ద కర్ర సహాయంతో అంగన్వాడీ కేంద్రంలో గల చిన్నారులకు అందజేసే కోడిగుడ్లను కర్ర, రాళ్లు విసిరి పగలగొట్టారు. ఈ విధంగా మొత్తం 60 కోడిగుడ్లను పగలగొట్టారు. ఇంతటితో ఆగకుండా ఆ కర్రతోటే చెక్క బీరువా తలుపులు తీసి అందులో గల కందిపప్పు, చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులను బయటకు లాగారు. కిటికీ పక్కనే గల 8 పాల ప్యాకెట్లను దొంగలు అపహరించుకుపోయారని అంగన్వాడీ కేంద్రం కార్యకర్త నీరటి వరలక్ష్మి తెలిపింది. రాళ్లు, కర్రల సహాయంతో పోషకాహారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేశారు. తరగతి గదులు ముందు మద్యం తాగి ఆ మద్యం సీసాలను పగలగొట్టి చెల్లాచెదరుగా పడవేశారు. జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న చిరునోముల ఉన్నత పాఠశాలను కొంతమంది మద్యం బాబులు, ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడవ తరగతి గదికి వేసిన తాలాన్ని కూడా పగలగొట్టి తీసుకెళ్లారు. స్థానికులే ఈ ఘాతుకానికి పాల్పడిఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనంపై అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై కడగండ్ల మధుబాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.