జాతర ఘనం-సౌకర్యాలు శూన్యం

– తిరునాళ్‌లో నీటి ఎద్దడి
– మరుగు దొడ్లు లేక భక్తులు ఇక్కట్లు
– ముందు చూపు లేని ఈఓ
నవతెలంగాణ-అశ్వారావుపేట
నియోజక వర్గంలోనే ఎంతో ఘనంగా, ఐదు రోజులు పాటు నిర్వహించే జాతర. జిల్లాలోని అనేక మండలాలు నుండే కాక సరిహద్దు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌ మండలాల నుండీ అధిక సంఖ్యలో భక్తులు హాజరు అయ్యే తిరునాళ్ళు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని వినాయక పురంలోగల చిలుకలు గండి ముత్యాలమ్మ జాతర గానమే అయినా ఇక్కడకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఈ సారి దేవాలయం కార్యనిర్వాహణ సిబ్బంది వైఫల్యం చెందారు అనేది స్పష్టం అవుతుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో చిరు వ్యాపారులు మూడు వందలు పైగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. అంతేగాకుండా వినోద కార్యక్రమాలు నిర్వహణకు పలు రకాల ఈవెంట్‌లు నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు సైతం హాజరు అవుతారు. ఈ దేవాలయం ప్రాంగణంలోని బావి నుండి మోటార్‌లు ద్వారా తోచిన నీటిని ఇదే ప్రాంగణంలో చిన్నపాటి ట్యాంక్‌లో నీరు సరఫరా చేస్తారు. అయితే ఈ సారి మాత్రం ఏర్పాట్లు నిర్వహణలో ఈఓ వైఫల్యం చెందినట్లు వ్యాపారులు, భక్తులు ఆరోపిస్తున్నారు. వీటి కోసం ఈ ప్రాంగణంలో విద్యుత్‌ సౌకర్యం, నీటి సరఫరా, మరుగుదొడ్లు వసతి కల్పించాల్సి ఉంటుంది. మంగళవారం నీటి ఎద్దడి ఏర్పడి వ్యాపారులు, భక్తులు నానా ఇక్కట్లుకు గురయ్యారు. మరుగు దొడ్లు లేక మహిళా భక్తులు స్నానాలు అనంతరం దుస్తులు మార్చుకోవడానికి అగచాట్లుకు గురి అవుతున్నారు. సౌకర్యాలు కల్పించేందుకు పోగా అద్దెలు అధికమొత్తంలో వసూలు చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. రెండు రకాల ఆర్జిత సేవలు కోసం రూ.20లతో ఒకటి, రూ.30లతో మరొకటి టికెట్‌లతో భక్తులు దగ్గర వసూలు చేసినప్పటికీ దైవపూజలు సంతృప్తిగా లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై దేవాలయం ఈఓ సూర్యప్రకాశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు. నిర్వాహకులకు ఒకరికి ఫోన్‌ చేయగా విద్యుత్‌ సరఫరా అంతరాయంతో నీటి సరఫరా తాత్కాలిక ఇబ్బంది ఏర్పడిందని, ట్యాంకర్‌తో నీటి సరఫరా పునరుద్ధరించారని తెలిపారు.

Spread the love