– వెంచర్‌లకు చెరువు మట్టి…
– చోద్యం చూస్తున్నా సంబంథిత శాఖఅధికారులు..
నవతెలంగాణ-కొణిజర్ల
మట్టి మాఫియా రైతుల పేరుతో పర్మిషన్ తీసుకోని వేల ట్రక్కుల మట్టి అమ్ముకుంటున్నారు. వ్యాపారులు గోరంత అనుమతులు తీసుకొని కొండంత తొవ్వుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తోలుకుందాం.. అమ్ముకుందాం.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ మండలంలో మట్టి మాఫియా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములకు సారంపెంచేందుకు చెరువుల్లో ఉన్న మట్టిని తోలుకునేందుకు రైతులకు పర్మిషన్‌లు ఇవ్వాలని ఐబీ అధికారులను ఆదేశించడంతో అవకాశాన్ని మట్టి వ్యాపారులు ఆసరా చేసుకొని రహదారులకు, ఇండ్ల, వెంచర్‌లకు మట్టిమాఫియా వ్యాపారులు ఏమాత్రం భయంలేకుండా పట్టపగలు వేల ట్రక్కుల మట్టిని అమ్ముకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్ మట్టిని 800నుంచి 1300 వందలకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఒక చెరువుకి పర్మిషన్ తీసుకొని వేరే చెరువుల్లో ఉన్న మట్టిని తోడేస్తూ దర్జాగా దోచుకుంటున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకులతోపాటు సంబంథిత శాఖ అధికారులు కూడా ఈ మట్టి వ్యాపారంలో పాలుపంచుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకొని అధికారులు మట్టి తోలుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు సమాచారం. మట్టి తోలుకునేందుకు పర్మిషన్ లు ఇచ్చిన చెరువులను అధికారులు తిరిగి పరిశీలించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదాహరణకు ఇటీవలే గుబ్బగుర్తి గ్రామంలో ఉన్న చెరువులో మట్టి తోలకాలను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. కారణం ఇష్టం వచ్చినట్లు గుంతలు పెడుతూ మట్టిని రైతుల పొలాల్లో కాకుండా ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. చేపలు పట్టే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు పట్టించుకోవడం లేదని తెలిసింది. తనికెళ్ల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ పక్కన ఉన్న వెంచర్ లోకి తనికెళ్ళ చెరువు నుంచి ట్రాక్టర్‌ల ద్వారా గత నాలుగు రోజులుగా మట్టిని తోలుతున్న విషయంపై ఐబీ డీఈకి ఫోన్ చేసి వివరణ కోరగా ఫోన్ ఎత్తలేదు. అనంతరం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కి ఫోన్ చేయగా తమకు సంబంధం లేదని ఐబీ అధికారులను అడగాలని సూచించారు.