ఖమ్మంలో వాచ్‌ మెన్లుగా తల్లిదండ్రులు

– కుమారుడు కిర్గిస్తానులో ఎంబీబీఎస్‌ పట్టా
– పట్టుదల, లక్ష్యం ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే
నవతెలంగాణ – బోనకల్‌
తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదనేది ఆ తల్లిదండ్రుల లక్ష్యం. కానీ సెంటు భూమి లేదు. ప్రతిరోజు కూలి పనులకు వెళుతూనే కుటుంబం గడిచే పరిస్థితి. ఇద్దరు పిల్లలను చదివించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నప్పటికీ రోజువారి కష్టపడి సంపాదిస్తున్న డబ్బు సరిపోవటం లేదు. ప్రాథమిక విద్య వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఇద్దరి పిల్లలు చదువు ముందుకు సాగుతున్న కొద్దీ ఆ తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరో మార్గం లేక సుమారు 10 ఏళ్ల క్రితం ఖమ్మం వెళ్లారు. తండ్రి ఒక ఇంటికి వాచ్‌ మెన్‌ గా పనిచేస్తుండగా తల్లి అదే ఇంటిలో ఇంటి పనులు చేస్తోంది. ఈ విధంగా ఆ తల్లిదండ్రులు కష్టపడుతూ తన కుమారుడిని తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో పాటు కొంతమంది దాతల సహకారంతో ఎంబీబీఎస్‌ కోసం కిర్గిస్తాన్‌ పంపించారు. ఆ దేశంలో బుధవారం ఎంబీబీఎస్‌ పట్టా పొందాడు. ఒకవైపు కుమారుడు ఎంబీబీఎస్‌ పట్టా పొందుతుండగా మరోవైపు ఖమ్మంలో ఉంటున్న తల్లిదండ్రుల ఆనందం పరవళ్ళు తొక్కుతుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన కనకపూడి నరసయ్య, ప్రమీల దంపతులకు కుమారుడు కీర్తి కుమార్‌, కుమార్తె పరిమిల ఉన్నారు. వారిది అతి నిరుపేద దళిత కుటుంబం. ప్రతిరోజు కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు, కుమార్తె ఉన్నత స్థాయిలో ఉండాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్యనుంచే మంచి ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. కుమారుడు సోషల్‌ వెల్ఫేర్‌ లోనే ఇంటర్‌ విద్య వరకు పూర్తి చేశాడు. ఎంసెట్‌ లో మంచి ర్యాంకు సాధించడంతో ఎంబీబీఎస్‌ చదవాలనే పట్టుదల కీర్తి కుమార్‌కు కలిగింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ కుమారుడిని ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో తాము కష్టపడి నీకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూరుస్తామని కుమారుడికి ధైర్యం చెప్పారు. దీంతో కూలి పనుల మీద సంపాదించిన డబ్బు సరిపోకపోవడంతో పది సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ఖమ్మం వెళ్లారు. తండ్రి వాచ్‌ మెన్‌ గా, తల్లి ఆ ఇంటి పనులు చేస్తుంది. ఈ విధంగా వారు కష్టపడుతూ కుమారుడిని, కుమార్తెను చదివించుకుంటూ వస్తున్నారు. కుమారుడు కీర్తి కుమార్‌ కు కిర్గిస్తాన్‌ లో ఎంబిబిఎస్‌ సీటు వచ్చింది. ఎంబీబీఎస్‌ పూర్తి కావడంతో యూనివర్సిటీ నిర్వాహకులు కీర్తి కుమార్‌ కు ఎంబిబిఎస్‌ పట్టాను అందజేశారు. తన కుమారుడు తాము పడిన కష్టానికి ఫలితం దక్కించాడని తల్లిదండ్రులు ఆనందం లో మునిగి తేలుతున్నారు. కుమార్తె పరిమళ ఖమ్మంలోనే ఓ కాలేజీలో ప్రస్తుతం బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతుంది. కీర్తి కుమార్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

Spread the love