Friday, June 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమారుతున్న ట్రంప్‌ స్వరం

మారుతున్న ట్రంప్‌ స్వరం

- Advertisement -

– ఇరాన్‌పై అనుకూల వ్యాఖ్యలు
– ఆంక్షలపై దాటవేత ధోరణి
– చమురు కొనుగోళ్లపై రాజీ ధోరణి
– ఇజ్రాయిల్‌పై రుసరుస
– అమెరికా ఇంటలిజెన్స్‌ నివేదిక లీక్‌ తర్వాత మారిన వైఖరి

సంఘమిత్ర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వరం మార్చారు. ఇన్నాళ్ళూ ఇజ్రాయిల్‌ దుశ్చర్యలకు వంతపాడిన ఆయన, ఇరాన్‌ బలం తెలియగానే ప్లేటు మార్చేశారు. ఇరాన్‌ అనుకూల స్వరాన్ని ఎత్తుకున్నారు. ఇరాన్‌ అణ్వాయుధ కేంద్రాలపై అమెరికా చేసిన దాడులు పెద్దగా ఫలితం ఇవ్వలేదని అమెరికా రక్షణ ఇంటలిజెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చాక ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పైకి మాత్రం మేకపోతు గాభీర్యం ప్రదర్శిస్తూ గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మీడియాపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. సీఎన్‌ఎన్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలు ఫేక్‌ న్యూస్‌ ఇస్తున్నాయనీ, అమెరికా సైనికుల్ని అవమానిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఆ పత్రికల్ని ఎవరూ విశ్వసించట్లేదంటూ రుసరుసలాడారు. ఈ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు కూడా అదే స్థాయిలో ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ మీ ఇంటలిజెన్స్‌ రిపోర్టులు అబద్ధమా?’ అని ఎదురు ప్రశ్నించేసరికి నీళ్లు నమలడం ట్రంప్‌ వంతు అయ్యింది. ‘ఆ రిపోర్టు సంపూర్ణం కాదు. ధ్వంసం అయిఉం డొచ్చు…కాకపోయీ ఉండొచ్చు’ అని నివేదిక లో పేర్కొన్నారంటూ స్వయంగా ఆయనే వాస్తవాన్ని వెల్లడించారు. దీనితో మీడియా ప్రతినిధులు వరుస ప్రశ్నలు సంధించారు. ‘ఇరాన్‌ చాలా ధైర్యంగా పోరాడింది’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇరాన్‌తో చర్చలపై స్పందిస్తూ ‘అప్రస్తుతం’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతాయా? ఆ దేశం నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసేవాళ్లపై చర్యలు ఉంటాయా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ”ఇరాన్‌ నుంచి చమురును కొనుక్కోనివ్వండి. చైనా సహా ఏ దేశమైనా ఇరాన్‌ నుంచే కాదు…మా దగ్గరి నుంచి కూడా కొనుక్కోవచ్చు’ అని చెప్పుకొచ్చారు. ”ఇరాన్‌ యుద్ధంలో పాల్గొంది కాబట్టి, కొన్ని నష్టాలు ఉంటాయనీ, వాటిని పూడ్చుకోవాలి కదా! వాళ్ల ఆయిల్‌ను ఎవరూ కొనొద్దని నేను చెప్పొచ్చు.కానీ చెప్పను” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”ట్రంప్‌ మొదట బాంబులు వేస్తాడు. బెదరకపోతే వాళ్లతో రాజీకి వెళ్తాడు. ఇప్పుడు ఇరాన్‌ విషయంలోనూ అదే జరుగుతోంది’ అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నా రు. కేవలం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం, తక్షణ ఆర్థిక ప్రయోజనాల కోసం అందితే జుట్టు లేకుంటే కాళ్లు అనే చందంలో ట్రంప్‌ వ్యవహారశైలి ఉంటుందనే విషయాన్ని ఇరాన్‌ ప్రపంచదేశాలకు చెప్పకనే చెప్పేసింది. అదే సమయంలో కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయిల్‌ దాడులు చేయడంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు కినుక వహించారు. ట్రంప్‌ తనతో ఉన్నట్టో లేనట్టో అర్థం కావట్లేదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మెల్లగా ఇరాన్‌ అనుకూల వైఖరిని ఎత్తుకోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -